Mahaa Daily Exclusive

  కాంగ్రెస్ బడ్జెట్‌పై కవిత నిప్పులు……

Share

  • ఇది ఫేక్, రివిజన్, ప్యాబ్రికేటెడ్ బడ్జెట్
  • ఇది ఫేక్, ఫేకర్, ఫేకెస్ట్ ప్రభుత్వం
  • ఇక నుంచి రాహుల్ గాంధీకి “రాహుల్ ఫేక్” అని నామకరణం చేస్తున్నాం
  • బడ్జెట్ పై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, మహా : కాంగ్రెస్ ప్రభుత్వం ఫేక్, రివిజన్, ప్యాబ్రికేటెడ్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బీసీలు, మహిళలు, నిరుద్యోగులు, రైతులు, వికలాంగులు, మైనార్టీల ఇలా అన్ని వర్గాలకు బడ్జెట్ లో అన్యాయం చేశారని అన్నారు. జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత రైతుభరోసా, చేయూత పింఛన్లు సహా చాలా రంగాలకు గతేడాది కేటాయించిన నిధులనే అక్షరం మార్చకుండా కొత్త బడ్జెట్ లోనూ పెట్టారన్నారు. ఈ ప్రభుత్వానికి కనీస విజన్ కూడా లేదని అందుకే ఇది రివిజన్ బడ్జెట్ అంటున్నామని మండిపడ్డారు. ఏటా బీసీలకు రూ. 20 వేల కోట్లు కేటాయిస్తామంటూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఫేకారని.. కానీ బడ్జెట్ లో మాత్రం 4 శాతం నిధులే కేటాయించి బీసీలను మోసం చేశారన్నారు. రాష్ట్ర జనాభాలో 56 శాతం మంది ఉన్న బీసీలకు 4 శాతం నిధులు ఇవ్వడం ఏమిటని నిలదీశారు. లక్షల కోట్లు అప్పులు తెస్తున్న రేవంత్ సర్కార్ ఆ డబ్బులను ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దాదాపు 8 లక్షల 64 వేల కోట్లు అప్పు చేసి ప్రతి ఒక్కరి తలపై రూ. 2 లక్షల 16 వేల భారం మోపారన్నారు. ఒక్కో కుటుంబంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.9 లక్షల అప్పుల భారం మోపిందన్నారు. లక్షల కోట్ల అప్పులు తెచ్చినా ప్రజలకు మాత్రం పైసా మేలు జరగలేదన్నారు. మోడీ తన బడే భాయ్ అంటూ ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా ఎందుకు తేలేదో చెప్పాలని నిలదీశారు. ప్రజలకు మేలు చేయటం చేతకాని కాంగ్రెస్ నాయకులు ఒకరిని మించి ఒకరు ఫేక్ తున్నారని మండిపడ్డారు. అందుకే ఇది ఫేక్, ఫేకర్, ఫేకెస్ట్ ప్రభుత్వమని కవిత విమర్శించారు.

రాహుల్ ఫేక్

ఎన్నికల సమయంలో తెలంగాణకు వచ్చి పెద్ద ఎత్తున హామీలిచ్చిన రాహుల్ గాంధీపై కవిత తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా ఫేకే అన్నారు. హైదరాబాద్ లో సలీం ఫేక్ అనే నటుడి మాదిరిగానే రాహుల్ గాంధీ కూడా ఫేక్ మాటలు చెబుతుంటాడని విమర్శించారు. అందుకే ఇక నుంచి రాహుల్ గాంధీకి రాహుల్ ఫేక్ గా నామకరణం చేస్తున్నామన్నారు. సలీం ఫేక్ తన మాటలతో నవ్విస్తే…రాహుల్ గాంధీ మాత్రం తెలంగాణ ప్రజలను ఏడిపిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు ఎప్పుడు వచ్చిన సరే ఆయన ఇచ్చిన హామీలపై నిలదీస్తామన్నారు.

Latest