Mahaa Daily Exclusive

  జీవన్ రెడ్డి వైపు బీజేపీ చూపు…

Share

  • జీవన్ రెడ్డి వైపు బీజేపీ చూపు
  • కిషన్ రెడ్డి, రాంచందర్ రావులతో మాట్లాడిన ఎంపీ అరవింద్
  • పార్టీలోకి ఆహ్వానించే అంశంపై చర్చ
  • రంగంలోకి దిగిన నేతలు

హైదరాబాద్, మహా : కాంగ్రెస్ పార్టీపై కోపంతో రగిలిపోతున్న జగిత్యాల జిల్లాకు చెందిన సీనియర్ నేత జీవన్ రెడ్డి కదలికలపై బీజేపీ నేతలు దృష్టి సారించారు. గత కొంత కాలంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి అన్నట్లుగా జిల్లా రాజకీయాలు సాగడం, సంజయ్ వైపు పార్టీ నాయకత్వం మెగ్గు ూపుతుందన్న ఆగ్రహంతో ఉన్న జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పేందుకు సిద్దం కావడంతో ఆయనను పార్టీలోకి ఆహ్వానించే అంశంపై బీజేపీ నేతల మధ్య చర్చ జరిగింది. పార్టీలోకి జీవన్ రెడ్డిని ఆహ్వానిస్తే జగిత్యాల జిల్లాలో బలం చేకూరుతుందని, ఆయన సుదర్ఘ రాజకీయ అనుభవం కూడా పార్టీకి కలిసి వస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కొంత కాలంగా భావిస్తున్నారు. అంతే కాకుండా సంజయ్, జీవన్ రెడ్డిల మధ్య జరుగుతున్న అంతర్గత పోరుపై కాంగ్రెస్ అధిష్టానం స్పందించక పోవడం, జీవన్ రెడ్డికి పార్టీ అన్యాయం చేస్తుందంటూ గతంలోనే అరవింద్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. తాజా పరిణమాల నేపథ్యంలో జీవన్ రెడ్డి పార్టీ వీడటం ఖాయమని బలంగా వినిపిస్తుండటంతో ఆయనను పార్టీలోకి ఆహ్వానించే అంశంపై ఎంపీ అరవింద్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో మాట్లాడారు. పార్టీ అనుతిస్తే తాను రంగంలోకి దిగుతానని, అంతకంటే ముందు ఒక సారి జీవన్ రెడ్డికి సానుభూతి తెలుపుతూ మాట్లాడితే బాగుంటుందని సూచించారు. అరవింద్ సూచనకు సమ్మతించిన నేతలిద్దరూ జీవన్ రెడ్డితో మాట్లాడే అంశంపై కేంద్ర పెద్దలతో సంప్రదించినట్లు సమాచారం. ఏది ఏమైనా నిజామాబాద్ ఎంపీ పరిధిలోకి జగిత్యాల జిల్లా కూడా రావడంతో తన భవిష్యత్ రాజకీయ అవసరాల దృష్ట్యా అరవింద్ పార్టీ పెద్దలను ఒప్పించారన్న ప్రచారం జరుగుతోంది.

సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా కూడా పని చేశారు. ఆయన బీజేపీలో చేరితే జగిత్యాల జిల్లాతో పాటు నిజామాబాద్, కరీంనగర్ లోక్ సభ స్థానాలలోనూ పార్టీ పెరగడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి ఒక ఊపు వచ్చే అవకాశాలున్నాయని కాషాయదళంలో చర్చ మొదలైంది. అయితే ఇప్పటికే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నారని, ఈ నెల 27 న గులాబీ కండువాను కప్పుకుంటారన్న ప్రచారం ఉంది. మరో పక్క కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు అందుబాటులో ఉన్న అన్న ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ తరుణంలో ఆయన పనమెటు అన్నది మరోసారి చర్చనీయాంశంగా మారింది.