Mahaa Daily Exclusive

  సిద్దిపేటలో ‘మంత్రి’ ఆఫర్…..

Share

సిద్దిపేటలో ‘మంత్రి’ ఆఫర్.
* హరీశ్ రావును ఓడిస్తే కేబినెట్ బెర్త్.
* ఒకే కుటుంబం.. నాలుగు దశాబ్దాల పాలన.
* సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తే మంత్రి పదవి!
* రేవంత్ ‘బంపరాఫర్’తో వేడెక్కిన రాజకీయం.
* రేవంత్ సవాల్‌కు దీటుగా బదులిచ్చిన హరీశ్ రావు.

హైదరాబాద్, మహా.

తెలంగాణ రాజకీయాలు మరోసారి ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రంగా అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. దశాబ్దాలుగా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)కి కంచుకోటగా ఉన్న సిద్దిపేట నియోజకవర్గంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నర్మటలో జరిగిన బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ కాకను రాజేశాయి. కాంగ్రెస్ నాయకుల్లో ఉత్సాహాన్ని నింపేలా, అదే సమయంలో బీఆర్‌ఎస్ అగ్రనేతలను ఆత్మరక్షణలో పడేసేలా సీఎం రేవంత్ ఏకంగా ఒక సంచలన ‘బంపరాఫర్’ ప్రకటించారు. సిద్దిపేటలో హరీశ్ రావును ఓడించి, కాంగ్రెస్ జెండా ఎగురవేసిన నాయకుడికి కేబినెట్‌లో మంత్రి పదవి ఇస్తానని బహిరంగంగా హామీ ఇవ్వడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఈ సవాల్ వెనుక కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. 1984 నుంచి 2029 వరకు అంటే సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా సిద్దిపేట గడ్డను కేవలం ఒకే కుటుంబం పాలిస్తోందని, ఇకనైనా ప్రజలు మార్పును కోరుకోవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఒకే కుటుంబం గుత్తాధిపత్యం వహించడం సరైనది కాదని, అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందాలంటే ప్రత్యామ్నాయ నాయకత్వానికి అవకాశం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన నొక్కిచెప్పారు. వచ్చే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని, సిద్దిపేటలో కూడా తమ సత్తా చాటి తీరుతామనే గట్టి ధీమాను సీఎం వ్యక్తం చేశారు. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, గెలిచిన వారికి ఏకంగా మంత్రి పదవిని ఆఫర్ చేయడం ద్వారా స్థానిక కాంగ్రెస్ శ్రేణుల్లో ఉన్న స్తబ్ధతను తొలగించి, వారిని ఎన్నికల సమరానికి ఇప్పటి నుంచే సమాయత్తం చేసే వ్యూహాన్ని రేవంత్ అమలు చేస్తున్నారు.
సీఎం వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు కూడా అంతే దీటుగా స్పందించారు. తన ఇలాకాలో తనకు విసిరిన సవాల్‌ను ఆయన బలంగా తిప్పికొట్టారు. దశాబ్దాలుగా సిద్దిపేట ప్రజల గుండెల్లో బీఆర్‌ఎస్ సుస్థిర స్థానాన్ని సంపాదించుకుందని, ఆ బంధాన్ని కేవలం రాజకీయ ఆఫర్లతో విడదీయలేరని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ సాధన దగ్గరి నుంచి నేటి వరకు సిద్దిపేటలో తాము చేసిన అభివృద్ధి, తీసుకొచ్చిన మౌలిక సదుపాయాలే తమ విజయాలకు పునాదులని హరీశ్ రావు గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇస్తున్నారని, తమ హయాంలో మంజూరైన వందలాది కోట్ల రూపాయల అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ సవాళ్లు సిద్దిపేట ప్రజల అభివృద్ధి పట్ల కాంగ్రెస్‌కు ఉన్న చిత్తశుద్ధిని కాకుండా, కేవలం రాజకీయ ఆధిపత్యం కోసమే ఆరాటపడుతున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని హరీశ్ కౌంటర్ ఇచ్చారు.
ఈ పరిణామాలతో ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఒకవైపు బీఆర్‌ఎస్ కంచుకోటను ఎలాగైనా బద్దలు కొట్టాలని సీఎం స్థాయి వ్యక్తి నేరుగా రంగంలోకి దిగడం, మరోవైపు దశాబ్దాల తన ప్రాబల్యాన్ని కాపాడుకోవడంతో పాటు పార్టీ ఉనికిని చాటేందుకు హరీశ్ రావు శ్రమిస్తుండటంతో 2029 ఎన్నికల సమరం అత్యంత రసవత్తరంగా మారనుంది. ఇరు పార్టీలకు ఇది కేవలం ఒక నియోజకవర్గపు గెలుపోటముల వ్యవహారం కాదు.. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆధిపత్య పోరు. రాబోయే కాలంలో సిద్దిపేట రాజకీయ ముఖచిత్రం మరిన్ని వ్యూహ ప్రతివ్యూహాలకు, సవాళ్లకు వేదిక కానుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Latest