* తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్.
* ద్రవ్యోల్బణం కోరల్లో విలవిల. పాతాళానికి పడిపోయిన కరెన్సీ విలువ.
* సరుకుల కోసం సంచుల కొద్దీ డబ్బులు మోసుకెళ్తున్న జనం.
* ఇబ్బందులు తప్పించేందుకు ఏకంగా ’10 మిలియన్ రియాల్స్’ (కోటి) నోటును విడుదల చేసిన ప్రభుత్వం.
* ఆ నోటు విలువ మన భారతీయ కరెన్సీలో కేవలం రూ.650 మాత్రమే.
* ఏటీఎంల ముందు నగదు కోసం క్యూ కడుతున్న ప్రజలు.
హైదరాబాద్, మహా.
ఇరాన్ దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్యుడి బతుకు భారంగా మారింది. ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకోవడంతో ఆ దేశ కరెన్సీ (రియాల్) విలువ పాతాళానికి పడిపోయింది. ఈ కరెన్సీ పతనంతో రోజువారీ చిన్న చిన్న వస్తువులు కొనుగోలు చేయాలన్నా ప్రజలు సంచుల కొద్దీ డబ్బులు మోసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఈ కష్టాలను తీర్చడానికి, భారీ లావాదేవీలను సులభతరం చేసేందుకు ఇరాన్ ప్రభుత్వం ఏకంగా 10 మిలియన్ రియాల్స్ (కోటి) విలువ గల కొత్త నోటును మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే, ఆ నోటుపై 10 మిలియన్లు అని ముద్రించి ఉన్నా.. అంతర్జాతీయ మార్కెట్లో దాని విలువ సుమారు 7 డాలర్లు మాత్రమే. అంటే మన భారతీయ కరెన్సీలో చెప్పాలంటే అక్షరాలా 650 రూపాయలకు సమానం. దీన్ని బట్టి ఇరాన్లో కరెన్సీ విలువ ఏ స్థాయిలో పతనమైందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్‌తో ఘర్షణ వాతావరణం.. మరోవైపు అంతర్జాతీయ దేశాల ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైంది. దీనికి తోడు యుద్ధ భయాలు ఆ దేశ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వరుసగా 24 రోజులుగా ఇరాన్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఇంటర్నెట్ లేకపోవడంతో ఏ క్షణమైనా డిజిటల్ పేమెంట్స్ ఆగిపోతాయన్న భయంతో జనం అప్రమత్తమయ్యారు. అత్యవసర సమయాల్లో చేతిలో నగదు ఉంచుకోవడమే అత్యంత సురక్షితమని భావిస్తున్న ప్రజలు.. బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల ముందు భారీగా బారులు తీరుతున్నారు. అంతర్జాతీయ ఆంక్షలు, పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి తట్టుకోలేక ఇరాన్ ఈ దుస్థితికి చేరుకుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏ దేశమైనా ఇంత పెద్ద సంఖ్యలో కరెన్సీ నోటును ముద్రిస్తోందంటే.. అక్కడ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా బలహీనపడి, పతనావస్థకు చేరుకుందనడానికి అది స్పష్టమైన సంకేతమని చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇరాన్ మరింత గడ్డుకాలాన్ని ఎదుర్కోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.








