Mahaa Daily Exclusive

  విద్యుత్ శాఖలో డిప్యుటేషన్ సెగ: ఏపీ అధికారికి తెలంగాణలో పోస్టింగ్.. ఉద్యోగ సంఘాల తీవ్ర ఆగ్రహం!

Share

విద్యుత్‌ శాఖలో డిప్యుటేషన్‌ రగడ!
* ఆంధ్రా టు తెలంగాణ బదిలీపై భగ్గుమంటున్న ఉద్యోగులు.
* ఏపీలోని విజయవాడ జెన్‌కోకు చెందిన డీఈఈకి తెలంగాణ ఎస్పీడీసీఎల్‌లో మూడేళ్ల పాటు పోస్టింగ్.
* గతేడాది డిసెంబర్‌లో లేఖ రాసిన ఎస్పీడీసీఎల్.. తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కారు.
* ఆంధ్రప్రదేశ్ నుంచి అధికారులను తెలంగాణలో నియమించడంపై వెల్లువెత్తుతున్న తీవ్ర విమర్శలు.

హైదరాబాద్, మహా.
తెలంగాణ విద్యుత్‌ శాఖలో ఇప్పుడు ‘డిప్యుటేషన్’ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఒక విద్యుత్ శాఖ అధికారికి తెలంగాణలో డిప్యుటేషన్‌పై పోస్టింగ్ ఇవ్వడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఏపీలోని విజయవాడ జెన్‌కో లో ఎలక్ట్రికల్ డీఈఈగా పనిచేస్తున్న అధికారిని తెలంగాణ పరిధిలోని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ కు మూడేళ్ల పాటు డిప్యుటేషన్‌పై పంపిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ వ్యవహారానికి మూలాలు తెలంగాణలోనే ఉండటం గమనార్హం. సదరు అధికారి సేవలు తమకు అవసరమంటూ గతేడాది డిసెంబర్‌ నెలలోనే ఎస్పీడీసీఎల్ యాజమాన్యం ఏపీకి ఓ లేఖ రాసింది. ఈ లేఖను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. సదరు డీఈఈని మూడేళ్ల పాటు బదిలీ చేస్తూ ఫైలుకు ఆమోదముద్ర వేసింది. అయితే ఈ ఉత్తర్వులు ఇప్పుడు తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల్లో ఆగ్రహావేశాలు రగిలిస్తున్నాయి. తెలంగాణ స్థానికులకే ఇక్కడి ఉద్యోగాలపై హక్కు ఉంటుందని, దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి అధికారులను రప్పించి అత్యంత కీలకమైన పోస్టుల్లో ఎలా నియమిస్తారంటూ వారు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. స్థానిక ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వాల్సిన పోస్టుల్లో బయటి రాష్ట్రాల వారిని కూర్చోబెట్టడం దారుణమని విద్యుత్ సంఘాల నేతలు మండిపడుతున్నారు.

Latest