- ఆర్టీసీలో సమ్మె సైరన్
- యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చిన జేఏసీ నేతలు
- ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నది ప్రధాన డిమాండ్
- సమ్మెకు ఎప్పుడనేది త్వరలోనే వెల్లడి
- యాజమాన్యంతో కాదు ప్రభుత్వంలోనే యుద్ధమని వెల్లడి
హైదరాబాద్, మహా : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో యాజమాన్యానికి జేఏసీ నేతలు సమ్మె నోటీసు ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. 2021 వేతన సవరణ 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని, మహాలక్ష్మి పథకం కింద ప్రతినెలా రూ.350 కోట్లు కోత లేకుండా ఇవ్వాలని వారు నోటీసుల్లో కోరారు. పాత బకాయిలు రూ.2,500 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరుతూనే, ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కూడా వారు డిమాండ్ చేశారు. అలాగే ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలని వారు యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు.
నోటీసులు ఇచ్చే ముందు కార్మిక సంఘాలు హైదరాబాద్‌లోని బస్‌భవన్ వద్ద నిరసనకు దిగారు. ఈవీ బస్సులపై ఆర్టీసీ ఉద్యోగులే పనిచేయాలని, వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలని ధర్నా చేపట్టారు. ఆర్టీసీని ఎందుకు ప్రభుత్వంలో ఎందుకు విలీనం చేయడం లేదని, అన్యాయంగా యూనియన్లను సర్కారు రోడ్డెక్కించిందని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని నేతలు తేల్చిచెప్పారు. గవర్నర్ వద్ద ఉన్న ఆర్టీసీ విలీన బిల్లుకు ఆమోదముద్ర ఎందుకు వేయించడం లేదని ప్రశ్నించారు. కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యాజమాన్యంతో కాదు…. ప్రభుత్వంతోనే యుద్ధం
రెండున్నర ఏళ్లు ఎదురు చూశామని ఇక తమకు ఓపిక నశించిపోయిందని కార్మిక సంఘాల జేఏసీ వ్యాఖ్యానించింది. ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు భరోసా లేదని, బరోసా లేని తాము ఎలా బతకాలని వాపోయారు. తమకు బడ్జెట్లో ప్రత్యేకంగా వాటా కావాలన్నారు. బ్రెడ్ విన్నర్ స్కీమ్‌ను ఎందుకు మార్చరని ప్రశ్నించిన ఆర్టీసీ జేఏసీ నేతలు, యాజమాన్యానికి తనకు ఎలాంటి యుద్ధం లేదని చెప్పారు. కేవలం ప్రభుత్వంతోనే యుద్ధమన్నారు. తాము ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని సభలు పెట్టినా ఈ ప్రభుత్వం చర్చలకు కూడా పిలువలేదని, అసలు రాష్ట్రంలో ప్రజాపాలన ఉందా? అని ఆర్టీసీ జేఏసీ ప్రశ్నించింది. గత ప్రభుత్వం చేయాల్సిన క్రతువు చేసిందని ఈ ప్రభుత్వం మిగిలింది ఎందుకు చేయలేదని ప్రశ్నలు సంధించారు.
మెట్రోను స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం ఆర్టీసీపై ఎందుకు వివక్ష
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై ఇప్పుడు ఏం చెబుతారని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక సమాజానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని మండిపడ్డారు. ఆర్టీసీ హక్కులను కాపాడుతామని, ఆర్టీసీతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం ముందుకు పోలేదని హెచ్చరించారు. మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని, మరి ఆర్టీసీని ఎందుకు ప్రభుత్వంలో విలీనం చేసుకోవడం లేదని జేఏసీ నేతలు ప్రశ్నించారు. తమ డిమాండ్ల సాధన కోసం అవసరమైతే అసెంబ్లీ ముందు ఆందోళనకు సైతం వెనుకాడబోమని స్పష్టం చేశారు. జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు వారు తెలిపారు.








