* హైకోర్టు మెట్లెక్కిన “దానం” ఎపిసోడ్.
* స్పీకర్ తీర్పుపై ఏలేటి సంచలన పోరాటం!
* ‘క్లీన్ చిట్’ ను సవాల్ చేస్తూ హైకోర్టులో బీజేపీ పిటిషన్!
* బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ..
* దానంపై అనర్హత వేటుకు మహేశ్వర్ రెడ్డి పట్టు!
* ఎల్లుండి దానం నాగేందర్ కేసులో హైకోర్టులో కీలక విచారణ!
* హైకోర్టు చేతిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే భవితవ్యం!
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరోసారి అగ్గి రాజేస్తోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారం ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన మలుపు తిరిగింది. ఇటీవలే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దానం నాగేందర్ కు ఊరటనిస్తూ ఆయన పార్టీ మారలేదని తేల్చడంతో ఈ వివాదం ముగిసిందని అంతా భావించారు. కానీ, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేసిన తాజా పిటిషన్ తో ఈ వ్యవహారం తెలంగాణ హైకోర్టు మెట్లు ఎక్కి రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాయిదాల మీద వాయిదాలు పడిన ఈ కేసు, ఎట్టకేలకు హైకోర్టులో ఎల్లుండి (సోమవారం) జరగబోయే విచారణతో తుది అంకానికి చేరుకోబోతోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గుర్తుపై ఖైరతాబాద్ నుంచి ఘన విజయం సాధించిన దానం నాగేందర్, ఆ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనికి తోడు ఏకంగా 2024 లోక్సభ ఎన్నికల్లో ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఒక పార్టీ బీఫామ్ పై అసెంబ్లీకి ఎన్నికైన వ్యక్తి, ఏమాత్రం రాజీనామా చేయకుండా మరో జాతీయ పార్టీ తరఫున పార్లమెంట్ ఎన్నికల్లో నామినేషన్ వేసి పోటీ చేయడం ఫిరాయింపుల చట్టం కిందకే వస్తుందని, తక్షణమే ఆయనపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో డిమాండ్ చేస్తూ వచ్చారు.
ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు డెడ్ లైన్ విధించిన నేపథ్యం అందరికీ తెలిసిందే. సుప్రీం గడువు ముగిసే సమయానికి, దానం నాగేందర్, కడియం శ్రీహరి సహా పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవంటూ మార్చి 11వ తేదీన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వారి అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. దానం ఇంకా సాంకేతికంగా బీఆర్ఎస్ లోనే ఉన్నారని స్పీకర్ తీర్పునివ్వడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. దీనిపై దానం నాగేందర్ హర్షం వ్యక్తం చేస్తూ, తాను సికింద్రాబాద్ నుంచి పోటీ చేయడం తన వ్యక్తిగతమని, ప్రాథమిక హక్కును ఉపయోగించుకుని మాత్రమే బరిలో నిలిచానని తనదైన శైలిలో వాదనలు వినిపించారు.
అయితే, స్పీకర్ నిర్ణయాన్ని ఏమాత్రం అంగీకరించని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దానం నాగేందర్ పార్టీ మారలేదన్న స్పీకర్ నిర్ణయాన్ని తక్షణమే రద్దు (క్వాష్) చేయాలని ఆయన అత్యంత బలమైన వాదనలతో పిటిషన్ దాఖలు చేశారు. అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ ఫిరాయింపులను ప్రోత్సహించేలా స్పీకర్ నిర్ణయం ఉందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. దానం నాగేందర్ సికింద్రాబాద్ లో నామినేషన్ వేసిన పత్రాల కంటే, ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా వచ్చిన ఓట్ల కంటే పెద్ద ఆధారం ఇంకేం కావాలని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ పిటిషన్ లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన డిమాండ్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వణుకు పుట్టిస్తున్నాయి. నామినేషన్ పత్రాల ఆధారంగా దానం నాగేందర్ పై తక్షణమే అనర్హత వేటు వేయాలని కోరడమే కాకుండా, పార్టీ మారిన నాటి నుంచి నేటి వరకు ఆయన ఎమ్మెల్యే హోదాలో పొందిన జీతభత్యాలను సైతం వెనక్కి రికవరీ చేయాలని ఆయన న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ఉల్లంఘనకు ఇంతకంటే స్పష్టమైన ఉదాహరణ మరొకటి ఉండదని బీజేపీ పట్టుబడుతోంది.
దీనిపై తెలంగాణ హైకోర్టు ఎల్లుండి విచారణ చేపట్టనుంది. ఈ కేసులో న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు అత్యంత కీలకం కాబోతోంది. దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవి నిలబడుతుందా? లేక స్పీకర్ తీర్పును తోసిపుచ్చుతూ హైకోర్టు సంచలన తీర్పు ఇస్తుందా? అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ హైకోర్టు దానంకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే మాత్రం మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేలందరికీ అది ఒక హెచ్చరికగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.








