మందమర్రి, మహా : సాయంత్రం వేళల్లో సేద తీసుకునేలా కుర్మపల్లి, క్యాతనపల్లి చెరువు సుందరీకరణ పనులు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేకానంద అన్నారు. ఆదివారం క్యాతనపల్లి మున్సిపాలిటీ 10 వ వార్డులో 2.09 కోట్ల రూపాయల వ్యయంతో కుర్మపల్లి/క్యాతనపల్లి చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్యాతనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా మరో ముఖ్యమైన అడుగు పడిందని చెప్పారు. చెరువును అందంగా తీర్చిదిద్ది ఉదయం సాయంకాలం నడకలు, సాయంత్రం వేళల్లో విశ్రాంతి తీసుకునేలా మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు.
అంతేకాకుండా క్యాతనపల్లి మున్సిపాలిటీలో పలు వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని దాని పట్ల స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార దీపక్, కాంగ్రెస్ పార్టీ నేతలు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.








