Mahaa Daily Exclusive

  రాహుల్ గాంధీ ఒక ‘టపోరి’….

Share

  • రాహుల్ గాంధీ ఒక ‘టపోరి’
  • ఆయన్ను చూస్తుంటే మహిళలకు అసౌకర్యంగా అనిపిస్తుంది
  • ఆయన ప్రవర్తన ఏ మాత్రం హుందాగా లేదు
  • బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
  • రాహుల్ క్షమాపణలు చెప్పాలంటూ మాజీ అధికారుల బహిరంగ లేఖ

న్యూఢిల్లీ, మహా : బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంపీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. రాహుల్ గాంధీని ఒక ‘టపోరి’ (వీధి రౌడీ లేదా పోకిరీ) తో పోల్చిన కంగనా, ఆయన బహిరంగ ప్రవర్తనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ ఆవరణలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కంగనా రనౌత్, రాహుల్ గాంధీ ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఆయన్ను చూస్తుంటే మా మహిళలకు చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. ఆయన ఒక టపోరిలా వస్తారు.. ఎవరినైనా ‘ఏయ్ నువ్వు’ అంటూ ఏకవచనంతో అగౌరవంగా పిలుస్తారు. ఎవరైనా ఇంటర్వ్యూ ఇస్తుంటే వెనుక నుంచి కూతలు కూస్తారు” అని కంగనా రనౌత్ ఘాటుగా విమర్శించారు. రాహుల్ గాంధీ ప్రవర్తన ఏమాత్రం హుందాగా లేదని ఆమె పేర్కొన్నారు.

క్షమాపణలు కోరుతూ మాజీ అధికారుల బహిరంగ లేఖ

కంగనా వ్యాఖ్యలు ఒకవైపు ఉంటే, మరోవైపు రాహుల్ గాంధీ పార్లమెంట్ నిబంధనలను అతిక్రమిస్తున్నారంటూ 84 మంది మాజీ బ్యూరోక్రాట్లు, 116 మంది మాజీ సైనికోద్యోగులు, నలుగురు లాయర్లు కలిసి ఒక బహిరంగ లేఖ రాశారు. మార్చి 12న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మకర్ ద్వార్ ప్రవేశ ద్వారం వద్ద రాహుల్ గాంధీ టీ, బిస్కెట్లు తీసుకున్న ఘటనపై వీరంతా అభ్యంతరం వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ ఎస్పీ వైద్ నేతృత్వంలోని ఈ బృందం, రాహుల్ ప్రవర్తన పార్లమెంటరీ నిబంధనలను బేఖాతరు చేసేలా ఉందని పేర్కొంది. “లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు అనేది ఎంతో బాధ్యతాయుతమైన పదవి. కానీ రాహుల్ గాంధీ ప్రవర్తనలో ఆ హుందాతనం కనిపించడం లేదు. పార్లమెంట్ మెట్లపై కూర్చుని టీ తాగడం, నినాదాలు చేయడం వంటివి రాజకీయ థియేటర్ లా ఉన్నాయి తప్ప, బాధ్యతాయుత నేత లక్షణాలు కావు. దేశ ప్రజలకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి” అని ఎస్పీ వైద్ డిమాండ్ చేశారు. స్పీకర్ ఓం బిర్లా సభా మర్యాదను కాపాడాలని రాహుల్ గాంధీకి సూచించినప్పటికీ, ఆయన పట్టించుకోలేదని ఎస్పీ వైద్ విమర్శించారు. రాహుల్ తన ప్రవర్తనతో తనను తాను ఒక హాస్యాస్పదమైన వ్యక్తిగా మార్చుకుంటున్నారని, ప్రతిపక్ష నాయకుడికి అహంకారం ఉండకూడదని, వినయం ఉండాలని ఆయన హితవు పలికారు.

Latest