- మంత్రి ఇలాకాలో ఇసుక అరాచకం
- బ్రాహ్మణపల్లి రీచ్‌లో బరితెగించిన మాఫియా
- డీడీలున్నా తప్పని దోపిడీ
- నిబంధనలు గాలికొదిలేసి వసూళ్ల పర్వం
- ఒక్కో లారీకి రూ. 1700 నుండి రూ. 3700 వరకు అదనపు వసూళ్లు.
- కలెక్టర్ ఆదేశాలకు బేఖాతర్
- కలెక్టర్ హెచ్చరించినా తగ్గని కాంట్రాక్టర్ల దౌర్జన్యం.
- టీజిఎండిసి అధికారుల మౌనం
- అక్రమార్కులకు వత్తాసు
- ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి తప్పించుకుంటున్న స్టాక్ యార్డ్ సిబ్బంది.
పెద్దపల్లి, మహా : రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇసుక మాఫియా పంజా విసురుతోంది. మంత్రి ఇలాకాలో అక్రమాలకు తావుండదు అన్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ మహదేవపూర్ మండలం బ్రాహ్మణపల్లి ఇసుక రీచ్‌లో కాంట్రాక్టర్లు, అధికారులు సాగిస్తున్న దోపిడీ పర్వం కలకలం రేపుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడవాల్సిన రీచ్‌లలో ‘జగ్గారెడ్డి’ మార్కు వసూళ్లు సామాన్య డ్రైవర్ల నడ్డి విరుస్తున్నాయి.
మంత్రి నియోజకవర్గంలోనే వసూళ్ల దందా.!
మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గంలోనే ఇంత బహిరంగంగా అక్రమ వసూళ్లు జరుగుతుంటే యంత్రాంగం ఏం చేస్తోందని బాధితులు ప్రశ్నిస్తున్నారు. టిజిఎండిసి డీడీలు ఉన్నప్పటికీ, ఒక్కో లారీకి వేల రూపాయలు ఇస్తేనే లోడింగ్ చేస్తున్నారు. సన్న ఇసుకకు రూ. 3700 దొడ్డు ఇసుకకు రూ. 1700 అదనంగా వసూలు చేస్తూ, ప్రశ్నిస్తే మంత్రి అనుచరులమని, కాంట్రాక్టర్ మనుషులమని బెదిరింపులకు దిగుతున్నట్లు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పేదల కడుపు కొడుతున్న అక్రమార్కులు:
మంత్రి అసెంబ్లీలో మరియు వేదికలపై పారదర్శక పాలన గురించి మాట్లాడుతుంటే, ఇక్కడ క్షేత్రస్థాయిలో మాత్రం ఆయన పేరు చెప్పుకుని కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని లారీ ఓనర్లు ఆరోపిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు డీడీలు పట్టుకుని వేచి ఉన్నా, అదనపు మామూళ్లు’ ఇస్తే తప్ప లారీ ముందుకు కదలని పరిస్థితి నెలకొంది.
మంత్రి స్పందించాలి,
మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి ఈ విషయాలు వస్తున్నాయా.? లేక అధికారులు మీ వరకు చేరనివ్వడం లేదా.?అని బాధితులు నిలదీస్తున్నారు. మీ నియోజకవర్గంలో జరుగుతున్న ఈ ఇసుక దోపిడీని అరికట్టకపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. తక్షణమే మంత్రి ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించి, బ్రాహ్మణపల్లి రీచ్‌లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కాంట్రాక్టర్లపై మరియు వారికి సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు మరియు లారీ అసోసియేషన్ ప్రతినిధులు కోరుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టిజిఎండిసి) పర్యవేక్షణలో ఉండాల్సిన బ్రాహ్మణపల్లి ఇసుక రీచ్, ఇప్పుడు అక్రమ వసూళ్లకు అడ్డాగా మారింది. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాల్సిన అధికారులు ఏమయ్యారు.? కాంట్రాక్టర్లు యథేచ్ఛగా సాగిస్తున్న ఈ దోపిడీలో అధికారులకు కూడా వాటాలు అందుతున్నాయా.? అని లారీ యజమానులు సూటిగా ప్రశ్నిస్తున్నారు.
సాక్ష్యాలు ఇవే.. సమాధానం ఏది.?
