హైదరాబాద్, మహా : తెలంగాణ కవి, ఉద్యమకారుడు, రచయిత నందిని సిద్ధారెడ్డికి అరుదైన గౌరవం లభించింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల్లో నందిని సిద్ధారెడ్డికి కూడా ఈ గౌరవం కల్పించింది. కరోనా కాలంలో నెలకొన్న పరిస్థితులను నందిని సిద్ధారెడ్డి.. కళ్లకు కట్టినట్లు ఆయన అనిమేష కవితా సంపుటి రాయగా దానికి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సాహిత్య అకాడమీ ఛైర్మన్గా నందిని సిద్ధారెడ్డిని నియమించడం విశేషం.
కరోనా సమయంలో సామాజిక పరిస్థితులు, మానవీయ కోణాలను ఆయన ఈ అనిమేష కవితా సంపుటిలో చిత్రించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించిన వారికి రూ. లక్ష నగదు ప్రోత్సాహంతోపాటు.. తామ్రపత్రం, శాలువాను కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేస్తుంది. 1955లో మెదక్ జిల్లా బందారం గ్రామంలో నందిని సిద్ధారెడ్డి పుట్టారు. ఆయన తండ్రి నర్రా బాలసిద్ధారెడ్డి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన ఒక గొప్ప కమ్యూనిస్టు యోధుడు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పూర్తిచేసిన నందిని సిద్ధారెడ్డి ‘ఆధునిక తెలుగు కవిత్వంలో సూర్యుడు’ అనే అంశంపై 1981లో ఎంఫిల్ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత ‘ఆధునిక కవిత్వం, వాస్తవికత-అధివాస్తవికత’ పై పరిశోధనలకు గానూ 1986 పీహెచ్డీ పట్టా వరించింది.
మాజీ మంత్రి కేటీఆర్ హర్షం
నందిని సిద్దారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ప్రకటించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నందిని సిద్ధారెడ్డికి శుభాకాంక్షలు చెబుతూ కేటీఆర్ ట్వీట్ పెట్టారు. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి ఛైర్మన్ నందిని సిద్ధారెడ్డికి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం యావత్ తెలంగాణ రాష్ట్రానికే చాలా గర్వకారణమని కేటీఆర్ కొనియాడారు. ‘తెలంగాణ మట్టి సువాసనను, ఉద్యమ స్ఫూర్తిని తన కలంతో విశ్వవ్యాప్తం చేసిన ప్రముఖ కవి, సాహితీవేత్త శ్రీ నందిని సిద్ధారెడ్డి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడం అత్యంత సంతోషదాయకం. ఇది తెలంగాణ సాహిత్యానికి దక్కిన గౌరవం. వారికి నా హృదయపూర్వక అభినందనలు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.







