- ఫ్రెండ్ అని పిలిచి …. కత్తితో వేటాడి
- మర్డర్ జరిగిన 6 గంటల్లోనే నిందితుడి అరెస్టు
- ఉప్పల్ పోలీసుల ‘మెరుపు’ ఆపరేషన్
- ఫోన్ ఎత్తలేదన్న చిన్న గొడవతోనే ఘోరం
హైదరాబాద్, మహా : నగరంలో హత్య జరిగిన కొద్ది గంటల్లోనే నిందితుల అడ్రస్ కనిపెట్టి.. వారి చేతులకు బేడీలు వేయడంలో ఉప్పల్ పోలీసులు తమ మార్కు స్పీడ్ చూపించారు. చిలకానగర్లో ఆదివారం రాత్రి జరిగిన దారుణ హత్య కేసులో పోలీసులు మెరుపు వేగంతో స్పందించారు. కేవలం 6 గంటల వ్యవధిలోనే హంతకులను పట్టుకుని ‘శాంతిభద్రతల రక్షణలో తాము ఎప్పుడూ అలర్ట్’ అని నిరూపించుకున్నారు.
అసలేం జరిగిందంటే..?
పోలీసుల వివరాల ప్రకారం.. బానోతు సంతోష్, పొడిశెట్టి తరుణ్, మృతుడు సుధీర్ కుమార్ ముగ్గురూ పాత దోస్తులు. మూడు రోజుల క్రితం సుధీర్ తన బావ ఇంటి గృహప్రవేశానికి వీరిని పిలిచాడు. అయితే ఫంక్షన్ రోజున సంతోష్ చేసిన ఫోన్ కాల్స్‌ను సుధీర్ రిసీవ్ చేసుకోలేదు. “నన్ను పిలిచి.. నా ఫోన్ ఎత్తవా?” అన్న అహంకారం సంతోష్‌లో సెగలు పుట్టించింది. ఇదే విషయంపై వాట్సాప్‌లో తిట్టుకున్నారు. ఆదివారం రాత్రి 7:30 గంటలకు ‘మాట్లాడుకుందాం రా’ అని సుధీర్‌ను చిలకానగర్ గ్రౌండ్‌కు పిలిచారు. అక్కడ మాటా మాటా పెరగడంతో ముందే ప్లాన్ చేసుకున్న సంతోష్.. కత్తి తీసి సుధీర్‌ను పొడిచాడు. ప్రాణ భయంతో సుధీర్ రోడ్డుపైకి పరుగులు తీసినా వదలకుండా వెంటాడి, వేటాడి కత్తులతో పొడిచి చంపేశారు.
పోలీసుల ‘సింగం’ స్టైల్ ఆపరేషన్
రాత్రి 10:30 గంటలకు ఫిర్యాదు అందడమే ఆలస్యం. ఉప్పల్ పోలీసులు యాక్షన్ మోడ్‌లోకి వెళ్లారు. మల్కాజిగిరి డీసీపీ కె. సురేష్ కుమార్ నేతృత్వంలో అదనపు డీసీపీలు వెంకటరమణ, నర్సింహారెడ్డి పర్యవేక్షణలో స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. టెక్నికల్ గ్రిడ్‌ను ఉపయోగించి నిందితుల ఫోన్ సిగ్నల్స్, సీసీటీవీ ఫుటేజీలను క్షణాల్లో జల్లెడ పట్టారు. నిందితులు ఎక్కడ దాక్కున్నారో పక్కా సమాచారంతో తెల్లవారుజామున 4 గంటలకల్లా వారిని చుట్టుముట్టారు. హత్యకు వాడిన కత్తితో పాటు, వారు పారిపోయేందుకు వాడిన యాక్టివా బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఆఫీసర్లకు హ్యాట్సాఫ్!
సాధారణంగా హత్య కేసుల్లో నిందితులు పారిపోయి ఇతర రాష్ట్రాలకు లేదా జిల్లాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ, ఉప్పల్ ఇన్స్పెక్టర్ వై. రామలింగారెడ్డి, ఎస్ఓటి ఇన్స్పెక్టర్లు చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ మరియు వారి బృందం కంటిమీద కునుకు లేకుండా శ్రమించి రికార్డు టైంలో కేసును ఛేదించారు. పోలీసుల ఈ వేగవంతమైన పనితీరుపై స్థానిక ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. నేరం చేస్తే తప్పించుకోవడం అసాధ్యమని ఈ అరెస్టుతో పోలీసులు మరోసారి హెచ్చరించారు.







