Mahaa Daily Exclusive

  వైఎస్ జగన్‌ను కలిసిన రేగిడి లక్ష్మణరావు: పార్టీ గళాన్ని బలంగా వినిపించాలని అధినేత దిశానిర్దేశం

Share

వైఎస్ జగన్ ని మర్యాదపూర్వకంగా కలిసిన రేగిడి లక్ష్మణరావు.
* పార్టీ గళాన్ని బలంగా వినిపించాలని దిశానిర్దేశం.

తాడేపల్లి,మహా.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రసార మాధ్యమాల వక్త రేగిడి లక్ష్మణరావు మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించినందుకు జగన్ మోహన్ రెడ్డికి ఆయన పుష్పగుచ్ఛం అందించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, మారుతున్న సమీకరణాలు, ప్రజలు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది.
కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో పార్టీ గొంతుకను ప్రసార మాధ్యమాల వేదికగా మరింత బలంగా వినిపించాలని అధినేత జగన్ ఈ సందర్భంగా లక్ష్మణరావుకు దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన పోరాడటం ఎంతో కీలకమని ఆయన సూచించారు. అధికార పార్టీ వైఫల్యాలను, వారు ఇచ్చిన హామీల అమలులోని డొల్లతనాన్ని ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అధికార ప్రతినిధుల పాత్ర అత్యంత ముఖ్యమైనదని స్పష్టం చేశారు. పూర్తి బాధ్యతాయుతంగా వ్యవహరించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పారు.
జగన్ మోహన్ రెడ్డి తనపై ఉంచిన విశ్వాసాన్ని ఏమాత్రం వమ్ము చేయనని రేగిడి లక్ష్మణరావు స్పష్టం చేశారు. పార్టీ సిద్ధాంతాలను, అధినేత ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటుగా అన్ని వేదికలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణిని అత్యంత సమర్థవంతంగా వినిపిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ప్రతిపక్షాలపై జరుగుతున్న దాడులు, అక్రమ కేసులపై చట్టపరంగా ప్రజాక్షేత్రంలో అలుపెరగని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో పార్టీ విజయానికి తన వంతుగా నిరంతరం సైనికుడిలా శ్రమిస్తానని ఆయన పునరుద్ఘాటించారు.