Mahaa Daily Exclusive

  ఏప్రిల్ మొదటి వారంలోనే ఇంటర్ ఫలితాలు..!

Share

  • మూల్యాంకన ప్రక్రియలో కీలక మార్పులు.

హైదరాబాద్, మహా.

రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. ఈ విద్యా సంవత్సరం వార్షిక పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 10వ తేదీకల్లా వెల్లడించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు ముమ్మర సన్నాహాలు చేస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే ఏప్రిల్ 6వ తేదీనే ఈ ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ 1 నుంచి జూనియర్ కళాశాలలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈలోగానే ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి, మే 31 నాటికి ఆ ఫలితాలను కూడా ప్రకటించాలని బోర్డు ఒక స్పష్టమైన లక్ష్యంతో ముందుకు వెళుతోంది. గతేడాది సాధారణ ఫలితాలు ఏప్రిల్ 22న, సప్లిమెంటరీ రిజల్ట్స్ జూన్ 16న విడుదలయ్యాయి. ఈసారి ఆ ప్రక్రియను మరింత వేగవంతం చేయడం గమనార్హం.

ఫలితాల వెల్లడిని ముందుగా నిర్ణయించిన గడువులోగా పూర్తి చేసేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ నుంచి జవాబు పత్రాల మూల్యాంకన (స్పాట్ వాల్యుయేషన్) ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. అయితే, ఈసారి మూల్యాంకన కేంద్రాల్లో పనివేళలను విద్యాశాఖ రెండు గంటల పాటు పొడిగించింది. గత సంవత్సరాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే స్పాట్ వాల్యుయేషన్ జరిగేది. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఉదయం 9 గంటలకే ప్రారంభించి సాయంత్రం 6 గంటల వరకు విధుల్లో ఉండాలని సంబంధిత అధికారులకు డీఈఓలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

పనివేళల పెంపుతో పాటు, రోజువారీ దిద్దాల్సిన పేపర్ల సంఖ్య పెరగడంపై కొందరు అధ్యాపకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో రోజుకు 30 పేపర్లు మాత్రమే మూల్యాంకనం కోసం ఇచ్చేవారని, కానీ ఇప్పుడు ఆ సంఖ్యను 45కు పెంచారని వారు ఆవేదన చెందుతున్నారు. పని గంటలతో పాటు పేపర్ల భారం కూడా పెరగడం వల్ల ఏకాగ్రత లోపిస్తుందని వరంగల్ క్యాంపులో విధుల్లో ఉన్న ఒక అధ్యాపకుడు అభిప్రాయపడ్డారు. దీనివల్ల మూల్యాంకనంలో పొరపాట్లు జరిగి విద్యార్థులకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారంపై ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య సానుకూలంగా స్పందించారు. రోజుకు గరిష్టంగా 40 పేపర్లు మాత్రమే ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని, అంతకుమించి ఎవరైనా ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, త్వరలో రానున్న ఉగాది, రంజాన్ పండుగల దృష్ట్యా మూల్యాంకన విధుల్లో పాల్గొనే అధ్యాపకులకు బోర్డు ఊరటనిచ్చింది. పండుగలను జరుపుకోవాలనుకునే వారు విధులకు హాజరుకాకుండా సెలవు తీసుకోవచ్చని, వారిని ఎవరూ బలవంతపెట్టరని అధికారులు వెల్లడించారు. అయితే సిబ్బంది సెలవుల్లో ఉన్నప్పటికీ, స్పాట్ క్యాంపులు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Latest