Mahaa Daily Exclusive

  డ్రగ్స్ పరీక్షలకు నేను రెడీ:కేటీఆర్

Share

  • డ్రగ్స్ పరీక్షలకు నేను రెడీ
  • పీసీసీ చీఫ్ ప్రతిపాదనను స్వాగతిస్తున్నా
  • సంబంధం లేని విషయాల్లో నా పేరు ప్రస్తావిస్తే సహించం
  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, మహా
సమాజంలో మాదకద్రవ్యాల వాడకం పెరగడం అత్యంత దురదృష్టకరమని, దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. డ్రగ్స్ వాడకాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ఖండిస్తుందని, ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా ఎవరైనా సరే కఠిన శిక్షలు అనుభవించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. తాను ఏ విధమైన పరీక్షకైనా, ఏ సమయమైనా సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఇదిలా ఉంటే.. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతి చిన్న విషయంలోనూ తన పేరును డ్రగ్స్ వివాదాల్లోకి లాగడంపై కేటీఆర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. “ప్రతీసారి ఆధారాలు లేకుండా నా పేరును ప్రస్తావిస్తే ఇకపై ఉపేక్షించేది లేదు.. చట్టపరంగా కఠినంగా స్పందిస్తా” అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే పలుమార్లు తాను పరీక్షలకు సిద్ధమని చెప్పినప్పటికీ, కావాలనే బురదజల్లే రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా తమ మద్దతు ఉంటుందని, కానీ వ్యక్తిత్వ హననానికి పాల్పడితే మాత్రం సహించబోమని కేటీఆర్ తేల్చి చెప్పారు.