హైదరాబాద్, మహా.
ఉగాది పండుగ సందర్భంగా ఖమ్మం జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబురును అందించింది. జిల్లా మారుమూల గ్రామాల నుంచి పట్టణాలకు అత్యుత్తమ రవాణా సదుపాయాలు కల్పిస్తూ, జిల్లా సమగ్రాభివృద్ధిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసాధారణ చొరవ చూపారు. ఆయన కృషితో జిల్లాలోని ఐదు కీలక రహదారులను నాలుగు వరుసల (ఫోర్ లేన్) మార్గాలుగా విస్తరించేందుకు ప్రభుత్వం ఏకంగా రూ.594 కోట్ల భారీ నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు మార్చి 16, 2026న జీవో ఎంఎస్ నెంబర్ 15ను విడుదల చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
**గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతం**
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పద్ధతిలో ఈ నిధులు మంజూరు చేయించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ రహదారుల ఆధునికీకరణతో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారనున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించడం సులభతరం కానుంది. ప్రధానంగా ఖమ్మం, వైరా, మధిర నియోజకవర్గాల్లో కనెక్టివిటీ పెరిగి స్థానిక ఆర్థిక వ్యవస్థకు గొప్ప ఊతం లభించనుంది. రవాణా ఖర్చులు, సమయం ఆదా కానుండటంతో రైతులు, వ్యాపారులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.
**ఐదు ప్రధాన రహదారుల విస్తరణ వివరాలు**
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని కలుపుతూ వైరా నుంచి జగ్గయ్యపేట వరకు ఉన్న మార్గాన్ని నాలుగు వరుసల రహదారిగా విస్తరించనున్నారు. జగ్గయ్యపేట, బోనకల్, రావినూతల, ముజఫర్ నగర్, జానకీపురం, పెద్దబీరవల్లి, పాలడుగు, సీతానగరం, గొల్లపూడి, రెబ్బవరం, తాటిపూడి, జింకల తాండా, సోమవరం మీదుగా వైరా వరకు సాగే ఈ 25.2 కిలోమీటర్ల పొడవైన మార్గానికి ప్రభుత్వం రూ.151.20 కోట్లను మంజూరు చేసింది.
రెండవ ప్రాజెక్టు కింద మధిర నుంచి తూటికుంట్ల వరకు ఉన్న మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు. మధిర నుంచి జిలుగుమాడు, ఆత్కూరు, కిష్టాపురం, సిరిపురం, కలకోట, బ్రాహ్మణపల్లి మీదుగా తూటికుంట్ల వరకు సాగే 13.50 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ కోసం రూ. 81 కోట్లు కేటాయించారు.
అలాగే, మధిర నుంచి ఎర్రుపాలెం వరకు ఉన్న రహదారి కూడా ఆధునికీకరణకు నోచుకుంది. మధిర, ఎల్లెందులపాడు, దెందుకూరు, మీనవోలు మీదుగా ఎర్రుపాలెం చేరుకునే ఈ 18.40 కిలోమీటర్ల మార్గాన్ని నాలుగు వరుసలుగా మార్చేందుకు రూ.110.40 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది.
జిల్లా కేంద్రం ఖమ్మం నుంచి బోనకల్ వరకు ఉన్న అత్యంత కీలకమైన మార్గం కూడా నాలుగు వరుసల రహదారిగా మారనుంది. ఖమ్మం, కొత్తూరు, దంసలాపురం, గాంధీనగరం, రామకృష్ణాపురం, పందిళ్లపల్లి, జగన్నాథపురం, నాగులవంచ, ముష్టికుంట్ల మీదుగా సాగే 28.03 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులకు ఏకంగా రూ.157.23 కోట్లు మంజూరయ్యాయి.
చివరగా, బోనకల్-ఆళ్లపాడు, రాయన్నపేట-వంగవీడు మార్గాన్ని సైతం విస్తరించనున్నారు. బోనకల్, ఆళ్లపాడు, రాయన్నపేట మీదుగా వంగవీడు వరకు సాగే మొత్తం 15.72 కిలోమీటర్ల రహదారి విస్తరణ కోసం రూ.94.32 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది.








