Mahaa Daily Exclusive

  ‘సార్.. మీ కాళ్లు మొక్కుతా, పాస్ చేయండి’: ఇంటర్ విద్యార్థి జవాబు పత్రం వైరల్!

Share

‘కాళ్లు మొక్కుతా.. పాస్‌ చేయండి సార్‌!’
* జవాబు పత్రంలో ఇంటర్ విద్యార్థి భావోద్వేగ లేఖ.
* తాను చదివినవి పరీక్షలో రాలేదని, బార్డర్ పాస్ వేసినా చాలంటూ వేడుకోలు.
* ఏకంగా ఎగ్జామినర్ కాళ్లు మొక్కుతున్నట్లు జవాబు పత్రంలో బొమ్మ గీసిన వైనం.
* నెట్టింట వైరల్‌గా మారిన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట విద్యార్థి ఆన్సర్‌షీట్.

హైదరాబాద్, మహా.

ఇంటర్మీడియట్ పరీక్షల మూల్యాంకన సమయంలో ఎగ్జామినర్లకు జవాబు పత్రాల్లో అప్పుడప్పుడూ వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. కొందరు విద్యార్థులు జవాబులు రాక సినిమా కథలు రాస్తే, మరికొందరు జాలి చూపి పాస్ చేయాలంటూ రకరకాల లేఖలు రాస్తుంటారు. తాజాగా నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పరిధిలోని ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి రాసిన ఇలాంటి ఓ సమాధాన పత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సదరు విద్యార్థి జవాబులు రాయడానికి బదులు.. తనను పాస్ చేయాలంటూ ఏకంగా గురువు కాళ్లు మొక్కుతున్నట్లు ఓ బొమ్మ గీసి, దాని పక్కనే ఓ భావోద్వేగమైన లేఖను రాసుకొచ్చాడు.
“సార్ నన్ను పాస్ చేయండి సార్. నన్ను పాస్ చేస్తే మీరు మేలు చేసిన వారవుతారు. బార్డర్ పాస్ అయినా చేయండి. మీ కాళ్లు మొక్కుతా సార్” అంటూ ఆ విద్యార్థి జవాబు పత్రంలో వేడుకున్నాడు. తాను చదివిన ప్రశ్నలు పరీక్షలో రాలేదని, అందుకే ఇలా రాయాల్సి వస్తోందని పేర్కొన్నాడు. అంతేకాకుండా, ఎగ్జామినర్‌ను ప్రసన్నం చేసుకునేందుకు పేపర్లో “గురువే దైవం, గురువే ధైర్యం, గురువు కష్టపడేవాడికి తోడు ఉంటాడు” అంటూ కొన్ని సూక్తులు కూడా రాశాడు. గురువు నిలబడి ఉండగా.. కింద పడుకుని ఆయన కాళ్లకు నమస్కరిస్తున్నట్లు పెన్‌తో ఒక బొమ్మను సైతం గీశాడు. పేపర్ దిద్దే సమయంలో సదరు ఎగ్జామినర్ ఈ జవాబు పత్రాన్ని ఫొటో తీయగా.. అది కాస్తా ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఆన్సర్ షీట్ చూసిన నెటిజన్లు ఆ విద్యార్థి అమాయకత్వానికి నవ్వుకుంటూనే, పాపం పాస్ చేయొచ్చు కదా సార్ అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

Latest