- బీజేపీ బిగ్ ప్లాన్
- జీహెచ్ఎంసీ టార్గెట్ గా వ్యూహం
- కీలక నేతల పర్యటనకు ప్రయత్నం
- ఏప్రిల్ రెండో వారంలో రాష్ట్రానికి రానున్న ప్రధాని మోదీ
- బీబీనగర్ ఎయిమ్స్ ప్రారంభం
- పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగసభ
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే సన్నద్దమవుతోంది. ఎంపీ ఎన్నికల తర్వాత పార్టీ పరిస్థితి రోజురోజకూ ప్రశ్నార్థకంగా మారడంతో గ్రేర్ ఎన్నికల్లో సత్తా చూపి కార్యకర్తల్లో నెలకొన్న నిస్తేజాన్ని పటాపంచలు చేయాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఓఆర్ఆర్ పరిధిలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను విలీనం చేసిన రాష్ట్ర ప్రభుత్వం మూడు ముక్కలుగా విభజించి మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఈ మూడింటిలో కనీసం రెండు మేయర్ పదవులను దక్కించుకోవడంతో పాటు మరో కార్పొరేషన్ లో బలమైన శక్తిగా ఎదిగాలని తద్వారా రాబోయే ఎన్నికల్లో అదికార కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ప్రజల్లోకి బలమైన సంకేతాలను తీసుకు వెళ్ళాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి నుంచి పార్టీ శ్రేణులను గ్రేటర్ ఎన్నికలకు కార్యోన్ముఖులను చేసేందుకు నేతలు నిర్ణయించారు.
తమిళనాడు ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారానికి రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను తెలంగాణకు రప్పించి కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనలతో పాటు ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ రెండవ వారంలో తెలంగాణలో పర్యటించే విధంగా పీఎంఓ అధికారులతో సంప్రదింపులను ప్రారంభించారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో భారీ సభను నిర్వహించడానికి కూడా ప్రణాళికలను రచిస్తోంది. ప్రధాని పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ బిజెపి నేతలతో ప్రత్యేక భేటీ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పార్టీ బలం, ప్రజాభిప్రాయం ఏవిధంగా ఉంది.. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం వంటి అంశాల పైన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీసే అవకాశం ఉంది. రాష్ట్రంలో పార్టీ నిర్మాణంతో పాటు పంచాయతీ ఎన్నికలు, మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఓట్లు, తదితర అంశాలన్నింటిపై ఈ సమావేశంలో చర్చించి పీఎంఓకు ఒక నివేదికను ఇవ్వాలని రాష్ట్కర పార్టీ నిర్ణయించింది.
ప్రధాని రాష్ట్ర పర్యటన సందర్భంగా బీబీనగర్ ఎయిమ్స్ ప్రారంభోత్సవం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేలా ఏర్పాట్లు చేయనున్న నేపథ్యంలో పార్టీ పాత్ర, అధికారులతో సమన్వయం తదితర అంశాలపై కిషన్ రెడ్డి ఏర్పాటు చేసే సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. మున్సిపల్ ఎన్నికల కోసం పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న సభతో పార్టీకి దిశా నిర్దేశం చేయాలని, వారిని రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్లేలా చూడాలని బిజెపి యోచిస్తోంది. ప్రధాని మోదీ పర్యటన పైన రాష్ట్ర నాయకులు స్థానిక నేతలకు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ప్రధాని మోదీ పర్యటన రాష్ట్ర పార్టీకి ఒక బిగ్ బూస్ట్ అవుతుందన్న అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి గతంతో పోలిస్తే ఇటీవల జరిగిన ఎన్నికలలో బిజెపి ఓటు షేర్ చాలా పెరిగింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలలో బిజెపి గతం కంటే మెరుగుపడింది. 2028 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా వెళ్ళాలని గత కొంత కాలంగా కేంద్ర పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సూచిస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన ద్వారా అసెంబ్లీ ఎన్నికలకు కూడా కొంత ప్లస్ అవుతుందని అంటున్నారు.








