Mahaa Daily Exclusive

  శ్రీనివాసగిరి అభివృద్ధికి మంత్రి పొంగులేటి హామీ….

Share

శ్రీనివాసగిరిని ప్రకృతి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం
* మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ
* శ్రీనివాసగిరిపై భక్తి పారవశ్యం.. భక్తులతో కలిసి నడిచిన మంత్రి పొంగులేటి
* అధికార ఆడంబరాలు పక్కన పెట్టి సామాన్యుడిలా కాలినడకన గిరిశిఖరానికి
* భార్య మాధురితో కలిసి స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ
* వైభవంగా శ్రీనివాసుని కల్యాణం గోవింద నామస్మరణతో మార్మోగిన పాల్వంచ
భద్రాద్రి బ్యూరో, మహా:
శ్రీనివాసగిరిని ప్రకృతి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన తిరుకళ్యాణ మహోత్సవం కనులపండువగా జరిగింది. కొండపై వేద పండితుల మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి కల్యాణ వేడుక అత్యంత వైభవంగా సాగింది. ఈ పుణ్యకార్యంలో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన భార్య మాధురితో కలిసి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
దర్శనం తర్వాత మంత్రి మాట్లాడుతూ ప్రకృతి ఒడిలో ఉన్న శ్రీనివాసగిరిని దర్శించుకోవడం నా అదృష్టమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అటవీ శాఖ అధికారుల సహకారంతో ఈ క్షేత్రాన్ని గొప్ప ఎకో టూరిజం(ప్రకృతి పర్యాటక) కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తాం అని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆ స్వామిని వేడుకున్నట్లు తెలిపారు.
*సామాన్య భక్తుడిలా..*
ఈ వేడుకలో అందరినీ ఆకట్టుకున్న ప్రధానాంశం మంత్రి పొంగులేటి దంపతుల రాక. సామాన్యుడిలా భక్తుల 1,600 మెట్లను కాలినడకన ఎక్కుతూ గిరిశిఖరానికి చేరుకున్నారు. దారి పొడవునా గోవింద నామస్మరణ చేస్తూ తనను పలకరించిన భక్తులకు చిరునవ్వుతో సమాధానమిస్తూ ముందుకు సాగారు. దేవుని దగ్గర అందరూ సమానమే అని ఆయన చాటిచెప్పారు.
*లోక కల్యాణం కోసం ‘సిరి’ కల్యాణం..*
ఆలయానికి చేరుకున్న మంత్రి దంపతులకు ఆలయ కమిటీ ఘనస్వాగతం పలికారు. స్వామివారికి మంత్రి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జరిగిన కళ్యాణ వేడుకను భక్తిశ్రద్ధలతో వీక్షించారు. పండితులు వారికి ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు.