- మల్లన్న నోట సీఎం మాట
- మనసులో మాటను భయటపెట్టిన ఎమ్మెల్యే
- రేవంత్ నేను అన్నదమ్ములం
- ఆయనను సీఎం చేసింది నేనే
- రెడ్డి కులంలో ధైర్యమున్న నేత రేవంత్ రెడ్డి
- విలన్ క్యారెక్టర్ అవకాశం వస్తే వద్దన్నా
- అనుకుంటే నేనే సినిమా తీయగలను
- మీడియాతో చిట్ చాట్ లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి
హైదరాబాద్, మహా : ోషల్ మీడియాలో రారాజుగా వెలుగొందుతున్న మాజీ మంత్రి, మేడ్చల్ మల్లారెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియా చిట్ చాట్ లో పల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాలపై తనకున్న ఆసక్తి, సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న బంధంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తనను ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో విలన్ పాత్ర కోసం అడిగారని వెల్లడించారు. ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఆ సినిమాలో విలన్‌గా చేయమని డైరెక్టర్ కోరినట్లు తెలిపారు. అయితే తాను ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించానని చెప్పకొచ్చారు. తనకు వెండితెరపై ఒక్కసారైనా సీఎం పాత్ర పోషించాలనే కోరిక ఉందని అన్నారు. అలాంటి అవకాశం వస్తే తప్పకుండా సినిమాలో సీఎంగా నటిస్తానని తన మనసులోని మాటను బయటపెట్టారు. కాగా, రెండ్రోజుల క్రితం కూడా సినిమాల్లో నటించే విషయంపై మల్లారెడ్డి కీలక కామెంట్స్ చేశారు. తానే ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ స్టార్ అని అన్నారు. తనకు ఒకరు ఆఫర్ ఇచ్చేది ఉండదని.. అవసరమైతే తానే సినిమా చేస్తానని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకున్న సంబంధంపైనా కీలక కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది పరోక్షంగా తాననేని అన్నారు. రెడ్డి సామాజిక వర్గంలో రేవంత్ కన్నా దమ్మున్న నాయకుడు మరొకరు లేరని, ఈ విషయాన్ని రెడ్డి సంఘం మీటింగ్‌లోనే చెప్పానని అన్నారు. అవసరమైతే అందుకు సంబంధించిన వీడియో కూడా చూపిస్తానని మల్లారెడ్డి వెల్లడించారు. ఎవరు ఏమన్నా తామిద్దరం అన్నదమ్ములమన్నారు. మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
కాగా, గతంలో మల్లారెడ్డి, రేవంత్ రెడ్డి ఒకే పార్టీలో పని చేశారు. 2014 సమయంలో మల్లారెడ్డి మల్కాజిగిరి ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన సైకిల్ దిగి కారెక్కారు. ఇక రేవంత్ రెడ్డి ఆ సమయంలో కొడంగల్ టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ తర్వాత ఆయన కూడా పలు రాజకీయ కారణాల వల్ల టీడీపీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికై తనదైన రాజకీయ చతురతతో తెలంగాణకు రెండో సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఇదిలా ఉండగా.. గత కొన్నిరోజులుగా మల్లారెడ్డి కారు పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాంటి సమయంలో రేవంత్, తాను అన్నదమ్ములం అంటూ మల్లారెడ్డి చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.








