Mahaa Daily Exclusive

  జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలి సంచలన వీడియో: పవన్ కల్యాణ్‌ను నిలదీసిన బాధితురాలు….

Share

  • పవన్ కల్యాణ్, జనసేనకు విలువ లేదా ?
  • అరవ శ్రీధర్‌ బాధితురాలి సంచలన వీడియో!
  • జనసేనను వెంటాడుతున్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే బాధితురాలు
  • పార్టీ కార్యక్రమాల్లో శ్రీధర్ పాల్గొనడంపై డిప్యూటీ సీఎంకు ప్రశ్నలు
  • శ్రీధర్ కు క్లీన్ ఇచ్చారా చెప్పాలని నిలదీత

అమరావతి, మహా : నిను వీడని నీడను నేను అన్నట్టు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను ఓ మహిళ వెంటాడుతోంది. తనకు అన్యాయం చేసిన ఆ వ్యక్తికి శిక్ష పడే వరకు పోరాటం చేస్తానంటూ గతంలో చెప్పిన ఆమె ఇప్పుడు మరో వీడియో విడుదల చేసింది. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేస్తున్న జనసేన కమిటీ నిర్ణయం వెలుగులోకి రాక ముందే పార్టీ కార్యక్రమాల్లో శ్రీధర్ పాల్గొనడంపై బాధితురాలు ప్రశ్నిస్తున్నారు. నేరుగా పవన్ కల్యాణ్‌ను నిలదీస్తున్నారు. పార్టీకి, పవన్ కల్యాణ్‌కు ఉన్న విలువ ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో, ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన ఆరోపణలు పెను దుమారం రేపాయి. లైంగిక దాడికి పాల్పడటంతోపాటు, పలుమార్లు బలవంతంగా గర్భస్రావం చేయించారని బాధిత మహిళ ఆరోపించారు. ఈ కేసులో బాధితురాలు శనివారం మరో సంచలన వీడియోను బాధితురాలు విడుదల చేశారు.

పవన్ కల్యాణ్ అంటే లెక్కలేదా?

తాజాగా విడుదల చేసిన వీడియోలో బాధితురాలు తన ఆవేదనను వ్యక్తం చేస్తూ కొన్ని కీలక ప్రశ్నలు లేవనెత్తారు. అరవ శ్రీధర్‌పై వచ్చిన ఆరోపణల వేళ జనసేన పార్టీ ఒక అంతర్గత కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఆ కమిటీ నివేదిక ఇచ్చే వరకు శ్రీధర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని తొలుత ఆదేశాలు వచ్చాయి. దీనిపై బాధితురాలు తన వీడియోలో చాలా ప్రశ్నలు సందించారు. అరవ శ్రీధర్‌పై జనసేన వేసిన కమిటీ రిపోర్ట్ ఇంత వరకు ఎందుకు బయటకు రాలేదు. కమిటీ నివేదిక రాకుండా శ్రీధర్‌ పార్టీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటారు. అరవ శ్రీధర్‌కు పవన్ అంటే లెక్కలేదా? లేకుంటే ఇంటర్నల్‌గా ఏమైనా క్లీన్ చిట్ ఇచ్చారా అని నిలదీశారు. నివేదిక రాకుండానే అరవ శ్రీధర్‌ జనసేన కండువా కప్పుకొని తిరుగుతుంటే తనకు న్యాయం ఎప్పుడు జరుగుతుందని బాధితురాలు ప్రశ్నించారు. బాధితురాలు ఆరోపిస్తున్నట్టుగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇటీవలి కాలంలో తన నియోజకవర్గంలో బహిరంగంగా పర్యటిస్తున్నారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ముక్కావారిపల్లిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన జనసేన కండువా కప్పుకొని పాల్గొనడం చర్చనీయాంశమైంది.

“క్లీన్ చిట్ ఇస్తే నాకు కూడా చెప్పండి”

అందుకే బాధితులు తాజాగా విడుదల చేసిన వీడియోలో” పార్టీ నియమించిన కమిటీ ఏమైనా క్లీన్ చిట్ ఇచ్చిందా. తనకు తెలియకుండా అలా ఇచ్చి ఉంటే తనకు తెలుసుకునే హక్కు ఉంది. పవన్‌కు మద్దతు ఇచ్చే వ్యక్తిగా నాకు ఆ రైట్ ఉంది. అందుకే వీటిపై క్లారిటీ అడుగుతున్నాను. అలా క్లీన్ చిట్ ఇవ్వలేదు. అంటే పార్టీ కండువా వేసుకొని శ్రీధర్ పార్టీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటారు. అలా పాల్గొన్న వ్యక్తిపై చర్యలు తీసుకోరా. లేదంటే నేను అంటే లెక్కలేనట్టే మీరు చెప్పినా సరే ఇలా చేస్తున్నారంటే మీరంటే కూడా లెక్కలేదని అనుకోవాలా? శ్రీధర్ అనే వ్యక్తికి పవన్ కల్యాణ్, జనసేన పార్టీ చెప్పినా పట్టించుకోడు. వారికి ఆయన దృష్టిలో విలువ లేదు అని అనుకోవాల్సి ఉంటుంది. ” అని బాధితురాలు హెచ్చరించారు.

Latest