రీచ్‌లలో జరుగుతున్న అక్రమ వసూళ్లకు సంబంధించి లారీ డ్రైవర్లు పక్కా సాక్ష్యాలను (వీడియోలు) బయటపెట్టారు. టీజిఎండిసి నిబంధనల ప్రకారం డీడీ చెల్లించిన తర్వాత పైసా కూడా ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా, కాంట్రాక్టర్ జగ్గారెడ్డి మనుషులు ఒక్కో లారీకి వేల రూపాయలు వసూలు చేస్తున్న దృశ్యాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇంత జరుగుతున్నా స్టాక్ యార్డ్ ఇంచార్జులు, పర్యవేక్షక అధికారులు కళ్లు మూసుకుని కూర్చోవడం వెనుక ఉన్న మర్మమేమిటి.? అనేది ఎవరికీ తెలియడం లేదు.
తనిఖీలు ఉత్త ముచ్చటేనా.?
జిల్లా యంత్రాంగం అప్పుడప్పుడు నిర్వహించే తనిఖీలు కేవలం కంటితుడుపు చర్యలేనా.? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల ఫోన్లు ఎందుకు స్విచ్ ఆఫ్ ఉంటున్నాయి.? వసూళ్లను అడ్డుకోవాల్సిన వారు కాంట్రాక్టర్లకు ఎందుకు వత్తాసు పలుకుతున్నారు.? డీడీ సమయం ముగిసినా లారీలను ఎందుకు లోడింగ్ చేయడం లేదు.? అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పే వారే లేరు.
అధికారుల మౌనం.. అక్రమార్కులకు బలం.!
మీరు ఎవరికి చెప్పుకున్నా మాకేమీ కాదు అంటూ కాంట్రాక్టర్ల అనుచరులు డ్రైవర్లపై దౌర్జన్యం చేస్తున్నారు. అధికారుల అండదండలు పుష్కలంగా ఉండబట్టే వారు ఇంతలా బరితెగిస్తున్నారని బాధితులు మండిపడుతున్నారు. పేద డ్రైవర్ల కడుపు కొట్టి, అక్రమ మార్గంలో సంపాదిస్తున్న ఈ సొమ్ములో వాటాలు అందబట్టే అధికారులు మౌనంగా ఉన్నారని స్పష్టమవుతోందని వారు ఆరోపిస్తున్నారు.
తక్షణ విచారణకు డిమాండ్:
వెంటనే ఉన్నతాధికారులు స్పందించి, వీడియో సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవాలి. బ్రాహ్మణపల్లి రీచ్‌లో తనిఖీలు నిర్వహించి, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కాంట్రాక్టర్లతో పాటు, వారికి సహకరిస్తున్న టిజిఎండీసి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఈ సాక్ష్యాలతో ఉన్నత స్థాయి విచారణకు వెళ్తామని బాధితులు హెచ్చరిస్తున్నారు.
కలెక్టర్ ఆదేశాలకు బేఖాతరు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఇసుక క్వారీల్లో అక్రమ వసూళ్లు, దౌర్జన్యాలు పరాకాష్టకు చేరుకున్నాయి. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇసుక రవాణాలో పారదర్శకత ఉండాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పదేపదే ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ముఖ్యంగా బ్రాహ్మణపల్లి వంటి ఇసుక రీచ్‌లలో కాంట్రాక్టర్లు కలెక్టర్ ఆర్డర్లను కాగితాలకే పరిమితం చేస్తూ తమ సొంత చట్టాలను అమలు చేస్తున్నారు.
హెచ్చరించినా మారని తీరు:
గత సమీక్షా సమావేశాల్లో కలెక్టర్ స్పష్టంగా ఆదేశించారు. డీడీలు చెల్లించిన వాహనాలను నిబంధనల ప్రకారం లోడింగ్ చేయాలి, అదనపు వసూళ్లకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అయినా ఈ హెచ్చరికలు కాంట్రాక్టర్ల చెవికి ఎక్కడం లేదు. ఒక్కో లారీకి వేల రూపాయల చొప్పున అక్రమ వసూళ్లకు పాల్పడుతూ, ప్రశ్నించిన డ్రైవర్లను భౌతికంగా బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల అండతోనే అరాచకాలు.?
