Mahaa Daily Exclusive

  ఘనంగా ముగిసిన మహిళల హాకీ వరల్డ్ క్వాలిఫయింగ్ పోటీలు…

Share

  • ఘనంగా ముగిసిన మహిళల హాకీ వరల్డ్ క్వాలిఫయింగ్ పోటీలు
  • తెలంగాణ క్రీడా రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన క్రీడా వేడుక

హైదరాబాద్, మహా : నగరం మరోసారి అంతర్జాతీయ క్రీడా వేదికగా నిలిచింది. నగరంలోని గచ్చిబౌలి హాకీ స్టేడియం వేదికగా నిర్వహించిన మహిళల హాకీ వరల్డ్ క్వాలిఫయింగ్ పోటీలు క్రీడా ప్రపంచాన్ని ఆకట్టుకుంటూ విజయవంతంగా ముగిశాయి. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ పోటీలు కేవలం క్రీడలకే పరిమితం కాకుండా, తెలంగాణ ఆతిథ్యం, నిర్వహణ సామర్థ్యం, క్రీడల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతను ప్రపంచానికి చాటి చెప్పాయి. మార్చి 8న జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై పోటీలను ఘనంగా ప్రారంభించారు. వివిధ దేశాల నుంచి వచ్చిన క్రీడాకారులు, అధికారులు, ప్రేక్షకులతో స్టేడియం కిక్కిరిసిపోయి పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ప్రారంభ వేడుకలు తెలంగాణ సంస్కృతి, క్రీడా ఉత్సాహం కలగలిపిన ఒక విశేషమైన క్షణంగా నిలిచాయి.
ప్రపంచ కప్ అర్హత కోసం పోటీ
ఈ క్వాలిఫయింగ్ పోటీలు ప్రపంచ హాకీ క్యాలెండర్‌లో ఎంతో ప్రాముఖ్యత కలిగినవి. ఆగస్టు 14 నుంచి 30 వరకు నేథర్లండ్స్ మరియు బెల్జియం దేశాల్లో జరగబోయే మహిళల హాకీ ప్రపంచ కప్ పోటీలకు అర్హత సాధించేందుకు ఈ మ్యాచ్లు నిర్వహించబడ్డాయి.
ఈ పోటీల్లో భారత్‌తో పాటు ఆస్ట్రియా , ఇంగ్లాండ్ , ఇటలీ , కొరియా, స్కోట్లాండ్ , ఉరుగ్వే వేల్స్ వంటి దేశాల జట్లు పాల్గొన్నాయి. ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతూ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ప్రపంచంలోని విభిన్న దేశాల ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ క్రీడా స్ఫూర్తిని ప్రతిబింబించారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాట్లు
ఈ పోటీల నిర్వహణలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అత్యంత శ్రద్ధతో పని చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా గచ్చిబౌలి హాకీ స్టేడియంలో ఆధునిక ఆస్ట్రోటర్ఫ్‌ను ఏర్పాటు చేశారు. స్టేడియం పరిసరాలను అంతర్జాతీయ మ్యాచ్‌లకు అనువుగా అభివృద్ధి చేసి, ప్రేక్షకులకు ఉత్తమ వీక్షణ అనుభూతి కలిగించేలా అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
విదేశీ జట్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భద్రత, వసతి, రవాణా, వైద్య సేవలు వంటి అన్ని అంశాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి జట్టుకు ప్రత్యేక లైసన్ ఆఫీసర్లను నియమించి వారి అవసరాలను సమన్వయం చేశారు. హాకీ ఇండియా ప్రతినిధులతో కలిసి ప్రతి అంశాన్ని పర్యవేక్షిస్తూ పోటీల నిర్వహణను విజయవంతం చేశారు.
హైదరాబాద్‌కు విచ్చేసిన క్రీడాకారులు, సాంకేతిక నిపుణులు, అధికారులు తెలంగాణ ఆతిథ్యంపై ప్రశంసలు కురిపించారు. నగర ప్రజల ఆత్మీయత, నిర్వహణలో చూపిన నిబద్ధత తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని వారు పేర్కొన్నారు.

