Mahaa Daily Exclusive

  యుద్ధ సంక్షోభంలో ఇరాన్ కనకవర్షం: అమెరికా ఆంక్షలు బేఖాతర్.. హార్ముజ్ జలసంధిలో టోల్ వసూళ్ల పర్వం!

Share

* యుద్ధ సంక్షోభంలో ఇరాన్ కనకవర్షం.
* అమెరికా పంతం నేలపాలు.
* హార్ముజ్ జలసంధి.. ఇప్పుడు ఇరాన్ స్వర్ణగని.
* భద్రత పేరిట ఒక్కో నౌకకు 16 కోట్ల టోల్!
* యుద్ధభూమిలో ఇరాన్ ఆర్థిక సామ్రాజ్యం.
* ఆంక్షల ఎత్తివేత, దౌత్య విజయాలతో అనూహ్య లాభాలు
* నష్టాల యుద్ధంలో ఇరాన్ ఊహించని లాభాలు.
* అగ్రరాజ్యాన్నే వణికించిన భౌగోళిక వ్యూహం!

హైదరాబాద్, మహా.

యుద్ధం అనగానే ప్రాణనష్టం, విధ్వంసం, ఆర్థిక పతనం కళ్లముందు కదలాడుతాయి. కానీ, పశ్చిమాసియాలో ప్రస్తుతం రగులుతున్న అమెరికా-ఇరాన్ యుద్ధం మాత్రం ఒక దేశానికి అనూహ్యంగా సిరులు కురిపిస్తోంది. అదే ‘ఇరాన్’. దశాబ్దాలుగా కఠినమైన ఆర్థిక ఆంక్షలతో అల్లాడిపోయిన ఆ దేశం.. తాజా పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకుని ఆర్థికంగా, దౌత్యపరంగా ఎన్నడూ లేనంత బలపడుతోంది. శత్రువుల దాడిని తిప్పికొట్టడమే కాకుండా, అంతర్జాతీయ చమురు సంక్షోభాన్ని ఒక సువర్ణ అవకాశంగా మార్చుకున్న ఇరాన్ ఎత్తుగడలు ఇప్పుడు ప్రపంచ దేశాలను, ఆర్థిక నిపుణులను విస్మయానికి గురిచేస్తున్నాయి.

**అమెరికా ఆంక్షలు పటాపంచలు..హార్ముజ్ జలసంధిలో కాసుల వర్షం**

అమెరికాకు తప్పని తలవంపులు.. ఆంక్షల ఎత్తివేత
1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత నుంచి ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని అమెరికా కంకణం కట్టుకుంది. ముఖ్యంగా ఇరాన్ ప్రధాన ఆదాయ వనరైన ముడి చమురు ఎగుమతులపై గత నాలుగు దశాబ్దాలుగా అత్యంత కఠినమైన ఆంక్షలు అమలు చేస్తూ వచ్చింది. అయితే, ఫిబ్రవరి చివర్లో అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరిట ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన తర్వాత గ్లోబల్ మార్కెట్‌లో చమురు సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ముడి చమురు ధరలు 50 శాతానికి పైగా పెరిగి ఏకంగా బ్యారెల్ 100 డాలర్లకు చేరుకుంది. స్వయంగా అమెరికాలోనే గ్యాస్, ఇంధన ధరలు పెరిగిపోయి ప్రజల నుంచి ట్రంప్ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే పరిస్థితి వచ్చింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రపంచ చమురు డిమాండ్‌ను బ్యాలెన్స్ చేయడానికి అమెరికా తన పంతాన్ని వీడక తప్పలేదు. ధరలను అదుపు చేయడానికి అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ సముద్రంలో నిలిచిపోయిన సుమారు 140 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ చమురుపై 30 రోజుల పాటు ఆంక్షలు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీయాలని భావించిన అమెరికా, తమ సొంత అవసరాల కోసమే ఆంక్షలు సడలించడం ఇరాన్‌ సాధించిన అతిపెద్ద విజయం. దశాబ్దాలుగా దాచిపెట్టుకున్న చమురు నిల్వలను ఇప్పుడు ఇరాన్ భారీ ధరలకు అమ్ముకుంటూ తన ఆర్థిక వ్యవస్థకు ప్రాణం పోసుకుంటోంది.

