Mahaa Daily Exclusive

  వరుణుడి విలయతాండవం..! తెలుగు రాష్ట్రాల్లో పిడుగుల వాన.. రాలిన ప్రాణాలు.!

Share

  • వరుణుడి విలయతాండవం.
  • తెలుగు రాష్ట్రాల్లో పిడుగుల వాన.. రాలిన ప్రాణాలు!
  • నలుగురు మృతి.. 300 మూగజీవాలు బలి!

హైదరాబాద్, మహా.

తెలుగు రాష్ట్రాలపై ప్రకృతి ప్రకోపం ఒక్కసారిగా విరుచుకుపడింది. ఎండ తీవ్రతతో అల్లాడుతున్న జనానికి ఉపశమనం కలిగిస్తుందని ఆశించిన మేఘాలు, ఊహించని రీతిలో మృత్యుపాశాలై మారి విరుచుకుపడ్డాయి. ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పెను విషాదాన్ని మిగిల్చింది. నింగి నుంచి విరుచుకుపడిన పిడుగులు నలుగురి ప్రాణాలను బలితీసుకోగా, అన్నదాతల కష్టార్జితం వడగళ్ల వానలో కలిసిపోయింది. వనపర్తి నుంచి బాపట్ల వరకు, వికారాబాద్ నుంచి ఖమ్మం వరకు ఎక్కడ చూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి.

పొలాల్లో పనిచేసుకుంటున్న వారు, పనుల నిమిత్తం బయటకు వెళ్లిన వారు పిడుగుల భారిన పడి తనువు చాలించారు. తెలంగాణలోని వనపర్తి జిల్లాలో యువ రైతు రాములు మరణం ఆ గ్రామాన్ని దిగ్భ్రాంతికి గురిచేయగా, ఏపీలోని బాపట్ల, పల్నాడు జిలాల్లో కౌలు రైతు వనజ, కూలీ సుబ్బరత్తమ్మ మరణాలు వారి కుటుంబాలను రోడ్డున పడేశాయి. గుంటూరు జిల్లాలో ఒక ప్రైవేట్ ఉద్యోగి సైతం ప్రకృతి ప్రకోపానికి బలవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కేవలం మనుషులకే కాదు, మూగజీవాలకు కూడా ఈ వర్షం శాపంగా మారింది. వికారాబాద్ జిల్లాలో ఒకే చోట సుమారు 300 మేకలు పిడుగుపాటుకు మృతి చెందడం స్థానికులను కలచివేసింది. మందపై పిడుగు పడటంతో ఆ ప్రాంతమంతా మాంసపు ముద్దలుగా మారి భీతావహంగా తయారైంది.

మరోవైపు ఆరబెట్టిన పంటను కాపాడుకునేందుకు రైతులు పడుతున్న పాట్లు వర్ణనాతీతం. ఆకాశం మేఘావృతమై ఉరుములు మొదలవ్వగానే, కళ్ళాల్లో ఉన్న మిర్చిని తడవకుండా కప్పేందుకు రైతులు పడుతున్న ఆవేదన చూస్తుంటే కంటతడి రాక మానదు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో చేతికి వచ్చిన మొక్కజొన్న పంట నేలకొరగడంతో రైతులు కుదేలయ్యారు. ఈ అకాల వర్షాల వెనుక వాతావరణంలో సంభవిస్తున్న అనూహ్య మార్పులు, ఉపరితల ఆవర్తన ప్రభావం ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సాధారణంగా వేసవి కాలంలో పెరిగే ఉష్ణోగ్రతల వల్ల స్థానిక వాతావరణంలో మార్పులు వచ్చి ‘థండర్ స్టార్మ్స్’ ఏర్పడతాయని, ఇవి అత్యంత ప్రమాదకరమైన పిడుగులకు కారణమవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ముప్పు ఇంకా తొలగిపోలేదని స్పష్టమవుతోంది. రానున్న 48 గంటల పాటు తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిలాల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు వచ్చే సమయంలో చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల దగ్గర గానీ ఉండవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. గాలివానల ధాటికి ఇప్పటికే విద్యుత్ వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తక్షణమే ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని బాధిత వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.

Latest