Mahaa Daily Exclusive

  అస్సాం కాంగ్రెస్‌లో ముదిరిన సంక్షోభం: బీజేపీలో చేరిన ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్

Share

  • ఎన్నికల వేళ
  • అస్సాం కాంగ్రెస్ లో అంతర్గత సంక్షోభం
  • పార్టీకి రాజీనామా చేసిన ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్
  • బీజేపీలో చేరిక

అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్దమవుతున్న అస్సాం కాంగ్రెస్ లో అంతర్గత సంక్షోభం జోరందుకుంది. అసెంబ్లీకి ఏప్రిల్ 9 న ఎన్నికలు జరుగనున్నాయి. అభ్యర్థుల ఎంపికతో పాటు గెలుపుపై దృష్టి పెట్టిన అధిష్టానానికి పార్టీలోని కీలక నెతల రాజీనామాలు తలనొప్పిగా మారాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, నాగావ్ లోక్ సభ ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ప్రద్యుత్ బోర్డోలోయ్ రాజీనామాకు ప్రధాన కారణం లాహోరిగీట్ నియోజకవర్గ అభ్యర్థి ఎంపిక. వివాదాస్పద నేపథ్యం ఉన్న ఎమ్మెల్యే ఆసిఫ్ మహమ్మద్ నాజర్ కు మళ్ళీ టికెట్ ఇవ్వడాన్ని బోర్డోలోయ్ తీవ్రంగా వ్యతిరేకించారు. తనపై గతంలో జరిగిన దాడి వెనుక నాజర్ అనుచరుల హస్తం ఉందని, అటువంటి వారికి పార్టీ పెద్దపీట వేయడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ హైకమాండ్‌కు అల్టిమేటం ఇచ్చినప్పటికీ, నాయకత్వం స్పందించకపోవడంతో ఆయన బయటకు వచ్చారు. అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ తీరుపై బోర్డోలోయ్ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. నేర చరిత్ర ఉన్నవారికి గొగోయ్ మద్దతు ఇస్తున్నారని, పార్టీలో సీనియర్లకు గౌరవం దక్కడం లేదని ఆయన ఆరోపించారు. కేవలం గొగోయ్ మాత్రమే కాకుండా, ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు ఇమ్రాన్ మసూద్ తన ఫిర్యాదులను తప్పుడు సమాచారంగా కొట్టిపారేయడం తనను అవమానించినట్లేనని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

కాంగ్రెస్‌కు వరుసగా షాకులు

బోర్డోలోయ్ నిష్క్రమణ కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ. రాష్ట్రంలో పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్న కీలక నేత ఎన్నికల ముందే ప్రత్యర్థి పార్టీలో చేరడం వల్ల ఓటర్లలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతకుముందే మాజీ పీసీసీ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా కూడా పార్టీ వీడటం చూస్తుంటే, కాంగ్రెస్‌లో సంస్థాగత వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది.

సీఎం సమక్షంలో బీజేపీలో చేరిన ఎంపీ బోర్డోలోయ్

ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సమక్షంలో బోర్డోలోయ్ బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో, అధికార పార్టీ తన బలాన్ని మరింత పెంచుకుంది. ముఖ్యంగా అప్పర్ అస్సాం, నాగావ్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పట్టు కోల్పోయే అవకాశం ఉంది. మరోవైపు, కాంగ్రెస్ మాత్రం బోర్డోలోయ్ వెళ్ళిపోవడం వల్ల నష్టమేమీ లేదని, ఆయనపై బీజేపీ ఒత్తిడి ఉండి ఉండవచ్చని పైకి చెబుతున్నా, లోలోపల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై మిగిలిన నాయకుల్లో కూడా ఆందోళన మొదలైంది.

Latest