Mahaa Daily Exclusive

  గడ్డి మందు నిషేధించాలి……

Share

  • గడ్డి మందు నిషేధించాలి
  • రోజు చనిపోతున్న రైతులు
  • వ్యవసాయ డైరెక్టర్ ను కోరిన జై స్వరాజ్ పార్టీ అధినేత కేఎస్ఆర్ గౌడ

హైదరాబాద్, మహా: కలుపు నివారణ కోసం వాడే గడ్డి మందు మూలంగా తెలంగాణలో రోజుకు అనేక మంది రైతులు చనిపోతున్నారని, దానిని తక్షణమే నిషేధించాలని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గడ్డి మందు నిషేధంతో పాటు వ్యవసాయ మందుల షాపుల్లో వాటి విక్రయాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కేఎస్ఆర్ సోమవారం తెలంగాణ వ్యవసాయ శాఖ కమిషనర్ డాక్టర్ బి. గోపిని కలిసి వినతిపత్రం అందజేశారు. కలుపు నివారణ కోసం వాడే గడ్డి మందు రైతుల పాలిట శాపంగా మారుతోందని, చిన్న చిన్న ఇబ్బందులతో మనస్థాపానికి గురైన వారు ఆవేశంతో దానిని తాగడం వల్ల వెంటనే మరణిస్తున్నారని, ఫలితంగా అనేక రైతు కుటుంబాలు ఆగమవుతున్నాయని ఆయన వివరించారు. గడ్డి మందు వల్ల తెలంగాణ వ్యాప్తంగా రోజుకు పదుల సంఖ్యలో రైతులు చనిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గడ్డి మందు వల్ల భూమి కూడా విషతుల్యం అవుతుందని వెంటనే దీనిని నిషేధించాలని కేఎస్ఆర్ గౌడ పేర్కొన్నారు.
గడ్డి మందు నిషేధం కోసం చర్యలు తీసుకుంటామని, కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని డైరెక్టర్ తెలిపారు. తమ పరిధి మేరకు తక్షణమే ఒక నెల రోజుల పాటు ముందు నిషేధానికి తాము చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. మండల వ్యవసాయ అధికారి ప్రిస్క్రిప్షన్ మేరకు ముందును అమ్మడం కూడా సరికాదని, గడ్డి మందును పూర్తిగా నిషేధించాలని కేఎస్ఆర్ తెలిపారు. గడ్డి ముందుకు ప్రత్యామ్నాయాలు చూడాలని కాసాని శ్రీనివాసరావు గౌడ పేర్కొన్నారు.