క్యూనెట్‌పై పోలీసుల పంజా..
* వందల కోట్ల స్కామ్!
* మూడు రాష్ట్రాల్లో ఏకకాలంలో పోలీసుల సోదాలు.
* తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో కొనసాగుతున్న తనిఖీలు.
* మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో వందల కోట్లు వసూలు చేసిన క్యూనెట్.
* హైదరాబాద్‌లో 6 చోట్ల సీసీఎస్ పోలీసుల దాడులు..
* మొత్తం 25 ప్రాంతాల్లో విచారణ. 20 మంది కీలక నిందితుల గుర్తింపు.
హైదరాబాద్, మహా.
మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో అమాయక ప్రజలను బురిడీ కొట్టించి, వందల కోట్ల రూపాయలు వసూలు చేసిన ప్రముఖ సంస్థ ‘క్యూనెట్ (QNet)’ వ్యవహారాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. క్యూనెట్ మోసాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో హైదరాబాద్ సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్) పోలీసులు భారీ ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టారు. సోమవారం తెల్లవారుజాము నుంచే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని క్యూనెట్ కార్యాలయాలు, కీలక బాధ్యుల ఇళ్లపై ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సంస్థపై సీసీఎస్‌లో ఇప్పటికే ఆరు కేసులు నమోదు కాగా, తాజాగా మోసపోయిన బాధితుల ఫిర్యాదులతో మరో రెండు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసు బృందాలు.. మూడు రాష్ట్రాల్లోని మొత్తం 25 ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టాయి. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలోనే ఏకంగా 6 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలైన ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, అలాగే కర్ణాటకలోని బెంగళూరు నగరాల్లోనూ క్యూనెట్ లింకులపై జల్లెడ పడుతున్నారు. ఈ భారీ కుంభకోణానికి సంబంధించి మొత్తం 20 మంది కీలక నిందితులను పోలీసులు ఇప్పటికే గుర్తించినట్లు సమాచారం. ప్రజలను పెట్టుబడుల పేరుతో ఆకర్షించి భారీగా దోచుకున్న వందల కోట్ల రూపాయలను ఎక్కడెక్కడ మళ్లించారనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.








