Mahaa Daily Exclusive

  కాంగ్రెస్ తీరుపై జీవన్ రెడ్డి తిరుగుబాటు: మంత్రుల బుజ్జగింపులు విఫలం.. 25న పార్టీకి రాజీనామా!

Share

  • జీవన్ రెడ్డి నివాసంలో ‘బ్రేక్ ఫాస్ట్’ రాజకీయం
  • ఫలించని మంత్రుల బుజ్జగింపులు
  • దేవుడు శాసిస్తే..జీవుడు అనుసరిస్తాడు అని జీవన్ రెడ్డి వ్యాఖ్య
  • 25 న పార్టీకి రాజీనామా
  • భవిష్యత్తుపై త్వరలో అనుచరులతో సమావేశం

జగిత్యాల, మహా : దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్రను పోషించిన సీనియర్ నేత జీవన్ రెడ్డిని దారికి తెచ్చుకునేందుకు అధికార పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. పార్టీ ఫిరాయింపులు, వలస నేతల ప్రాధాన్యతపై రగిలిపోతున్న జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు మంత్రుల బృందం రంగంలోకి దిగింది. శనివారం ఉదయం జీవన్ రెడ్డి నివాసంలో కీలక భేటీ జరిగింది. పార్టీ వీడొద్దంటూ ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ పిలుపును తిరస్కరించిన జీవన్ రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తదితరులు జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. మీడియాను లోపలికి అనుమతించకుండా, అల్పాహారం చేస్తూ సుమారు గంటన్నర పాటు జీవన్ రెడ్డితో వీరు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తదితర అంశాలతో పాటు ప్రభుత్వానికి మద్ధతుగా ఉండేందుకు పిరాయింపులను ఎందుకు ప్రోత్సహించాల్సి వచ్చిందన్న అంశంపై శ్రీదర్ బాబు టీం జీవన్ రెడ్డికి వివరణ ఇచ్చింది.

“నేటి కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా లేదు” అని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మంత్రుల ముందే తన ఆవేదనను వెళ్లగక్కారు. సొంత పార్టీ నేతలకు అన్యాయం చేస్తూ, ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి పెద్దపీట వేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. మంత్రుల వాదనతో ఏ మాత్రం ఏకీభవించని జీవన్ రెడ్డి తన పయనమేంటన్నది కుండబద్దలు కొట్టారు. మంత్రులు ఎంత బతిమాలినా జీవన్ రెడ్డి మెత్తబడినట్లు కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీని వీడాలన్న తన నిర్ణయంలో ఏ మాత్రం మార్పులేదని జీవన్ రెడ్డి తేల్చి చెప్పడంతో చేసేదేమీ లేని మంత్రులు వెనుతిరగాల్సి వచ్చింది.

25 న రాజీనామా

ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వంతో పాటు తన పదవులకు కూడా జీవన్ రెడ్డి రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు తన అనుయాయులు, అభిమానులకు జీవన్ రెడ్డి సంకేతాలు పంపించారు. గతంలోనే జీవన్ రెడ్డి ఉగాది తర్వాత తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు. ఈ నేపఖ్యంలో జీవన్ రెడ్డి బయనమెటు అనే అంశంపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చ మొదలైంది. బీఆర్ఎస్ వైపు వెళ్తారా? బీజేపీలో చేరుతారా, లేక స్వతంత్రంగా ఉంటారా? అనేది జగిత్యాల ప్రజలు, ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Latest