సామాన్యుడిపై ‘ధరల’ పిడుగు.
* రెండు వారాల్లోనే ఆకాశానికి నిత్యావసరాలు.
* కేంద్రంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు.
హైదరాబాద్, మహా.
దేశవ్యాప్తంగా నిత్యావసర సరుకులతో పాటు వివిధ రకాల వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. కేవలం గత రెండు వారాల వ్యవధిలోనే సామాన్యుల నడ్డి విరిచేలా అనేక వస్తువుల ధరలు భారీగా పెరిగాయని, ఈ అడ్డూ అదుపూ లేని ధరల పెరుగుదలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ ఆవేదన వ్యక్తం చేసింది. రోజువారీ అవసరాలకు వినియోగించే వస్తువుల నుండి ప్రయాణ ఖర్చుల వరకు అన్నింటి పైనా కేంద్రం భారం మోపుతోందని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు.
గడిచిన పదిహేను రోజుల్లోనే పెరిగిన ధరల వివరాలను కాంగ్రెస్ పార్టీ ప్రముఖంగా ప్రస్తావించింది. ముఖ్యంగా సామాన్యుడి వంటగదిపై భారం మోపుతూ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 146 రూపాయలు పెరగ్గా, గృహ వినియోగ డొమెస్టిక్ సిలిండర్ ధరపై 60 రూపాయల అదనపు భారం పడిందని పేర్కొంది. అదేవిధంగా వంటనూనెల ధరలు సైతం వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. రిఫైన్డ్ ఆయిల్ లీటరుకు 30 రూపాయలు, పామ్ ఆయిల్ లీటరుకు 15 రూపాయల చొప్పున పెరగడం గమనార్హం. ఇక ఇంధన ధరల విషయానికి వస్తే, పరిశ్రమల్లో వినియోగించే ఇండస్ట్రియల్ డీజిల్ లీటరుకు 22 రూపాయలు, ప్రీమియం పెట్రోల్ లీటరుకు 2.35 రూపాయల మేర పెరిగి రవాణా, పారిశ్రామిక వర్గాలను కలవరపెడుతున్నాయి.
కేవలం నిత్యావసరాలే కాకుండా ఇతర సేవల రుసుములు, గృహోపకరణాల ధరలు కూడా సామాన్యులకు అందనంత దూరంలోకి వెళ్తున్నాయని కాంగ్రెస్ విమర్శించింది. ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తన డెలివరీ ఫీజును 2.40 రూపాయలు పెంచగా, విమాన ప్రయాణ టికెట్ల ధరలు ఏకంగా 425 రూపాయల నుంచి 2,300 రూపాయల వరకు పెరిగి ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. అంతేకాకుండా, ప్లాస్టిక్ బాటిల్ సెట్ పై 40 రూపాయలు పెరగ్గా, ఇండక్షన్ స్టవ్ ల ధర రికార్డు స్థాయిలో 40 శాతం మేర పెరగడం ఆందోళన కలిగిస్తోందని కాంగ్రెస్ పార్టీ గుర్తుచేస్తోంది. ఈ స్థాయిలో సాగుతున్న ధరల పెంపుతో సామాన్యులు బతికే పరిస్థితి లేదని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడింది.








