Mahaa Daily Exclusive

  చట్టసభల్లో ‘విప్’ల మోత..!

Share

  • సీఎం రేవంత్ వ్యూహాత్మక అస్త్రం..
  • అటు సీనియర్లు.. ఇటు యువకెరటాలు.
  • విప్ ల నియామకంలో రేవంత్ మార్క్
  •  మండలిలో ప్రభుత్వ గొంతుకగా ఫైర్ బ్రాండ్స్!

హైదరాబాద్, మహా.

 

తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన బలమైన ముద్ర వేస్తున్నారు. ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా, ప్రభుత్వ గొంతుకను అత్యంత బలంగా వినిపించేందుకు ఆయన పదునైన అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ, చట్టసభల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని మరింత పటిష్టం చేస్తూ శాసన సభ, శాసన మండలిలకు కొత్త విప్ లను నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యూహాత్మక అడుగుతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి రేవంత్ రెడ్డి తన సునిశిత రాజకీయ చాతుర్యాన్ని, పాలనా దక్షతను అద్భుతంగా నిరూపించుకున్నారు.

 

శాసనసభలో ప్రభుత్వ విప్ లుగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావులకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ ముగ్గురు నేతలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నవారు కావడంతో పాటు, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమైన బలమైన నాయకులు. బడ్జెట్ సమావేశాల్లో ఏ అంశంపైనైనా అనర్గళంగా మాట్లాడి ప్రతిపక్షాలను చిత్తు చేయగల సత్తా ఈ సీనియర్ల సొంతం. వీరి నియామకంతో దిగువ సభలో ప్రభుత్వ గొంతుక మరింత గంభీరంగా వినిపించనుంది.

 

**మండలిలో యువ కిశోరాల గర్జన**

 

పెద్దల సభ అయిన శాసన మండలిలో యువ రక్తానికి పెద్దపీట వేయడం ద్వారా రేవంత్ రెడ్డి సరికొత్త రాజకీయ సంప్రదాయానికి తెరతీశారు. విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యలపై వీరోచితంగా పోరాడి రాటుదేలిన యువ నాయకుడు బల్మూరి వెంకట్, తనదైన శైలి వాగ్దాటితో ప్రత్యర్థులపై నిప్పులు చెరిగే ఫైర్ బ్రాండ్ అద్దంకి దయాకర్ లను శాసన మండలిలో ప్రభుత్వ విప్ లుగా నియమించారు. ప్రభుత్వ విధానాలను మండలిలో బలంగా వినిపించడంతో పాటు, పార్టీ పట్ల అత్యంత నిబద్ధత కలిగిన ఈ యువ నేతలు ప్రతిపక్షాల వ్యూహాలను దీటుగా ఎదుర్కోనున్నారు. ఈ నియామకాల ద్వారా యువతకు ప్రాధాన్యం ఇస్తానన్న తన మాటను సీఎం రేవంత్ రెడ్డి అక్షరాలా నిలబెట్టుకున్నారు.

 

**వెంటనే అమల్లోకి వచ్చిన నియామకాలు**

 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గురువారం జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల మేరకు ఈ కీలక నియామకాలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. బడ్జెట్ సమావేశాల వంటి అత్యంత కీలక సమయంలో ఈ నియామకాలు జరగడం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సభలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వ బిల్లులు ఆమోదం పొందాలన్నా, పాలనాపరమైన విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నా పటిష్టమైన విప్ వ్యవస్థ చాలా అవసరం. సరిగ్గా ఈ పక్కా వ్యూహంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు సీనియార్టీకి ఇటు యువతకు సమ ప్రాధాన్యం ఇస్తూ అత్యంత సమర్థవంతమైన నాయకులను చట్టసభల్లో తమ వాయిస్ గా నియమించుకున్నారు.

Latest