Mahaa Daily Exclusive

  అగ్రరాజ్యంలో అంబానీ సామ్రాజ్యం…..

Share

  • అగ్రరాజ్యంలో అంబానీ సామ్రాజ్యం
  • అమెరికాలో 27లక్షల కోట్ల ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టు
  • ప్రపంచ రాజకీయ సమీకరణలు మార్చనున్న ప్రాజెక్ట్

(మహా ప్రత్యేకం)
అగ్రరాజ్యం అమెరికా గడ్డపై భారతీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అడుగుపెట్టడం అనేది కేవలం ఒక వ్యాపార ఒప్పందం మాత్రమే కాదు, ఇది భూగోళ రాజకీయ సమీకరణాలను మార్చేసే ఒక భారీ పరిణామం. 27లక్షల కోట్ల పెట్టుబడితో టెక్సాస్‌లో నిర్మించబోయే ఈ రిఫైనరీ ప్రాజెక్ట్ ప్రపంచంలోనూ ఓ సంచలనం. డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికా, ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌తో చేతులు కలపడం వల్ల అమెరికా ఎనర్జీ సూపర్‌పవర్’ గా ఎదిగే ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఇది కేవలం వ్యాపారం కాదు, రెండు దేశాల మధ్య ఆర్థిక బంధాన్ని పటిష్టం చేసే ఒక చారిత్రాత్మక మలుపుగా మారుతుందన్న అంచనాలున్నాయి.

1. అమెరికాకు రిలయన్స్ అవసరం ఎందుకు?
అన్ని రంగాల్లో అగ్రగామి అయిన అమెరికా, ఈ ప్రాజెక్ట్ కోసం రిలయన్స్‌ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం ‘నిపుణత’

ప్రపంచ స్థాయి అనుభవం: గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీని అత్యంత తక్కువ ఖర్చుతో, అత్యధిక సామర్థ్యంతో నడుపుతున్న ట్రాక్ రికార్డ్ రిలయన్స్‌కు ఉంది.

సాంకేతిక నైపుణ్యం: సంక్లిష్టమైన ముడి చమురును అత్యుత్తమ నాణ్యత గల ఇంధనంగా మార్చడంలో రిలయన్స్ సాంకేతికత తిరుగులేనిది. 50 ఏళ్లుగా కొత్త రిఫైనరీలు నిర్మించని అమెరికాకు, రిలయన్స్ వంటి సంస్థ ఇచ్చే ‘మోడ్రన్ ఇంజనీరింగ్’ ఎంతో అవసరం.

నిర్వహణ దక్షత: రిఫైనరీని నిర్మించడమే కాదు, దాన్ని లాభసాటిగా నడపడంలో రిలయన్స్ చూపే ఆపరేషన్ ఎక్స్ లెన్స్ ప్రపంచానికే పాఠం.

2. అమెరికాకు చేకూరే లాభం ఏమిటి?

ఇంధన భద్రత : కొత్త రిఫైనరీ ద్వారా అమెరికా తన చమురు అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది.

ఉపాధి కల్పన: వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయి. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊతం.

ఎగుమతుల జోరు: శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా అమెరికా భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తుంది.

3. రిలయన్స్ కు కలిగే ప్రయోజనం ఏంటి?

గ్లోబల్ లీడర్‌షిప్: ప్రపంచ చమురు మార్కెట్లో రిలయన్స్ ఒక ‘గ్లోబల్ ప్లేయర్’గా తన ముద్రను మరింత బలోపేతం చేసుకుంటుంది.

ముడి చమురు లభ్యత: అమెరికాలోని షేల్ గ్యాస్, చమురు నిక్షేపాలకు నేరుగా ప్రాసెస్ చేసే అవకాశం దక్కడం వల్ల ముడి చమురు సరఫరాలో స్థిరత్వం లభిస్తుంది.

దీర్ఘకాలిక లాభాలు: 20 ఏళ్ల ఒప్పందం అంటే, దశాబ్దాల పాటు స్థిరమైన ఆదాయం మరియు అంతర్జాతీయ మార్కెట్లో పట్టు లభిస్తుంది.

4. భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై ప్రభావం

ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరో మెట్టు ఎక్కించింది.

విశ్వసనీయత: అమెరికా వంటి దేశం తన వ్యూహాత్మక ఇంధన రంగాన్ని భారతీయ సంస్థకు అప్పగించడం అంటే, భారత్ పట్ల వారికి ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం.

