Mahaa Daily Exclusive

  ఢిల్లీలో దారుణం. …రీల్స్ పిచ్చికి బలైన యువకుడు….

Share

హైదరాబాద్, మహా.
సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం యువత చేస్తున్న ప్రమాదకర స్టంట్లు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. తాజాగా తూర్పు ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ (దల్లూపురా) ప్రాంతానికి చెందిన పవన్ (29) అనే యువకుడు ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు.
తన స్నేహితుడికి చెందిన లైసెన్స్‌డ్ పిస్టల్‌ను చేతిలోకి తీసుకున్న పవన్, అందులో బుల్లెట్లు లోడ్ చేసి సరదాగా తన ఛాతీకి గురిపెట్టుకున్నాడు. కేవలం ట్రిగ్గర్ నొక్కినట్లు యాక్ట్ చేసి వీడియో రికార్డ్ చేయాలనుకున్నాడు. కెమెరా వైపు చూస్తూ నవ్వుతూ పోజులిచ్చిన పవన్.. తుపాకీ లాక్ అయి ఉందనే పొరపాటుతో నిజంగానే ట్రిగ్గర్ నొక్కేశాడు.
దీంతో ఒక్కసారిగా బుల్లెట్ నేరుగా అతని గుండెల్లోకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వీడియో తీస్తున్న స్నేహితుడు వద్దని వారిస్తున్నప్పటికీ కంగారులో జరిగిన ఈ పొరపాటు ప్రాణం తీసింది. తీవ్ర గాయాలపాలైన పవన్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ అతడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఆ తుపాకీ వీడియో తీస్తున్న పవన్ స్నేహితుడిదేనని, దానికి లైసెన్స్ కూడా ఉందని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై న్యూ అశోక్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ కావాలన్న ఒక చిన్న ఆశ, చివరకు నిండు ప్రాణాన్ని బలిగొంది.