**ఇరాన్ సరికొత్త “స్వర్ణ గని”గా హార్ముజ్ జలసంధి**

ఇరాన్ సాధించిన మరో అతిపెద్ద భౌగోళిక, వ్యూహాత్మక విజయం హార్ముజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్‌ను, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌ను కలిపే ఈ సముద్ర మార్గం ప్రపంచ వాణిజ్యానికి జీవనాడి లాంటిది. గ్లోబల్ ఆయిల్ ట్రేడ్‌లో దాదాపు 20 శాతానికి పైగా ఈ మార్గం గుండానే వెళ్లాలి. ఇన్నాళ్లూ ఈ మార్గంలో వెళ్లే అంతర్జాతీయ నౌకలకు ఎలాంటి టోల్ ఫీజులు లేదా పన్నులు ఉండేవి కావు. కానీ, ఇప్పుడు యుద్ధ వాతావరణాన్ని ఇరాన్ తనకు అనుకూలంగా మార్చుకుంది. హార్ముజ్ జలసంధిపై పూర్తి సైనిక నియంత్రణ సాధించిన ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దళాలు.. ఇప్పుడు ఆ మార్గాన్ని ఒక టోల్ ప్లాజాగా మార్చేశాయి. అమెరికా-ఇజ్రాయెల్ మిత్రదేశాల నౌకలను అడ్డుకుంటూనే, మిగతా దేశాల నౌకలకు సేఫ్ కారిడార్ ఏర్పాటు చేశాయి. యుద్ధ వాతావరణంలో నౌకలకు రక్షణ కల్పిస్తున్నందుకు గాను, ఆయిల్ ట్యాంకర్ కంపెనీల నుంచి ఒక్కో నౌకకు రవాణా మరియు భద్రత పేరుతో ఏకంగా 2 మిలియన్ డాలర్లు (సుమారు 16.6 కోట్ల రూపాయలు) వసూలు చేస్తున్నాయి. రోజూ డజన్ల కొద్దీ నౌకలు ఈ మార్గం గుండా వెళ్తుంటాయి కాబట్టి ఇరాన్ ఖజానాకు ప్రతిరోజూ వందల కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చి పడుతోంది. పైగా ఈ జలసంధిని అధికారికంగా టోల్ గేట్‌గా మార్చేందుకు, ఈ మార్గాన్ని ఉపయోగించే ప్రతి దేశం తమకు భద్రతా పన్ను చెల్లించేలా చట్టబద్ధం చేయడానికి ఇరాన్ పార్లమెంట్ ఒక కొత్త బిల్లును కూడా సిద్ధం చేస్తోంది.

**ప్రపంచ దేశాల అసహాయత.. ఇరాన్ వ్యూహాత్మక దౌత్యం**

ఈ సంక్షోభంలో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఆయిల్ కంపెనీలు ఈ భారీ మొత్తాన్ని ఇరాన్‌కు చెల్లించడానికి సిద్ధపడటం. సముద్రంలో నౌకలపై దాడులు జరిగితే వందల కోట్ల ఆస్తి నష్టంతో పాటు, పర్యావరణ ముప్పు కూడా ఉంటుంది. ఆ రిస్క్ తీసుకునే కంటే ఇరాన్ అడిగిన ప్రొటెక్షన్ మనీ చెల్లించడమే సురక్షితమని చైనా, జపాన్, భారత్ తదితర దేశాలకు ఆయిల్ సప్లై చేసే కార్పొరేట్ దిగ్గజాలు భావిస్తున్నాయి. మరోవైపు, జపాన్, చైనా, ఇండియా లాంటి దేశాలు చమురు కోసం ప్రధానంగా గల్ఫ్ దేశాలపై ఆధారపడతాయి. హార్ముజ్ జలసంధిలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో, ఈ దేశాలు తమ నౌకల సురక్షిత ప్రయాణం కోసం నేరుగా ఇరాన్ దౌత్యవేత్తలతో చర్చలు జరుపుతున్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్వయంగా జపాన్ లాంటి ఆసియా దేశాలకు సురక్షిత మార్గాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. అమెరికా మిత్రదేశాల నౌకలను మాత్రమే టార్గెట్ చేస్తున్న ఇరాన్.. ఆసియా దేశాలకు మాత్రం సాఫీగా చమురు వెళ్లేలా చూడటం ద్వారా ఆసియాలో బలమైన దేశాల మద్దతును పరోక్షంగా కూడగట్టుకుంటోంది. ఇది అంతర్జాతీయ వేదికపై ఇరాన్ ప్రాబల్యాన్ని అమాంతం పెంచుతోంది.
ఆర్థిక ఆంక్షలతో ఒక దేశాన్ని అణచివేయాలని చూస్తే, కాలక్రమంలో ఆ దేశం ఎంతలా ఎదురుతిరుగుతుందో చెప్పడానికి ఇరాన్ ఒక ప్రత్యక్ష ఉదాహరణ. అమెరికా తన చమురు సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఇరాన్‌కు ఆయిల్ అమ్ముకునే స్వేచ్ఛను ఇవ్వక తప్పలేదు. అదే సమయంలో భౌగోళిక అనుకూలతను వాడుకుని ఇరాన్ అంతర్జాతీయ వాణిజ్యంపై పన్నులు వసూలు చేసే స్థాయికి ఎదిగింది. మొత్తానికి ఈ యుద్ధం ఇరాన్ పాలిట నష్టాల కన్నా, దశాబ్దాల చీకట్లను పారద్రోలే ఒక ఆర్థిక వెలుగుగా మారిందని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Latest