* పీసీసీ అధ్యక్షుడి జిల్లా పర్యటనలకు శ్రీకారం.
* గ్రామస్థాయి నుంచి పార్టీ పటిష్టత.. భవిష్యత్ ఎన్నికల దిశగా పీసీసీ వ్యూహం.
* ప్రభుత్వ పథకాలే అస్త్రంగా మహేష్ కుమార్ గౌడ్ జిల్లాల బాట.
* జిల్లాకో సమీక్ష.. సమస్యల పరిష్కారమే అజెండాగా కార్యాచరణ.
హైదరాబాద్, మహా.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసే దిశగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన అడుగు వేశారు. ఇటీవల నూతన డీసీసీ కమిటీలను ప్రకటించి పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపిన ఆయన, ఇప్పుడు నేరుగా జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, పార్టీ నిర్మాణాన్ని పునాదుల స్థాయి నుంచి పటిష్టం చేయడమే లక్ష్యంగా ఆయన ఈ పర్యటనలకు రూపకల్పన చేశారు.
ఈ టూర్‌లో భాగంగా ప్రతి జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన స్వయంగా ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నారు. స్థానిక సమస్యలను కూలంకషంగా తెలుసుకోవడంతో పాటు, ఆయా జిల్లాల్లో పార్టీ తాజా పరిస్థితులపై లోతైన సమీక్షలు చేయనున్నారు. గ్రామస్థాయి కార్యకర్త నుంచి జిల్లా స్థాయి నాయకుడి వరకు అందరినీ సమన్వయం చేసుకుంటూ, భవిష్యత్తు ఎన్నికలకు పార్టీని సర్వసన్నద్ధం చేసేలా వ్యూహరచన చేస్తున్నారు.
మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు నేరుగా, సమగ్రంగా చేరవేసే భారీ బాధ్యతను కూడా ఆయన భుజాన వేసుకున్నారు. ప్రభుత్వ పనితీరును, సాధించిన విజయాలను ప్రజలకు వివరించడం ద్వారా వారిలో కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న విశ్వాసాన్ని రెట్టింపు చేసేలా కార్యాచరణ రూపొందించారు.








