- కోకాపేటలో అల్లు సినిమాస్
- ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- నేను సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్ ను
- అల్లు అర్జున్ హాలీవుడ్ స్థాయికి వెళ్ళాలి
కోకాపేట, మహా
కోకాపేటలో అల్లు సినిమాస్‌ను ఆసియాలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్ కలిగిన మల్టీప్లెక్స్‌గా రూపొందించారు. అల్లు సినిమాస్‌ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ప్రారంభించారు. రేవంత్‌రెడ్డికి సినీనటుడు అల్లు అర్జున్ స్వాగతం పలికారు. అల్లు సినిమాస్‌లో అల్లు రామలింగయ్య విగ్రహానికి సీఎం, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నివాళులు అర్పించారు. అల్లు సినిమాస్‌లో ఏర్పాట్లను సీఎంకు అల్లు అరవింద్, అల్లు అర్జున్ వివరించారు. అల్లు సినిమాస్‌లోని స్క్రీన్లను రేవంత్‌రెడ్డి పరిశీలించారు. డాల్బీ విజన్ స్క్రీన్‌లో అల్లు అర్జున్‌తో కలిసి సినిమా చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకులు, నిర్మాతలు, నటీనటులు పాల్గొన్నారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఫహీం ఖురేషీ, ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు పలువురు పాల్గొన్నారు.
నేను సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్ ను – సీఎం
తాను సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్ ను అని, తాను వనపర్తిలో చదువుకునే సమయంలో సినిమాలు చూడటానికి లారీలో 100 కిలోమీటర్ల దూరంలోని కర్నూలుకు వెళ్లి సెకండ్ షో చూసి వచ్చేవాళ్లమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆ రోజుల్లో హైదరాబాద్ లేదా కర్నూలు వంటి నగరాల్లో మాత్రమే సినిమాలు విడుదలయ్యేవని నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. వనపర్తి వంటి పట్టణాల్లో సినిమాలు విడుదలయ్యేవి కాదని, కాబట్టి మొదటి రోజునే సినిమా చూసేందుకు లారీల్లో కర్నూలు వెళ్లేవాళ్లమని అన్నారు. హైదరాబాద్‌లో అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తాను కృష్ణ అభిమానిని అని తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణ ఒక సంవత్సరంలో 15 నుంచి 16 సినిమాల్లో నటించిన రోజుల నుంచి ఈరోజుల్లో ఐదారేళ్లకు ఒక సినిమాలో నటించే హీరోలను చూస్తున్నామని అన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ కోలీవుడ్ లేదా బాలీవుడ్‌తో పోటీపడకుండా, హాలీవుడ్‌తో పోటీ పడాలని అన్నారు. హాలీవుడ్ సినిమాలు కూడా ఇక్కడ ప్రదర్శించబడాలని ఆకాంక్షించారు. సినిమా పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. అల్లు అర్జున్ హాలీవుడ్‌లోనూ రాణించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. సాంకేతికంగా మన హాలీవుడ్‌తో పోటీపడాలని అన్నారు. అల్లు అరవింద్ ఎదిగిన తీరును చూసి స్వర్గంలో ఉన్న అల్లు రామలింగయ్య మనసు ఉప్పొంగిపోతుందని అన్నారు.
……….








