- సర్కస్‌లా ప్రభుత్వం
- రింగ్ మాస్టర్లుగా అధికారులు
- ఒళ్ళు దగ్గర పెట్టుకుని అధికారులు పని చేయాలి
- తప్పు చేసిన వారు రిటైరైనా వదిలి పెట్టేది లేదు
- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, మహా : ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వ అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని సర్కస్‌లా నడిపిస్తున్నారని, అధికారులు రింగ్ మాస్టర్లుగా తయారయ్యారని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా లాబీలో మీడియాతో మాట్లాడిన ఆయన అధికారుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మూసీ రివర్ డెవలప్‌మెంట్ అధికారి, ఐఏఎస్ నర్సింహారెడ్డి కాంగ్రెస్ లీడర్‌లా మాట్లాడుతున్నారని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘మూసీ ప్రాజెక్ట్‌ను ఆరు నూరైనా పూర్తి చేసి తీరుతామని అనడానికి నువ్వెవరివి?’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు ఒళ్లు దగ్గరపెట్టుకొని పని చేయాలని హెచ్చరించారు. ప్రస్తుతం తప్పు చేస్తున్న అధికారులను రిటైర్ అయినా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. తప్పుడు పనులకు ప్రభుత్వాన్ని అధికారులు ప్రేరేపిస్తున్నారని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ‘అధికారులు, మంత్రుల తీరు కుక్క తోకను ఊపట్లేదు.. తోకే కుక్కను ఊపుతున్నట్లుంది ’ అంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు.
రాజీనామాకు ఇప్పటికీ సిద్ధం
అధికారులతో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపై కేటీఆర్ విమర్శలు చేశారు. మహిళలకు 57 వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని భట్టి సభలో చెప్పారన్నారు. అయితే ఈ విషయమై తను మాట్లాడుతూ. ‘అది నిజమని నిరూపిస్తే రాజీనామా చేస్తాను అన్నాను, నేను ఇప్పటికీ ఆ మాటకు కట్టుబడి ఉన్నాను’ అని కేటీఆర్ గుర్తు చేశారు. మూసీ ప్రాజెక్ట్‌పై సభలో మంత్రి పచ్చి అబద్ధాలు మాట్లాడారని దుయ్యబట్టారు. మూసీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన డీపీఆర్‌ను అసెంబ్లీలో పెట్టాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.








