Mahaa Daily Exclusive

  గద్దర్ అవార్డుల వేదికపై అరుదైన దృశ్యం..! ‘మా ఊరి కోడలు’ అంటూ రష్మికపై సీఎం రేవంత్ రెడ్డి సరదా వ్యాఖ్యలు..!

Share

  • గద్దర్ అవార్డుల వేదికపై అరుదైన దృశ్యం.
  •  ‘మా ఊరి కోడలు’ అంటూ రష్మికపై సీఎం రేవంత్ రెడ్డి సరదా వ్యాఖ్యలు!
  •  నేషనల్ క్రష్‌కు ముఖ్యమంత్రి ప్రత్యేక గౌరవం.

హైదరాబాద్, మహా.

తెలంగాణ గడ్డపై ప్రజా యుద్ధనౌక గద్దర్ స్మారకార్థం ఏర్పాటు చేసిన అవార్డుల ప్రదానోత్సవం సినీ, రాజకీయ దిగ్గజాల కలయికతో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ వేడుకలో కళాకారుల ప్రతిభను గౌరవించే క్రమంలో ఎన్నో మధురమైన , ఆసక్తికరమైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా నేషనల్ క్రష్ రష్మిక మందన ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రంలో కనబరిచిన అద్భుత నటనకు గానూ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకోవడం ఈ సాయంత్రానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రష్మిక ఈ అవార్డును అందుకుంటున్న సమయంలో వేదికపై ఒక సరదా సంభాషణ అందరినీ ఆశ్చర్యపరిచింది. అవార్డు అందజేస్తూనే పక్కనే ఉన్న స్టార్ యాంకర్ సుమతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. “రష్మిక మందన మన ఊరి కోడలు తెలుసా?” అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నోట ఈ మాట వినగానే రష్మిక ముఖంలో ఆనందం వెల్లివిరియగా, సభికులంతా చప్పట్లతో ఈ సరదా క్షణాన్ని ఎంజాయ్ చేశారు. అనంతరం రష్మిక స్పందిస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకోవడం తన కెరీర్‌లో అత్యంత స్పెషల్ అని, ఈ క్షణం తన గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని భావోద్వేగానికి లోనయ్యారు.

ఈ వేడుక కేవలం అవార్డులకే పరిమితం కాకుండా, భారతీయ సినీ పరిశ్రమలోని హేమాహేమీల సమక్షంలో ఒక వేడుకలా సాగింది. మెగాస్టార్ చిరంజీవి దంపతులు, విశ్వనటుడు కమల్ హాసన్, అక్కినేని నాగార్జున దంపతులు ఒకే వేదికపై మెరవడంతో అభిమానుల కళ్లు కాయలు కాచాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అక్కినేని నాగచైతన్య తన సతీమణితో కలిసి విచ్చేయగా, ఖుష్బూ, అల్లు అరవింద్ వంటి ప్రముఖులు ఈ వేడుకకు నిండుతనాన్ని తీసుకువచ్చారు. తెలంగాణ సంస్కృతిని, కళలను ప్రతిబింబిస్తూ సాగిన ఈ అవార్డుల కార్యక్రమం సినీ కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అతిపెద్ద గౌరవంగా నిలిచిపోయింది.

Latest