Mahaa Daily Exclusive

  మొయినాబాద్ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్, కాల్పుల కేసు: మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి పోలీసు కస్టడీ!

Share

* మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్, నమిత్‌లకు పోలీసు కస్టడీ.
* డ్రగ్స్, కాల్పుల వ్యవహారంపై లోతైన విచారణకు అనుమతిస్తూ రాజేంద్రనగర్ కోర్టు కీలక ఉత్తర్వులు.
* కస్టడీ విచారణలో వెలుగుచూడనున్న సంచలన విషయాలు.

హైదరాబాద్, మహా.
రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్, కాల్పుల వ్యవహారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఇతర నిందితులు రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను పోలీసు కస్టడీకి అప్పగిస్తూ రాజేంద్రనగర్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితుల పాత్ర, డ్రగ్స్ మూలాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉన్నందున వారిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పోలీసుల వాదనలతో ఏకీభవిస్తూ ముగ్గురు నిందితులను విచారించేందుకు అనుమతి మంజూరు చేసింది. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో జైలులో రిమాండ్‌లో ఉన్న వీరిని పోలీసులు తమ అదుపులోకి తీసుకోనున్నారు.
ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీకి డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అయ్యాయి, ఈ వ్యవహారంలో ఇంకెవరి పాత్ర ఉంది, అసలు కాల్పులకు దారితీసిన పరిస్థితులు ఏమిటి అనే కోణాల్లో పోలీసులు ఇప్పుడు ముమ్మరంగా విచారించనున్నారు. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం ద్వారా ఈ డ్రగ్స్ రాకెట్ వెనుక ఉన్న అసలు నిజాలు, ఇతర వ్యక్తుల గుట్టు రట్టయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పోలీసుల కస్టడీ విచారణలో నిందితులు వెల్లడించే వివరాల ఆధారంగా ఈ కేసు దర్యాప్తు మరింత వేగవంతం కానుంది. ఈ విచారణలో ఇంకెన్ని సంచలన విషయాలు బయటపడతాయోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

Latest