ద్వైపాక్షిక వాణిజ్యం: ఈ ప్రాజెక్ట్ ద్వారా భారత్-అమెరికా మధ్య వర్తక వాణిజ్య విలువలు రికార్డు స్థాయికి చేరుకుంటాయి.

చారిత్రాత్మక మలుపు

అగ్రరాజ్యం అమెరికాలో దిగ్గజ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అమెరికాలోని టెక్సాస్ బ్రౌన్స్‌విల్ ప్రాంతంలో దాదాపు 50 ఏళ్ల తర్వాత ఒక కొత్త, అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాన్ని నిర్మించబోతున్నట్లు, ఈ ప్రాజెక్ట్ విలువ 300 బిలియన్ డాలర్లు (రూ. 27 లక్షల కోట్లు) అని ప్రకటించారు యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. దీంట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్.. భారీగా పెట్టుబడులు పెట్టనుందని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. రిలయన్స్ కీలక భాగస్వామ్యంతోనే ఈ ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు కానుందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌తో అమెరికా ఇంధన ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందని.. ఎగుమతులు పెంచేందుకు సాయపడుతుందని వెల్లడించారు. రిలయన్స్ కేవలం ప్రధాన పెట్టుబడిదారుగానే కాదు.. సాంకేతిక, నిర్మాణ భాగస్వామిగా ఉంటుంది. నిర్వహణ, శుద్ధి కూడా రిలయన్స్ చేతుల్లోనే ఉంటుంది. మార్కెటింగ్‌లోనూ కీలక పాత్ర రిలయన్స్ ఇండస్ట్రీస్‌దే అని చెప్పొచ్చు. ఇందులో భాగంగా 20 ఏళ్ల కాలానికి రిలయన్స్.. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు అన్ని రంగాల్లోనూ అగ్రగామిన ఉన్న అమెరికాకు.. ఈ భారీ రిఫైనరీ ప్రాజెక్టులో రిలయన్స్ సహకారం తీసుకోవడం వెనుక పెద్ద స్ట్రాటజీనే ఉంది.

