Mahaa Daily Exclusive

  మొయినాబాద్ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్ కేసు: పోలీసులపైకి కాల్పులు.. రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు!

Share

  • ఫాంహౌజ్ డ్రగ్స్ పార్టీ కేసు
  • పోలీసుల్ని చంపి అయినా తప్పించుకోవాలనుకున్నారా?
  • రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

హైదరాబాద్, మహా : మొయినాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ పార్టీ ఉదంతం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. మార్చి 14, 2026 రాత్రి అజీజ్ నగర్ విలేజ్‌లోని ఒక ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ ప్రైవేట్ పార్టీలో డ్రగ్స్ వినియోగంతో పాటు కాల్పులు జరపడంపై కేసులు నమోదయ్యాయి.

డ్రగ్స్ తీసుకు వచ్చిన కౌశిక్ రవి

పోలీసుల నివేదిక ప్రకారం, ఈ కేసులో నిందితుడైన కౌశిక్ రవి తన బిజినెస్ ట్రిప్‌లో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాకు వెళ్లినప్పుడు, అక్కడ ఒక అపరిచిత వ్యక్తి నుంచి రూ. 15,000 వెచ్చించి కొకైన్‌ను కొనుగోలు చేశాడు. దానిని హైదరాబాద్‌కు తీసుకువచ్చి ఫామ్‌హౌస్ పార్టీలో తన స్నేహితులకు పంచాడు. తిరువీధుల అర్జున్ రెడ్డి, పంజుగుల రితేష్ రెడ్డి, నితేష్ శర్మ, పంజుగుల రోహిత్ రెడ్డిలు ఈ కొకైన్‌ను సేవించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. నిందితులకు నిర్వహించిన యూరిన్ టెస్టుల్లో కొకైన్ ఆనవాళ్లు ఉన్నట్లు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది.

పోలీసులపై కాల్పుల

కేసులో అత్యంత భయానకమైన అంశం పోలీసులు ఫామ్‌హౌస్‌పై దాడి చేసిన సమయంలో నిందితుల్లో ఒకరైన నమిత్ శర్మ పోలీసులపైకి కాల్పులు జరపడం. రిమాండ్ రిపోర్ట్ ప్రకారం, పోలీసుల రాకను గమనించిన నమిత్ శర్మ, రితేష్ రెడ్డికి చెందిన రివాల్వర్‌ను తీసుకుని పోలీసులను భయపెట్టి అక్కడి నుంచి తప్పించుకునేందుకు ఒక రౌండ్ కాల్పులు జరిపారు. ఇది పోలీసుల ప్రాణాలకు ముప్పు కలిగించడమే కాకుండా, విధి నిర్వహణలో ఉన్న అధికారులను అడ్డుకోవడంగా పోలీసులు పరిగణించారు.

స్వాధీనం చేసుకున్న వస్తువులు

ఘటనా స్థలంలో పోలీసులు జర్మనీ తయారీ రివాల్వర్, ఖాళీ తూటాలు, ఒక లైవ్ బుల్లెట్, 0.26 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు భారీగా విదేశీ మద్యం సీసాలను కూడా సీజ్ చేశారు. కింగ్ ఫిషర్ అల్ట్రా బీర్లు, రాయల్ సెల్యూట్ 21 ఇయర్స్ విస్కీ, చివాస్ రీగల్, వోడ్కా వంటి ఖరీదైన మద్యం బాటిళ్లను పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

నిందితుల వివరాలు

ఈ కేసులో మొత్తం 11 మందిని నిందితులుగా చేర్చారు. ఇందులో వ్యాపారవేత్తలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, అడ్వకేట్లు ఉన్నారు. ఏ-1గా నమిత్ శర్మ (ఢిల్లీ), ఏ-2గా రోహిత్ రెడ్డి, ఏ-3గా రితేష్ రెడ్డి సహా మొత్తం 11 మందిపై ఎన్డీపీఎస్ చట్టంతో పాటు ఆర్మ్స్ యాక్ట్, తెలంగాణ ఎక్సైజ్ చట్టం, బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.