Mahaa Daily Exclusive

  హాలీవుడ్ హైదరాబాద్‌కు వచ్చినట్లే…..

Share

  • హాలీవుడ్ హైదరాబాద్‌కు వచ్చినట్లే
  • నెట్‌ఫ్లిక్స్ స్టూడియో ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
  • సినిమాలంటే తనకు మక్కువ అని వెల్లడి
  • ఫోర్త్ సిటీలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు
  • పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి రక్షణ కల్పిస్తామని హామీ

హైదరాబాద్, మహా : హైదరాబాద్ నగరం గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా ఎదుగుతోందని, నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ఇక్కడ ప్రారంభం కావడం అంటే హాలీవుడ్ హైదరాబాద్‌కు వచ్చినట్లే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం నగరంలో ఈ అత్యాధునిక వీఎప్ఎక్స్, వర్చువల్ ప్రొడక్షన్ హబ్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సినిమాల పట్ల తనకున్న మక్కువను పంచుకున్నారు. చిన్నతనం నుండి ఇప్పటి వరకు చిత్ర పరిశ్రమలో సాంకేతికంగా ఎన్నో మార్పులు వచ్చాయని, బాహుబలి, కల్కి, త్రిబుల్ ఆర్, అరుంధతి వంటి సినిమాలు తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటాయని ప్రశంసించారు.

ఒకప్పుడు చెన్నైకి పరిమితమైన తెలుగు చలనచిత్ర పరిశ్రమను లెజెండరీ నటులు ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాద్‌కు తీసుకువచ్చారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ, ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ తన రెండో భారతీయ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. తన ప్రభుత్వం గతంలోనే చెప్పినట్లుగా మా దృష్టి హాలీవుడ్ స్థాయి ప్రమాణాలపైనే ఉందని, నెట్‌ఫ్లిక్స్ రాకతో ఆ కల నిజం కాబోతోందని ఆనందం వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫోర్త్ సిటీలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని సీఎం వెల్లడించారు. నెట్‌ఫ్లిక్స్ తన కార్పొరేట్ కార్యాలయాన్ని కూడా ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని, అందుకు అవసరమైన భారీ ఆఫీస్ నిర్మాణానికి కావాల్సిన భూమిని కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆఫర్ ఇచ్చారు. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ విస్తరణకు ప్రభుత్వం నుండి పూర్తి సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రపంచంలోని టాప్ 500 కంపెనీలను తెలంగాణకు తీసుకురావడమే తమ లక్ష్యమని, ఇక్కడ పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి రక్షణ ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అంటేనే వ్యాపారం అని పేర్కొంటూ, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ మరియు కామిక్స్ రంగాల్లో హైదరాబాద్‌ను ప్రపంచ అగ్రగామిగా నిలుపుతామన్నారు.