భారీ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ దందా రట్టు..
* కుళ్లిన పదార్థాలు, యాసిడ్‌తో తయారీ!
హైదరాబాద్, మహా.
హైదరాబాద్ నగరంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ రాయుళ్ల గుట్టును పోలీసులు రట్టు చేశారు. బోరబండలోని మధురానగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా, అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ఓ కేంద్రంపై ఖైరతాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా మెరుపుదాడి చేశారు. ఈ దాడుల్లో ప్రజల ఆరోగ్యాన్ని హరించే ఎన్నో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.
* ప్రమాదకరమైన తయారీ విధానం*
‘ఏ1 సహారా గోల్డ్’ అనే నకిలీ బ్రాండ్ పేరుతో నిందితులు ఈ అక్రమ దందా సాగిస్తున్నారు. కేవలం లాభార్జనే ధ్యేయంగా కుళ్లిపోయిన అల్లం, వెల్లుల్లి, మరియు పనికిరాని వెల్లుల్లి పొట్టును ముడిసరుకుగా వాడుతున్నారు. ఆ కుళ్లిన మిశ్రమానికి ఘాటు రావడం కోసం ప్రమాదకరమైన అసిటిక్ యాసిడ్ , నిల్వ ఉండేందుకు అధిక మొత్తంలో ఉప్పు కలిపి ఈ పేస్ట్‌ను తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కనీస ఫుడ్ సేఫ్టీ నిబంధనలను పాటించకుండా, దుమ్ము, ఈగలు వాలుతున్న ప్లాస్టిక్ టబ్బులలో ఈ పేస్ట్‌ను నిల్వ ఉంచడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
నిర్వాహకుడి అరెస్ట్, వస్తువుల సీజ్
ఈ కల్తీ కేంద్రం నిర్వాహకుడు మొహమ్మద్ అబ్దుల్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆకస్మిక దాడిలో భారీగా ముడిసరుకును, తయారీకి ఉపయోగించే యంత్రాలను అధికారులు సీజ్ చేశారు. ఇందులో వేల కిలోల వెల్లుల్లి, అల్లం, వందల కిలోల ఉప్పు, ప్యాకింగ్ కవర్లతో పాటు మిక్సర్, గ్రైండర్, పీలింగ్ మెషీన్లు ఉన్నాయి. ఈ సామగ్రి అంతా స్వాధీనం చేసుకున్న పోలీసులు, తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం నిందితుడిని స్థానిక పోలీసులకు అప్పగించారు.
**హోటళ్లు, క్యాటరింగ్‌లకే ప్రధాన సరఫరా**
అత్యంత తక్కువ ఖర్చుతో తయారైన ఈ ప్రమాదకరమైన కల్తీ పేస్ట్‌ను నగరంలోని వివిధ హోల్‌సేల్ కిరాణా దుకాణాలకు, ఫుడ్ క్యాటరింగ్ సర్వీసులకు,హోటళ్లకు సరఫరా చేస్తూ నిందితుడు భారీగా సొమ్ము చేసుకుంటున్నట్లు విచారణలో తేలింది. మనం బయట తినే ఆహారంలో ఇలాంటి కల్తీ పేస్ట్ ఉపయోగిస్తుండటం ఆందోళన కలిగించే విషయం. మార్కెట్లో దొరికే ఇలాంటి కల్తీ ఆహార పదార్థాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, కొనుగోలు చేసే ముందు బ్రాండ్ మరియు నాణ్యతను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.