తిరుగులేని రిలయన్స్

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ కాంప్లెక్స్‌ను గుజరాత్‌ జామ్‌నగర్‌లో నిర్వహిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన రిఫైనరీల్ని నిర్మించిన ఈ రిలయన్స్ అనుభవం.. అమెరికాకు కావాలి. అలాగే.. అమెరికా వంటి అతిపెద్ద ఇంధన మార్కెట్లోకి నేరుగా ప్రవేశించే అవకాశం రిలయన్స్‌కు దక్కుతుంది. తక్కువ నాణ్యత కలిగిన ముడి చమురును కూడా అత్యంత స్వచ్ఛమైన పెట్రోల్, డీజిల్‌గా మార్చే టెక్నాలజీ రిలయన్స్ దగ్గర ఉంది. ప్రస్తుతం రష్యా సహా ఇతర దేశాల నుంచి తక్కువ ధరకు ముడి చమురును కొనుగోలు చేసి శుద్ధి చేయడంలో మంచి అనుభవం ఉంది. అమెరికా, ఐరోపా ప్రమాణాలకు తగ్గట్లుగా రూపొందించడంలో దిట్ట. ఇప్పుడు అమెరికాలో ప్లాంట్ ద్వారా.. అక్కడ విస్తృతంగా లభ్యమయ్యే.. షేల్ ఆయిల్‌ను తక్కువ ఖర్చుతో శుద్ధి చేసి లాభాలు పొందొచ్చు. ఇది అమెరికాకు కూడా ఎంతో మేలు చేయనుంది. ఇక్కడ అమెరికా కేవలం రిలయన్స్ నుంచి పెట్టుబడులు మాత్రమే ఆశించట్లేదు. ఏకంగా రిలయన్స్ బ్లూప్రింట్‌‌నే కోరుకుంటోంది. అమెరికా కంపెనీలు చాలా వరకు గ్రీన్ ఎనర్జీ వైపు మొగ్గుచూపుతుండగా.. పెట్రోలియం రంగంలో ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు అంతర్జాతీయ స్థాయిలో అనుభవం, అలాగే నగదు నిల్వలు రిలయన్స్ దగ్గర ఉన్నాయి. ఇతర దేశాలకు చెందిన కొన్ని కంపెనీలు ముందుకొచ్చినప్పటికీ.. అమెరికా నమ్మకమైన భాగస్వామిగా రిలయన్స్‌ను ఎంచుకుంది. ఇంకా రిలయన్స్ లో కాస్ట్ ఆపరేషన్ మోడల్ కూడా అమెరికాకు నచ్చిందని తెలుస్తోంది.
ఈ కొత్త ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్ట్ ప్రధానంగా షేల్ ఆయిల్ ఆధారంగానే నడుస్తుందని సదరు ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ పేర్కొంది. అమెరికాలో ఇప్పటికే ఉన్న రిఫైనరీల్ని.. ఎక్కువగా గల్ఫ్ దేశాల నుంచి వచ్చే హెవీ ఆయిల్‌ను శుద్ధి చేసేలానే రూపొందించారు. అయితే అమెరికాలో ఎక్కువగా దొరికే షేల్ ఆయిల్‌ను శుద్ధి చేయడంలో రిలయన్స్‌కు మంచి పట్టు ఉంది. దీంతో ఈ రిఫైనరీలో ఉత్పత్తి అయ్యే ఇంధనాల్ని రిలయన్స్ కొనుగోలు చేయనుందని ఏఎఫ్ఆర్ తెలిపింది. అందుకే అక్కడ ప్లాంట్ ఉండటం వల్ల రవాణా ఖర్చులు తగ్గి లాభాలు ఇంకా పెరుగుతాయని చెప్పొచ్చు. ఇక్కడ అమెరికా దగ్గర ముడి చమురు ఉంది. రిలయన్స్ దగ్గర డబ్బు, అత్యాధునిక టెక్నాలజీ ఉంది. ఈ సామర్థ్యాలతో షేల్ గ్యాస్ ఆధారిత చమురును శుద్ధి చేసి తిరిగి అమెరికా మార్కెట్ సహా ఇతర దేశాలకు విక్రయిస్తుంది. వచ్చే లాభాల్ని పంచుకుంటాయి. ఈ ఒప్పందంలో భాగంగా మొత్తంగా.. 125 బి. డాలర్ల విలువైన క్రూడాయిల్, 175 బి.డాలర్ల విలువైన రిఫైన్డ్ ప్రొడక్ట్స్‌ ఉత్పత్తి జరుగుతుంది. దీంతో అమెరికా రోజుకు 13.6 మిలియన్ బ్యారెల్స్ చమురు ఉత్పత్తి చేస్తుంది. ఇది సౌదీ అరేబియా, రష్యా కంటే ఎక్కువ. 2014-2024 మధ్య 10 బిలియన్ బ్యారెల్స్ సొంత ఆయిల్‌ను ఎగుమతి చేసి, 1.8 ట్రిలియన్ డాలర్ల విలువైన విదేశీ చమురును దిగుమతి చేసుకుంది. కారణం.. షేల్ ఆయిల్‌ను శుద్ధి చేసే చమురు కర్మాగారాలు పెద్దగా లేకపోవడమే. ఆ కొరతను తీర్చుకునేందుకే ఇప్పుడు పెద్ద రిఫైనరీని నిర్మిస్తోంది.

 

అమెరికాకు లాభమిదే

ప్రధానంగా సొంత దేశంలో ఉత్పత్తి పెరగడం వల్ల విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవచ్చు. స్థానికంగా వేలాది మందికి ఉపాధి కలుగుతుంది. దీంతో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. ఇప్పటివరకు చమురు విషయంలో గల్ఫ్ దేశాల ఆధిపత్యమే ఎక్కువగా ఉండేది. అదే అమెరికాలో ఇలాంటి భారీ రిఫైనరీలు వస్తే.. చమురు మార్కెట్ నియంత్రణ.. గల్ఫ్ దేశాల చేతుల నుంచి అమెరికా, భారత్ వంటి భాగస్వామ్య దేశాల వైపు మళ్లుతుంది. చమురు రంగంలో చైనా ప్రభావం కూడా ఏమాత్రం పెరగకుండా చూడాలని అమెరికా భావిస్తోంది. భారత్‌కు చెందిన రిలయన్స్ వంటి సంస్థతో డీల్ చేసుకోవడం వల్ల అమెరికాకు ఒక భరోసా ఉంటుంది.
రష్యాపై ఇప్పటికే ఆంక్షల కారణంగా.. ఐరోపా, అమెరికా దేశాలు బలమైన ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నాయి. ఇప్పుడు.. అమెరికాలోనే రిఫైనరీ ఉండటం వల్ల.. ముడి చమురును ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. ఇది అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినా అమెరికా మార్కెట్‌ను కాపాడుతుంది.

తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..

