Mahaa Daily Exclusive

  యుద్ధం సాకు.. దళారుల దోపిడీ అన్ స్టాపబుల్: గ్యాస్ సిలిండర్ల మాయాజాలంలో నెలకు రూ. 190 కోట్ల కుంభకోణం!

Share

* ‘యుద్ధం’ నెపంతో సామాన్యుడిపై దోపిడీ దండా..
* పగటిపూటే రూ. 1500 లకు గ్యాస్ బండ!
* గ్యాస్ డీలర్ల మాయాజాలంలో వందల కోట్ల కుంభకోణం.. 30 శాతం సిలిండర్ల దారి మళ్లింపు!
* కృత్రిమ కొరతతో రోజుకు రూ. 6.34 కోట్ల లూటీ..
* సామాన్యుడి కన్నీటిపై దళారుల కాసుల పండుగ!
* వాణిజ్య సిలిండర్లపైనా కాసుల కక్కుర్తి.. రకరకాల సాకులతో రూ. 1000 అదనపు బాదుడు!

(గడల నరసింహారావు, సీనియర్ జర్నలిస్ట్, ఖమ్మం.)

ప్రపంచ పటంలో ఎక్కడో రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే, ఆ ఆందోళనలను తమకు అనుకూలంగా మార్చుకుని కొందరు దళారులు సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ముందుచూపుతో దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరా వ్యవస్థను పటిష్టంగా ఉంచింది. పంపిణీ వ్యవస్థ సజావుగా సాగుతున్నప్పటికీ, వినియోగదారుడికి చేరే చివరి దశలో మాత్రం దళారులు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. సర్వర్ బిజీ అని, వెనక నుంచి స్టాక్ రావడం లేదు అని పడికట్టు పదాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇదే అదనుగా చీకటి బజారులో ఒక్కో సిలిండర్‌ను ఏకంగా రూ. 1500 లకు అమ్ముకుంటూ అక్రమార్కులు కాసుల వర్షం కురిపించుకుంటున్నారు. వ్యవస్థలోని లోపాలను ఆసరాగా చేసుకుని దళారులు సాగిస్తున్న ఈ పగటి దోపిడీ సామాన్యుడి బతుకును మరింత భారం చేస్తోంది.

**గ్లోబల్ టెన్షన్స్ వెనుక దాగి ఉన్న లోకల్ స్కామ్**

అంతర్జాతీయంగా ముడి చమురు, గ్యాస్ నిల్వలపై యుద్ధ ప్రభావం ఉన్న మాట వాస్తవమే అయినా, మన దేశీయ అవసరాలకు సరిపడా నిల్వలను కేంద్రం ఎప్పటికప్పుడే సమకూర్చుకుంటోంది. రిఫైనరీల నుంచి పంపిణీ కేంద్రాలకు, అక్కడి నుంచి ఏజెన్సీలకు సబ్సిడీ సిలిండర్ల రవాణా నిరంతరాయంగా సాగుతూనే ఉంది. అయితే, ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చి ప్రజల్లో ఒక రకమైన భయాందోళన వాతావరణాన్ని వ్యాపారులు సృష్టిస్తున్నారు. నిజంగానే యుద్ధం వల్ల గ్యాస్ రాదేమో అన్న భయంతో ప్రజలు ముందస్తు బుకింగ్స్ చేస్తుండటాన్ని డీలర్లు తమ అక్రమ దందాకు పెట్టుబడిగా మార్చుకున్నారు. సామాన్యుల భయాన్ని సొమ్ము చేసుకుంటూ ఏజెన్సీల నిర్వాహకులు నిలువునా దోచుకునే కుట్రకు తెరతీశారు.

**రాష్ట్రస్థాయిలో వాస్తవ గణాంకాలు.. 30 శాతం సిలిండర్ల దారి మళ్లింపు**

గ్యాస్ కొరత అనేది కేవలం దళారులు సృష్టించిన భ్రమ అని చెప్పడానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వద్ద ఉన్న అధికారిక గణాంకాలే ప్రత్యక్ష సాక్ష్యాలు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కనెక్షన్ల సంఖ్యను పరిశీలిస్తే, సుమారు 1.3 కోట్ల గృహ వినియోగ కనెక్షన్లు, 2 లక్షల పైచిలుకు వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 811 ఏజెన్సీల ద్వారా ప్రతిరోజూ దాదాపు 2,50,000 గృహ వినియోగ సిలిండర్లు, 23,000 వాణిజ్య సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. రాష్ట్రంలో ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి 10,611 మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ కూడా అందుబాటులో ఉంది. ఇంత పకడ్బందీ వ్యవస్థ ఉన్నప్పటికీ, రోజువారీ సరఫరా అవుతున్న 2,50,000 గృహ వినియోగ సిలిండర్లలో ఏకంగా 30 శాతం అంటే సుమారు 75,000 సిలిండర్లు నేరుగా బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయి. సామాన్యుడి ఇంటికి చేరాల్సిన సబ్సిడీ గ్యాస్ బండ, ఆటోలెక్కి రాత్రికి రాత్రే హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ప్రైవేట్ పరిశ్రమలకు చేరుకుంటోంది.

