స్వగ్రామంలో రామలింగేశ్వరుడి చెంతకు కేసీఆర్.
* చింతమడక ధ్వజస్తంభ ప్రతిష్టకు ఆహ్వానం!
* బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆలయ కమిటీ ఆహ్వానం!
* ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ను కలిసిన ఆలయ కమిటీ.
సిద్ధిపేట,మహా.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన స్వగ్రామమైన సిద్ధిపేట జిల్లా చింతమడకపై ఉన్న మమకారాన్ని మరోసారి చాటుకోనున్నారు. చింతమడక గ్రామంలోని అత్యంత పురాతనమైన, మహిమాన్వితమైన శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఈ నెల 25 , 27వ తేదీల్లో నిర్వహించనున్న నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన మరియు శ్రీరామ నవమి మహోత్సవాలకు కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్వకుంట్ల వంశీధర్ రావు నేతృత్వంలో ఆలయ కమిటీ ప్రతినిధులు శుక్రవారం ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకుని, ఆయనను అధికారికంగా ఆహ్వానించారు. ఈ భేటీలో ఆలయ కమిటీ సభ్యులు ఆకుల రామ గౌడ్, పెండల గణేష్, బైరి నర్సింహా రెడ్డి, వాతం శివ, పడకండి విశ్వనాధం, ఎల్లప్పగారి పోచయ్య తదితరులు పాల్గొని కేసీఆర్కు ఆహ్వాన పత్రికను అందజేసి, ఉత్సవాల ఏర్పాట్లను వివరించారు.
చింతమడక గ్రామంతో కేసీఆర్కు ఉన్న అనుబంధం కేవలం పుట్టిన గడ్డగానే కాకుండా, భావోద్వేగపూరితమైనది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఆయన తన గ్రామాన్ని దర్శించి గ్రామస్తులతో మమేకమైన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు గ్రామంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుగుతున్న ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆయన రాక కోసం గ్రామస్తులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ ఉత్సవాలు గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపడమే కాకుండా, రాజకీయాలకు అతీతంగా గ్రామ ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకువస్తున్నాయి. కేసీఆర్ చేతుల మీదుగా లేదా ఆయన సమక్షంలో ఈ కార్యక్రమాలు జరగడం గ్రామస్తులకు ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. ఆలయ కమిటీ ప్రతినిధులు ఎంతో భక్తితో ఆహ్వానించిన నేపథ్యంలో, కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించి ఉత్సవాలకు హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఈ నెల 25వ తేదీన ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం శాస్త్రోక్తంగా, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించనున్నారు. అనంతరం 27వ తేదీన శ్రీరామ నవమి వేడుకలు కనులపండువగా జరగనున్నాయి. సీతారాముల కళ్యాణ మహోత్సవం మరియు రథోత్సవం వంటి కార్యక్రమాలతో చింతమడక పురవీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనున్నాయి. ఈ వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కేసీఆర్ రాకతో ఈ ఉత్సవాలకు మరింత ప్రాముఖ్యత చేకూరడమే కాకుండా, గ్రామ అభివృద్ధి మరియు ఆధ్యాత్మిక పురోగతిపై ఆయనకున్న చిత్తశుద్ధి మరోసారి స్పష్టమవుతోంది. స్వగ్రామంలో నిర్వహించే ఈ పవిత్ర కార్యక్రామాల్లో పాల్గొనడం ద్వారా కేసీఆర్ తన మూలాలను గుర్తు చేసుకుంటూ, గ్రామ దేవతల పట్ల ఉన్న భక్తిని చాటుకోనున్నారు.








