Mahaa Daily Exclusive

  క్షమించు నాన్నా.. ఇక ప్రశాంతంగా వెళ్లిపో!

Share

  • క్షమించు నాన్నా.. ఇక ప్రశాంతంగా వెళ్లిపో!
  • 13 ఏళ్ల మూగ వేదనకు కన్నీటి ముగింపు.
  • గుండెల్ని పిండేస్తున్న ఘజియాబాద్ యువకుడి దీనగాథ.

**ప్రాణం పోయడం మాత్రమే కాదు… ప్రాణం విడిచేందుకు అనుమతి ఇవ్వడం కూడా ప్రేమే! అవును… వినడానికి కఠోరంగా ఉన్నా, ఇది గుండెను కోసేసే పచ్చి నిజం. మృత్యువు కబళించదు, జీవితం కరుణించదు… ఈ రెంటి మధ్య ఊపిరి మాత్రమే ఆడుతున్న ఓ శిథిల దేహం 13 ఏళ్లుగా పడ్డ నరకయాతనకు ముగింపు పలుకుతూ కన్నవాళ్లే కన్నీళ్లతో తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయం దేశం నలుమూలలా కోట్లాది మంది హృదయాలను బరువెక్కిస్తోంది**

**గాలివానలో రాలిన కలల సౌధం**

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన 32 ఏళ్ల హరీష్ రాణా.. ఒకప్పుడు కళ్లనిండా ఉజ్వలమైన భవిష్యత్తును నింపుకున్న చురుకైన ఇంజనీరింగ్ విద్యార్థి. చదువు పూర్తయ్యాక మంచి ఉద్యోగం, అందమైన ఇల్లు, భార్యాపిల్లలతో సంతోషాల పూదోటలా సాగిపోవాల్సిన ఆ యువకుడి ప్రయాణాన్ని విధి కసిగా వెక్కిరించింది. 2013లో హాస్టల్ భవనం పైనుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోయిన ఆ క్షణం… అతని తలరాతను శాశ్వతంగా చీకటిమయం చేసింది. తలకు బలమైన గాయం కావడంతో అతడు ‘పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్’లోకి వెళ్లిపోయాడు.

**యంత్రాల మధ్య…మూగబోయిన ప్రాణం**

నిన్నటి దాకా పరుగులెత్తిన కాళ్లు చచ్చుబడిపోయాయి.. పలకరించే పెదవులు మూగబోయాయి.. స్పర్శ లేని దేహం, చుట్టూ ఏం జరుగుతుందో తెలియని శూన్యం. శ్వాస పీల్చడానికి ఓ గొట్టం, కడుపులోకి గుప్పెడు మెతుకులు వెళ్లడానికి మరో ట్యూబ్… ఇలా ఆసుపత్రి బెడ్‌పై యంత్రాల మధ్య అచేతనంగా పడి ఉన్న ఆ బిడ్డను చూసి కన్నపేగు ఎంత విలవిలలాడిపోయి ఉంటుందో ఊహించడానికే భయం వేస్తుంది. రోజులు కాదు.. ఏళ్లు కాదు.. ఏకంగా పుష్కర కాలం (13 ఏళ్లు) దాటిపోయింది. ఆ దేహంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రాణాన్ని నిలబెట్టేందుకు ఆ కుటుంబం పడని పాట్లు లేవు. ఒకవైపు బిడ్డను బతికించుకోవాలన్న ఆరాటం, మరోవైపు అతను పడుతున్న నిశ్శబ్ద నరకం ఆ తల్లిదండ్రులను లోపలి నుంచే దహించివేసింది.

**కన్నపేగు తీసుకున్న కఠోర నిర్ణయం**

బిడ్డ ఇక కోలుకోడని, ఈ మంచం పైనే నరకం అనుభవిస్తూ బతకాల్సిందేనని వైద్యులు తేల్చిచెప్పడంతో ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలాయి. తమ బిడ్డ ఇక ఏనాటికీ తిరిగి రాడని ఆ కన్నవాళ్లకు అర్థమైపోయింది. ఆ నిశ్శబ్ద రోదనను ఇంక చూడలేక, తమ చేతులతోనే ఆ బిడ్డకు మరణశాసనం రాయాలని కోర్టు గడప తొక్కారు. ‘మా బిడ్డకు ఈ నరకం నుంచి విముక్తి ప్రసాదించండి మహాప్రభో’ అంటూ సుప్రీంకోర్టును వేడుకున్నారు. ఆ కన్నవారి వేదనను, వైద్యుల నివేదికలను నిశితంగా పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం… మానవీయ కోణంలో అత్యంత సున్నితమైన తీర్పును వెలువరించింది. పాసివ్ యూథనేసియా (కారుణ్య మరణం)కు అనుమతినిచ్చింది. ఇది చట్టం చేసిన న్యాయం మాత్రమే కాదు, ఒక నిస్సహాయ ప్రాణికి మృత్యువు రూపంలో ఇస్తున్న ప్రశాంతత!

**గుండెల్ని పిండేస్తున్న ఆ ఆఖరి ప్రయాణం**

కోర్టు ఆదేశాల మేరకు హరీష్‌ను ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలిస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి కంటతడి పెట్టిస్తున్నాయి. ఓ ప్రత్యేక వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా తీసిన వీడియో చూస్తే కరడుగట్టిన గుండె కూడా కరిగిపోవాల్సిందే.

**ఆ వీడియోలో ఒక మహిళ హరీష్ తలపై ఆప్యాయంగా నిమురుతూ… “మమ్మల్ని క్షమించు నాయనా… ఇక ప్రశాంతంగా వెళ్లిపో” అంటూ గద్గద స్వరంతో పలికిన తీరు జీర్ణించుకోవడం ఎవరి తరమూ కాదు. పక్కనే పేగుబంధం కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటే… ఎన్నో ఏళ్లుగా మౌనఖైదీగా ఉన్న హరీష్, ఏదో చెప్పాలని తీవ్రంగా ప్రయత్నించి మాటరాక అల్లాడిపోయిన ఆ క్షణం… చూసే ప్రతి కంటిని చెమ్మగిల్లేలా చేసింది**

**మరణమే ఇక్కడ మహావరం…**

డాక్టర్లు ఇప్పుడు అమలు చేయబోయేది పాసివ్ యూథనేసియా. అంటే ప్రాణాన్ని అమాంతం తీయడం కాదు, కృత్రిమంగా ప్రాణాలను నిలబెడుతున్న లైఫ్ సపోర్ట్ పరికరాలను అత్యంత జాగ్రత్తగా తొలగించడం. ఆహారం, శ్వాస కోసం అమర్చిన ట్యూబ్‌లను తీసివేసి… ప్రకృతి సహజంగా ఆ ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయేలా చేయడం.
ఈ కథలో విషాదం ఉంది, అంతులేని ఆవేదన ఉంది. కానీ, వీటన్నింటిని మించి ఒక బరువైన సందేశం ఉంది. బతకడం నరకమైనప్పుడు… బాధల నుంచి శాశ్వత విముక్తి ప్రసాదించడం కూడా ఆ ప్రేమామృతంలో భాగమేనని హరీష్ ఉదంతం మానవాళికి చాటి చెబుతోంది. హరీష్… నీ ఆత్మకు ఇకనైనా శాంతి చేకూరాలని ప్రార్థించడం మినహా మనం చేయగలిగిందేమీ లేదు.