ఉత్సాహంగా పాల్గొన్న రాష్ట్ర నాయకత్వం

ఈ పోటీలకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు అందించింది. ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ముగింపు వేడుకలకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సీతక్క, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ భారత క్రికెటర్ మరియు ప్రజాప్రతినిధి మహమ్మద్ అజహరుద్దీన్ తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై క్రీడాకారులను ప్రోత్సహించారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా పెద్ద సంఖ్యలో ఈ పోటీలను వీక్షించారు. ప్రత్యేక ముఖ్య కార్యదర్శులు జయేశ్ రంజన్, సవ్యసాచి ఘోష్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా,
సింగరేణి సంస్థల సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్ డీజీపీ శివధర్ రెడ్డి, సమాచార శాఖ కమిషనర్ ప్రియాంక టీజీఎస్పీడీసీఎల్ సిఎండి జితేష్ వి పాటిల్, సింగరేణి సంస్థల పర్సనల్ ఆఫీసర్ భార్గవ్ పాత్రో
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీమతి సృజన తదితరులు హాజరయ్యారు.

క్రీడా ప్రముఖుల ఆదరణ

ఈ పోటీలకు పలువురు ప్రముఖ క్రీడాకారులు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ట్రిపుల్ ఒలింపియన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత ముకేశ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని యువ క్రీడాకారులను ప్రోత్సహించారు.
తెలంగాణకు చెందిన మహిళా క్రీడాకారిణులు నిధి కుల్లర్, ఎండల సౌందర్య, అర్జున అవార్డు గ్రహీతలు ఇషా సింగ్, దీప్తి జీవన్ జీ, అథ్లెట్ సత్తి గీత వంటి క్రీడా ప్రముఖులు ఈ పోటీలకు హాజరయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు మాజీ హాకీ క్రీడాకారులు కూడా స్టేడియానికి విచ్చేసి మ్యాచ్‌లను వీక్షించారు.
ప్రేక్షకులతో కళకళలాడిన స్టేడియం
ఈ పోటీలకు ప్రేక్షకుల స్పందన విశేషంగా కనిపించింది.

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చేపట్టిన విస్తృత ప్రచారం వల్ల యువత పెద్ద సంఖ్యలో స్టేడియానికి తరలి వచ్చారు. హాకీ మ్యాచ్లకు టికెట్లు పెద్దఎత్తున అమ్ముడుపోవడం ఈ క్రీడకు ఉన్న ఆదరణను తెలియజేసింది.
ఆన్‌లైన్ టికెట్ వ్యవస్థ ద్వారా ప్రేక్షకులు సులభంగా టికెట్లు కొనుగోలు చేసి మ్యాచ్‌లను వీక్షించారు. మ్యాచ్‌ల మధ్య విరామ సమయంలో నిర్వహించిన లేజర్ షో, సంగీత కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. దీంతో స్టేడియం మొత్తం ఒక క్రీడా ఉత్సవంలా మారింది.

తెలంగాణ క్రీడా రంగానికి కొత్త మైలురాయి

ఈ పోటీల విజయవంతమైన నిర్వహణకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సోనీ బాలాదేవి నేతృత్వంలో స్పోర్ట్స్ అథారిటీ అధికారులు, హాకీ ఇండియా ప్రతినిధులు మరియు అంతర్జాతీయ హాకీ సమాఖ్య అయిన ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (FIH) మధ్య ఉన్న సమన్వయం కీలకంగా నిలిచింది.
అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీలను నిర్వహించడం ద్వారా తెలంగాణ రాష్ట్రం క్రీడా రంగంలో తన సామర్థ్యాన్ని మరోసారి నిరూపించింది. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ క్రీడా పోటీలకు హైదరాబాద్ కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గచ్చిబౌలిలో జరిగిన మహిళల హాకీ వరల్డ్ క్వాలిఫయింగ్ పోటీలు తెలంగాణ క్రీడా చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచాయి. ఈ పోటీల ద్వారా రాష్ట్రం క్రీడల అభివృద్ధికి ఎంత ప్రాధాన్యం ఇస్తోందో ప్రపంచానికి తెలిసింది.
క్రీడాకారుల ప్రతిభ, ప్రేక్షకుల ఉత్సాహం, ప్రభుత్వ సహకారంకలిసి ఈ పోటీలను ఒక విశేషమైన క్రీడా పండుగగా మార్చాయి. భవిష్యత్తులో కూడా ఇటువంటి అంతర్జాతీయ పోటీలు హైదరాబాద్‌లో మరింతగా నిర్వహించబడాలని క్రీడాభిమానులు ఆశిస్తున్నారు.