Mahaa Daily Exclusive

  ప్రభుత్వ పరం కానున్న హైదరాబాద్‌ మెట్రో!

Share

  •  ఈ నెలాఖరుకల్లా రూ.15 వేల కోట్లతో ఎల్అండ్‌టీ నుంచి బదలాయింపు.
  • శంషాబాద్‌ విమానాశ్రయం అనుసంధానంతో మరో 75 కి.మీ మేర విస్తరణ.
  • శాసనమండలిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన.

హైదరాబాద్, మహా.

హైదరాబాద్‌ మహానగర ప్రజా రవాణా వ్యవస్థలో కీలక మార్పు చోటుచేసుకోనుంది. ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకోనుంది. మెట్రో నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు ఎల్‌అండ్‌టీ సంస్థ నిర్ణయించుకున్న నేపథ్యంలో.. ఈ నెలాఖరు (మార్చి) నాటికి సుమారు రూ.15 వేల కోట్లతో ప్రాజెక్టును స్వాధీనం చేసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తేటతెల్లం చేశారు. శాసనమండలి వేదికగా నగర అభివృద్ధిపై జరిగిన చర్చలో ఆయన ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. మెట్రోను ప్రభుత్వ పరం చేసుకున్న వెంటనే శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అనుసంధానంతో పాటు నగరవ్యాప్తంగా మరో 75 కిలోమీటర్ల మేర కొత్త మార్గాలను విస్తరించనున్నట్లు ఆయన విశదపరిచారు.
గత పదేళ్ల పాలకుల నిర్లక్ష్య వైఖరి వల్లే హైదరాబాద్‌ మెట్రో దేశంలోనే 12వ స్థానానికి పడిపోయిందని ముఖ్యమంత్రి సభలో దుయ్యబట్టారు. దివంగత కేంద్ర మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి చేసిన విశేష కృషితోనే నగరానికి ఈ ప్రాజెక్టు సాకారమైందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్ర అభివృద్ధిని కేవలం ప్రస్తుత నగరానికే పరిమితం చేయబోమన్న రేవంత్‌రెడ్డి.. భవిష్యత్తు జనాభా, అవసరాలకు అనుగుణంగా ఏకంగా 33 వేల ఎకరాల విశాల విస్తీర్ణంలో ఒక అధునాతనమైన కొత్త నగరాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సభ దృష్టికి తీసుకొచ్చారు. తమది కేవలం ‘గుడ్‌ గవర్నెన్స్‌’ కాదని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే ‘స్మార్ట్‌ గవర్నెన్స్‌’ అని ఆయన ఉద్ఘాటించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాజకీయాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.
ట్రాఫిక్‌ రద్దీకి శాశ్వత చెక్‌ పెట్టి హైదరాబాద్‌ను ‘సిగ్నల్‌ ఫ్రీ సిటీ’గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రహదారులను మూడు రకాలుగా వర్గీకరించి, ఎక్కడెక్కడ అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్‌ కారిడార్లు అవసరమో పక్కాగా ప్రణాళికలు రూపొందించామన్నారు. నగర శివార్లను కలుపుతూ నాలుగు ప్రధాన ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణాలను జూన్‌, జులై నాటికి ప్రారంభించేలా అడుగులు వేస్తున్నట్లు వివరించారు. వాహనదారుల సౌకర్యార్థం కేబీఆర్‌ పార్కు సమీపంలో ఇప్పటికే మల్టీ లెవల్‌ పార్కింగ్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేశామన్నారు. మరోవైపు పాదచారులకు ఆటంకం కలిగించేలా ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. చిరు వ్యాపారులకు కొంత అసౌకర్యం కలిగినా ఆక్రమణల తొలగింపులో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. అయితే, వారి జీవనోపాధి దెబ్బతినకుండా ఉండేందుకు నగరంలో ప్రత్యేకంగా వెండింగ్‌ జోన్లను ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయం చూపుతామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.

Latest