**వాణిజ్య సిలిండర్లపైనా కాసుల కక్కుర్తి**

సామాన్యుల గృహ వినియోగ సిలిండర్లనే కాదు, వాణిజ్య వ్యాపారులను సైతం ఈ గ్యాస్ మాఫియా వదలడం లేదు. బ్లూ కలర్ కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో వస్తున్న అరకొర స్టాక్‌ను కూడా ఏజెన్సీలు బ్లాక్ చేస్తున్నాయి. యుద్ధం, రవాణా ఛార్జీలు, ముడి చమురు ధరలు పెరిగాయన్న రకరకాల మాయమాటలు, కుంటి సాకులు చెబుతూ హోటల్ యజమానుల నుంచి ఒక్కో కమర్షియల్ సిలిండర్ పై రూ. 600 నుంచి రూ. 1000 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. గ్యాస్ లేకపోతే వ్యాపారం నడవని నిస్సహాయ స్థితిలో ఉన్న చిరు వ్యాపారులు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు ఏజెన్సీలు అడిగినంత సమర్పించుకుంటున్నారు.

**సామాన్యులు, వ్యాపారుల జేబులకు రోజూ రూ. 6.34 కోట్ల చిల్లు**

ఈ కృత్రిమ కొరత వల్ల అల్పాదాయ, మధ్యతరగతి వర్గాలపై, చిరు వ్యాపారులపై పడుతున్న ఆర్థిక భారం ఊహకు అందని స్థాయిలో ఉంది. ప్రతిరోజూ దారి మళ్లుతున్న 75,000 డొమెస్టిక్ సిలిండర్ల పై సగటున రూ. 600 చొప్పున అదనపు భారం వేసుకున్నా, రోజుకు రూ. 4.50 కోట్ల మేర సామాన్యుల జేబులు గుల్లవుతున్నాయి. మరోవైపు, రోజుకు డిమాండ్ ఉన్న 23,000 వాణిజ్య సిలిండర్ల పై కనీసం రూ. 800 చొప్పున అదనపు బాదుడు వేసుకున్నా, వ్యాపారులపై రోజుకు దాదాపు రూ. 1.84 కోట్ల భారం పడుతోంది. వెరసి, సామాన్యులు మరియు వ్యాపారుల నుంచి ఈ గ్యాస్ మాఫియా రోజుకు రూ. 6.34 కోట్లను అడ్డగోలుగా లూటీ చేస్తోంది. ఈ లెక్కన నెలకు దాదాపు రూ. 190 కోట్ల భారీ కుంభకోణం నిరాటంకంగా, పట్టపగలే సాగిపోతోంది.

**అధికారుల ఉదాసీనత.. పారదర్శకత లేమి**

ఇంత పెద్ద ఎత్తున వందల కోట్ల కుంభకోణం కళ్లెదుటే జరుగుతున్నా పౌర సరఫరాల శాఖ, తూనికలు కొలతల శాఖ మరియు విజిలెన్స్ అధికారుల చర్యలు కేవలం కాగితాలకే పరిమితం కావడం అత్యంత విచారకరం. ఉన్నత స్థాయి అధికారులు ఏసీ గదుల్లో సమీక్షలు చేస్తూ, సరఫరాలో లోపం లేదని ప్రకటనలు ఇస్తున్నారు. బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో ఏజెన్సీల గోదాములపై దాడులు శూన్యం. కమర్షియల్ సిలిండర్ల వాడకం ఉన్న ఏ ఒక్క హోటల్‌లోనూ అధికారులు తనిఖీలు చేసి, మీరు గృహ వినియోగ సిలిండర్లు ఎందుకు వాడుతున్నారు అని ప్రశ్నించే నాథుడే కరువయ్యాడు. బుకింగ్ నుంచి డెలివరీ వరకు ఓటీపీ విధానం ఉన్నప్పటికీ, డెలివరీ బాయ్స్ మరియు డీలర్లు సిస్టమ్ లోని లొసుగులను వాడుకుని వినియోగదారులకు తెలియకుండానే డెలివరీ అయినట్లు మెసేజ్‌లు సృష్టిస్తున్నారు.
అంతర్జాతీయ పరిణామాలను చూపి, కళ్లెదుటే సామాన్యుడిని దోచుకుంటున్న ఈ దళారీ వ్యవస్థను తక్షణమే ఉక్కుపాదంతో అణచివేయాలి. సివిల్ సప్లైస్, విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి బ్లాక్ మార్కెట్ కు పాల్పడుతున్న ఏజెన్సీల లైసెన్సులు రద్దు చేయాలి. సామాన్యులు సైతం ఆందోళనకు గురికాకుండా తమ వంతు బాధ్యతగా అక్రమాలపై ఫిర్యాదు చేయాల్సిన తరుణం ఇది. లేనిపక్షంలో, దళారుల కాసుల పండుగ ముందు సామాన్యుడి కన్నీరు ఆవిరైపోక తప్పదు.