ఎర్ర బంగారం భగభగ..
* క్వింటాల్ మిర్చి రూ.39 వేలు!
* కళకళలాడుతున్న వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్.
* వరుస సెలవుల తర్వాత భారీగా పంటను విక్రయానికి తీసుకొచ్చిన రైతులు.
* వండర్ హాట్, తేజ రకాలకు అత్యధిక డిమాండ్.
* టమాటా మిర్చికి రికార్డు స్థాయి ధర.. ఆనందంలో అన్నదాతలు.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఒకటైన వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. రైతన్న పండించిన ఎర్రబంగానికి మునుపెన్నడూ లేని విధంగా మంచి ధరలు పలుకుతున్నాయి. వరుస సెలవుల తర్వాత మార్కెట్ తిరిగి తెరుచుకోవడంతో రైతులు భారీగా మిర్చి పంటను విక్రయానికి తీసుకువచ్చారు. దీంతో మార్కెట్ ప్రాంగణమంతా ఎర్ర బంగారంతో నిండిపోయి కళకళలాడుతోంది. ప్రధాన రకాలైన తేజ, సింగిల్ పట్టీ, వండర్ హాట్ రకాలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ నెలకొంది. వ్యాపారులు పోటాపోటీగా కొనుగోలు చేస్తుండటంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వివిధ రకాల మిర్చికి మార్కెట్‌లో రికార్డు స్థాయి ధరలు నమోదయ్యాయి. అత్యధికంగా టమాటా రకం మిర్చి క్వింటాల్‌కు ఏకంగా రూ.39 వేలు పలికి రికార్డు సృష్టించింది. అలాగే వండర్ హాట్ రకం మిర్చి సైతం ఘాటైన ధరను నమోదు చేస్తూ క్వింటాల్‌కు రూ.35 వేలు పలకగా, ఎల్లో రకం మిర్చికి రూ.26 వేల ధర దక్కింది. వీటితో పాటు 341 మిర్చి రకానికి రూ.20 వేల 500, తేజ రకం మిర్చికి రూ.19 వేల 500 చొప్పున వ్యాపారులు చెల్లించి కొనుగోలు చేశారు. ఆశించిన దానికంటే మెరుగైన ధరలు దక్కుతుండటంతో కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని మిర్చి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.