జిల్లా యంత్రాంగం ఎన్నిసార్లు తనిఖీలు చేసినా, టాస్క్ ఫోర్స్ బృందాలను రంగంలోకి దించినా.. కాంట్రాక్టర్లు పద్ధతి మార్చుకోవడం లేదు. దీని వెనుక కొందరు స్థానిక అధికారుల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్ కఠినమైన ఉత్తర్వులు ఇస్తున్నా, వాటిని అమలు చేయాల్సిన సిబ్బంది ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి కాంట్రాక్టర్లకు సహకరిస్తుండటం గమనార్హం.
మరోసారి కఠినమైన చర్యలు తీసుకోవాలి
డీడీలు ఉన్నా లోడింగ్ చేయకుండా గంటల తరబడి వాహనాలను నిలిపివేయడం లోడింగ్ చార్జీల పేరుతో దోపిడీ చేయడంపై లారీ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సార్.. మీ ఆదేశాలను వీరు లెక్కచేయడం లేదు, దయచేసి మరోసారి కఠినమైన ఆర్డర్లు వేసి క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చూడండి అని కలెక్టరేట్‌కు వినతులు అందుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, రీచ్‌లలో ప్రత్యక్షంగా నిఘా ఉంచి, కలెక్టర్ ఆదేశాలను ధిక్కరిస్తున్న కాంట్రాక్టర్లపై లైసెన్సుల రద్దు వంటి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
ఇసుక రీచ్‌ల్లో కాంట్రాక్టర్ జగ్గారెడ్డి, ఆయన సూపర్ వైజర్ల ఆగడాలు మిన్నంటుతున్నాయి. పేదల కడుపు కొట్టకు జగ్గారెడ్డి.. నీ అక్రమ వసూళ్లకు అడ్డు అదుపు లేదా.?అంటూ లారీ డ్రైవర్లు, యజమానులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ సాగుతున్న ఈ దోపిడీ పర్వం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
సూపర్ వైజర్ల దౌర్జన్యం – కాంట్రాక్టర్ ప్రోత్సాహం.?
రీచ్‌ల్లో పనిచేసే సూపర్ వైజర్లు డ్రైవర్లను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ జగ్గారెడ్డే మాకు డబ్బులు వసూలు చేయమని చెప్పారు, మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం అంటూ సూపర్ వైజర్లు బహిరంగంగానే బెదిరింపులకు దిగుతున్నట్లు డ్రైవర్లు సాక్ష్యాలతో సహా ఆరోపిస్తున్నారు. డీడీలు కట్టిన లారీలను లోడింగ్ చేయకుండా గంటల తరబడి నిలిపివేస్తూ, అడిగినంత ఇస్తేనే పని జరుపుతామని మొండికేస్తున్నారు.
రోడ్డెక్కిన బాధితులు
జగ్గారెడ్డి చేస్తున్న ఈ మోసాలను తట్టుకోలేక, లారీ యజమానులు, డ్రైవర్లు ఇసుక ర్యాంపుల వద్ద నిరసనకు దిగారు. దొడ్డు ఇసుకకు రూ. 1700, సన్న ఇసుకకు రూ. 3700 అదనంగా చెల్లించాల్సి రావడంతో రవాణా రంగం కుదేలవుతోందని వారు ఆవేదన చెందుతున్నారు. పారదర్శకత లేని లోడింగ్ ప్రక్రియ వల్ల సామాన్య డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పేదల కడుపు కొట్టొద్దు. కష్టపడి పని చేసుకునే డ్రైవర్ల దగ్గర, అప్పులు చేసి లారీలు నడిపే యజమానుల దగ్గర ఇలా అక్రమంగా వసూలు చేయడం ధర్మమేనా ? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. జగ్గారెడ్డి తన అనుచరుల ద్వారా సాగిస్తున్న ఈ మాఫియా తరహా వసూళ్లపై జిల్లా కలెక్టర్ తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ, ప్రజలను ఇబ్బంది పెడుతున్న జగ్గారెడ్డి కాంట్రాక్టును రద్దు చేయాలని, అక్రమాలకు పాల్పడుతున్న సూపర్ వైజర్లను అరెస్ట్ చేయాలని లారీ అసోసియేషన్ ప్రతినిధులు కోరుతున్నారు. లేనిపక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.