భారత్ రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లుగా.. సాధారణంగా ముడిచమురు ఒక చోట దొరుకుతుంది.. మరో చోట శుద్ధి అవుతుంది. అక్కడి నుంచి వినియోగదారులకు చేరుతుంది. దీనివల్ల రవాణా ఖర్చులు సాధారణంగానే చాలా ఎక్కువగా ఉంటాయి. అదే ఇప్పుడు అమెరికాలోనే చమురు వెలికి తీసి.. అక్కడే రిఫైనరీలో శుద్ధి చేస్తే.. రవాణా ఖర్చులు పెద్దమొత్తంలో తగ్గుతాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంటుంది.

భారత్‌కు ప్రయోజనం ఏంటి?

భారత్ ఇప్పటికీ చమురు విషయంలో ఎక్కువగా రష్యా సహా ఇరాక్, సౌదీ అరేబియా వంటి మిడిల్ ఈస్ట్ దేశాలపైనే ఆధారపడుతోంది. భారత చమురు అవసరాల్లో 80 శాతానికిపైగా దిగుమతుల నుంచే వస్తుంది. చమురు రవాణాకు కీలకమైన.. హార్ముజ్ జలసంధి దగ్గర ఏదైనా ఆటంకం వస్తే.. భారత ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలుగుతోంది. ఇప్పుడు అమెరికాలో కొత్త ఆయిల్ రిఫైనరీ.. భారత్‌కు స్థిరమైన చమురు సరఫరాను అందిస్తుందని చెప్పొచ్చు. ఇది మిడిల్ ఈస్ట్ దేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ పార్ట్‌నర్ వివేక్ ఖాత్రి ప్రకారం.. ఇది భారత్‌కు ఇన్సూరెన్స్ పాలసీ వంటిది. రష్యా నుంచి డిస్కౌంట్‌లో చమురు పొందడం, మిడిల్ ఈస్ట్ దేశాలతో ఎప్పటినుంచో ఒప్పందాలు ఉండటం, అమెరికాతో తాజా డీల్ ఒక మల్టీ సోర్స్ వ్యూహం అని చెబుతున్నారు.

వాణిజ్య సంబంధాలు కూడా

భారత్- అమెరికా మధ్య ప్రస్తుతం వాణిజ్య సంబంధాలు మరీ అంత గొప్పగా ఏం లేవు. ఇప్పటికీ ట్రంప్.. విచ్చలవిడిగా భారత ఉత్పత్తులపై సుంకాలు విధిస్తూనే ఉన్నారు. ఎప్పుడేం చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. చాలా కాలం తర్వాత ఇటీవలే పూర్తి స్థాయిలో కాకుండా.. రెండు దేశాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇప్పుడు రిలయన్స్ భాగస్వామ్యంతో.. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు మరింత బలపడే అవకాశం స్పష్టంగా ఉంది.

అమెరికాలో షేల్ ఆయిల్ ?

షేల్ ఆయిల్ భూగర్భంలోనే ఉండే ఒక రకమైన అసాధారణ ముడి చమురు. సాధారణ చమురుతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ఇది భూ ఉపరితలం కింద చాలా లోతులోని షేల్ అనే గట్టి పొరల రాళ్ల మధ్య చిక్కుకొని ఉంటుంది. సాధారణ చమురు బావుల్లా దీనిని పైపులు వేసి తోడలేరు. హారిజొంటల్ డ్రిల్లింగ్, హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ అనే ప్రత్యేక పద్ధతుల్లో ఈ చమురును వెలికితీస్తారు. ఇది చాలా కాస్ట్‌లీ ప్రాసెస్. అందుకే సాధారణ చమురుతో పోలిస్తే.. షేల్ ఆయిల్ తీసేందుకు కొంచెం ఎక్కువ ఖర్చే అవుతుంది. దీనిని శుద్ధి చేసేందుకు ప్రత్యేక రిఫైనరీ ప్లాంట్లు కావాలి. రిలయన్స్‌కు.. ఇప్పటికే అమెరికాలోని షేల్ ఆయిల్ క్షేత్రాల్లో పెట్టుబడులు పెట్టిన అనుభవం ఉంది కాబట్టి.. అమెరికా కూడా దీనివైపు మొగ్గుచూపింది. రిలయన్స్‌తో డీల్ వ్యవహారం.. ఇదంతా ఇప్పుడు మొదలైంది కాదు. ఎప్పటినుంచో చర్చలు జరుగుతున్నట్లు భావిస్తున్నారు. ఇటు దేశానికి, అటు అంబానీకి ఇద్దరికీ ఉపయోగపడితే అదే చాలని వ్యాపారరంగ నిపుణులు అంటున్నారు.