- వైఎస్ కుటుంబ పరువు బజారున పడేశారు.
- బాబు ట్రాప్లో షర్మిల, సునీత.
- మాజీ ఎమ్మెల్యే రాచమల్లు సంచలన వ్యాఖ్యలు!
హైదరాబాద్, మహా.
వైఎస్ కుటుంబ ఆస్తుల పంపకాల వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ.. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన సోదరి వైఎస్ షర్మిల చేస్తున్న విమర్శలపై రాచమల్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన స్వంత అన్నపైనే షర్మిల హద్దులు మీరి, విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో గౌరవం, పేరుప్రఖ్యాతులు ఉన్నాయని, కానీ షర్మిల, సునీత ఇద్దరూ కలిసి ఇప్పుడు ఆ కుటుంబ గౌరవాన్ని దారుణంగా దిగజార్చుతున్నారని రాచమల్లు మండిపడ్డారు. కేవలం ఆస్తుల కోసమే ఈ తరహా నీచమైన ఆరోపణలకు పాల్పడటం బాధాకరమన్నారు. వివాదాలు ఉన్నప్పటికీ స్వంత చెల్లెలు అనే ఉద్దేశంతో, ప్రేమతో వైఎస్ జగన్.. షర్మిలకు ఏకంగా రూ. 236 కోట్లను విడతలవారీగా ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. కోట్ల రూపాయలు తీసుకుని కూడా అన్నపైనే ఆమె బురదజల్లడం ఎంతవరకు సమంజసమని రాచమల్లు ప్రశ్నించారు.
ఈ మొత్తం వ్యవహారం వెనుక భారీ రాజకీయ కుట్ర దాగి ఉందని రాచమల్లు ఆరోపించారు. జగన్ను రాజకీయంగా దెబ్బతీసి, టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రయోజనం చేకూర్చడమే ఏకైక లక్ష్యంగా షర్మిల పావులు కదుపుతున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు రాజకీయ నైజం తెలియని షర్మిల, సునీత ఇప్పుడు ఆయన వలలో పడి పావులుగా మారారని.. కానీ ఎప్పటికైనా చంద్రబాబు వారిద్దరినీ దారుణంగా మోసం చేయడం తథ్యమని ఆయన జోస్యం చెప్పారు.
రాజకీయ స్వార్థం కోసం వాడుకుని వదిలేసిన తర్వాత.. చంద్రబాబు అసలు రంగు బయటపడుతుందని, అప్పుడు మోసపోయామని గ్రహించిన షర్మిల, సునీతలకు కచ్చితంగా కనువిప్పు కలుగుతుందన్నారు. ఆ భంగపాటు తర్వాత దిక్కుతోచని పరిస్థితుల్లో వారిద్దరూ మళ్లీ సొంత అన్న వైఎస్ జగన్ దగ్గరికే రావడం ఖాయమని రాచమల్లు కుండబద్దలు కొట్టారు.








