Mahaa Daily Exclusive

  కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట..! ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పార్టీకి మార్గం సుగమం..!

Share

హైదరాబాద్, మహా.

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తూ కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న కల్వకుంట్ల కవితకు న్యాయస్థానంలో అతిపెద్ద విజయం దక్కింది. ఆమె స్థాపించతలపెట్టిన ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పార్టీ నమోదు వ్యవహారంలో ఎదురైన అడ్డంకులను పటాపంచలు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఆమెకు భారీ ఊరటనిచ్చింది. ఈ పార్టీ రిజిస్ట్రేషన్ విషయంలో ఏమాత్రం జాప్యం చేయకుండా వీలైనంత త్వరగా తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీ) న్యాయస్థానం ఆదేశించడం ప్రస్తుత రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

గతంలో కవిత దాఖలు చేసిన పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తులో పలు సాంకేతిక లోపాలు ఉన్నాయంటూ ఎన్నికల సంఘం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆ ప్రక్రియను నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, ఈసీ లేవనెత్తిన ప్రతి చిన్న లోపాన్ని, సాంకేతిక సమస్యను తమ క్లయింట్ అత్యంత పకడ్బందీగా సరిదిద్దారని కవిత తరఫు న్యాయవాదులు తాజాగా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పాత దరఖాస్తులోని తప్పులన్నింటినీ సవరించి, ఈసీ నిబంధనలకు అనుగుణంగా పూర్తి స్థాయి పత్రాలతో మళ్లీ సరికొత్తగా దరఖాస్తు చేసినట్లు న్యాయస్థానంలో స్పష్టం చేశారు. కవిత న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ఈ ప్రక్రియను ఇక ఏమాత్రం సాగదీయకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఎన్నికల సంఘానికి సూచించింది.

హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఎన్నికల సంఘం కూడా సానుకూలంగా స్పందించింది. సవరించిన తాజా దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పార్టీ నమోదు వ్యవహారంపై అతి త్వరలోనే తమ తుది నిర్ణయాన్ని వెలువరిస్తామని ఈసీ న్యాయస్థానానికి హామీ ఇచ్చింది. దీంతో ఇన్నాళ్లుగా పార్టీ రిజిస్ట్రేషన్ చుట్టూ అలుముకున్న సందిగ్ధతకు దాదాపుగా తెరపడినట్లయింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో.. ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ రావడం లాంఛనమేనని స్పష్టమవుతోంది. త్వరలోనే కవిత తన కొత్త రాజకీయ ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభించి, తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై సరికొత్త ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమవుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Latest