* 20 మంది ఆటగాళ్లతో బీసీసీఐ మాస్టర్ ప్లాన్ సిద్ధం.
* టీమిండియా స్టార్ల ఆటతీరుపై ప్రత్యేక నజర్!
* బుమ్రా, సిరాజ్ కోసం ప్రత్యేక వ్యూహం..
* టెస్ట్ ఛాంపియన్‌షిప్‌పై సెలక్టర్ల ఫోకస్!
* ప్రయోగాలకు తావులేదంటున్న బీసీసీఐ!
* ఐపీఎల్ 2026లో ప్లేయర్ల ఫామ్‌పై డేగకన్ను!
హైదరాబాద్, మహా.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న తరుణంలో, టీమిండియా అంతర్జాతీయ క్రికెట్‌కు తాత్కాలిక విరామం లభించినట్లు కనిపిస్తున్నా, తెరవెనుక సెలక్టర్లు మాత్రం విశ్రాంతి లేకుండా పని చేస్తున్నారు. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే సుమారు 20 మంది కీలక ఆటగాళ్లతో కూడిన ప్రాబబుల్స్ జాబితాను సెలక్షన్ కమిటీ సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ ఐపీఎల్ సీజన్‌ను కేవలం టీ20 మెగా లీగ్‌గా మాత్రమే కాకుండా, రాబోయే వన్డే ప్రపంచకప్, 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌కు పునాదిగా బీసీసీఐ భావిస్తోంది. ఇందుకోసం సెలక్టర్లకు కఠినమైన నిబంధనలను విధించింది. ప్రతి సెలక్టర్ వారానికి కనీసం ఒక మ్యాచ్‌ను స్టేడియంకు వెళ్లి ప్రత్యక్షంగా వీక్షించాలని, తద్వారా ఆటగాళ్ల మానసిక స్థితిని, ఫిట్నెస్ను దగ్గరగా పరిశీలించాలని నిర్ణయించింది.
పేస్ విభాగంలో హర్షిత్ రాణా గాయం కారణంగా తప్పుకోవడం సెలక్టర్లను కొంత ఆందోళనకు గురిచేస్తున్నా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, అర్షదీప్ సింగ్ మరియు హార్దిక్ పాండ్య వంటి కీలక బౌలర్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని బీసీసీఐ నిర్ణయించింది. కేవలం కొత్త ప్రతిభను వెతకడమే కాకుండా, ఉన్న సీనియర్ ఆటగాళ్ల నిలకడను అంచనా వేయడమే ఈ ఐపీఎల్ పర్యవేక్షణ ప్రధాన ఉద్దేశ్యం. ఐపీఎల్ ముగిసిన వెంటనే అఫ్ఘానిస్తాన్‌తో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్‌కు కూడా పూర్తిస్థాయి జట్టును రంగంలోకి దించాలని బోర్డు భావిస్తోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ , పాయింట్లతో సంబంధం లేకపోయినా, కీలక ఆటగాళ్లందరూ కలిసి ఆడటం ద్వారా జట్టులో సమన్వయం పెరుగుతుందని సెలక్టర్లు భావిస్తున్నారు.
ముఖ్యంగా టెస్టు క్రికెట్లో టీమిండియా రాబోయే కాలంలో 9 కీలక మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నందున, ప్రయోగాలకు తావు లేకుండా అనుభవజ్ఞులైన బుమ్రా, సిరాజ్ వంటి బౌలర్లనే కొనసాగించాలని నిర్ణయించారు. ప్రయోగాల కోసం ఇండియా-ఏ పర్యటనలను వేదికగా మార్చుకోవాలని, ప్రధాన జట్టులో మాత్రం స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యూహాత్మక అడుగులు భారత క్రికెట్‌ను సుస్థిరమైన మార్గంలో నడిపిస్తాయని, రాబోయే ఐదేళ్లలో మేజర్ ఐసీసీ టోర్నీలను కైవసం చేసుకోవడానికి ఈ ప్రణాళికలు ఎంతో దోహదపడతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
**బీసీసీఐ పరిశీలనలో ఉన్న 20 మంది కీలక ఆటగాళ్ల వివరాలు**
టాప్ ఆర్డర్ బ్యాటర్లు: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్.
మిడిల్ ఆర్డర్, వికెట్ కీపర్లు: కె.ఎల్. రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, సంజూ శామ్సన్.
ఆల్ రౌండర్లు: హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే.
పేసర్లు (ఫాస్ట్ బౌలర్లు): జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ షమీ, హర్షిత్ రాణా (గాయం నుంచి కోలుకున్నాక).
స్పిన్నర్లు: కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
సెలక్టర్ల పర్యవేక్షణ: అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సభ్యులు ఐపీఎల్ 2026 మ్యాచులను ప్రత్యక్షంగా చూస్తూ ఈ 20 మంది ప్రదర్శనను ట్రాక్ చేస్తారు








