- రేవంత్ ప్రభుత్వంలో మహిళలకు పరాభవం
- ప్రతి మహిళకు వెంటనే ₹ 2500 చెల్లించాలి
- నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి
- రైతులకు గిట్టుబాటు కల్పించాలి
- భారత్ కూటమి డిమాండ్
హైదరాబాద్, మహా: ప్రతి మహిళకు ఈ ఆర్థిక సంవత్సరమే నెలకు 2500 చెల్లించాలని , నిరుద్యోగులకు వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని భారత్ కూటమి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసింది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే నిర్ణయం తీసుకుని, ఇందుకు అనుగుణంగా 2026-27 వార్షిక బడ్జెట్ ను సవరించాలని కూటమి ప్రభుత్వానికి సూచించింది. నెల నెలా మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి అధికాపరంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మూడేళ్లు అవుతున్నా చిళ్లు గవ్వ కూడా మహిళలకు ఇవ్వలేదని, బడ్జెట్లో సవరణ చేసి ఈ పథకాన్ని అమలు చేయాలని కోరుతూ భారత్ కూటమి సోమవారం హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. దీనిని పోలీసులు అడ్డుకోవడంతో ఇందిరా పార్క్ వద్ద కూటమి నిరసన చేపట్టింది.
ఇది మహిళలకు పరాభవం: చైర్మన్ కాసాని శ్రీనివాసరావు గౌడ
సీఎం రేవంత్ మహిళలను ఆకర్షించడానికి మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయడం లేదని, ఇప్పటికే మూడో సంవత్సరం అవుతున్నా ఇంకా 2500 రూపాయల పథకం ప్రారంభించలేదని, మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెబుతున్నా ఒక్క మహిళను కోటీశ్వరాలు చేసిన దాఖలాలు లేవని, ఈ సంవత్సరంలోనూ వారికి పరాభవమే జరిగిందని భారత్ కూటమి ఛైర్మన్ జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ పేర్కొన్నారు.
భారత్ కూటమి అభిప్రాయం ప్రకారం మహిళల ఆర్థిక సాధికారతే ఒక బలమైన అభివృద్ధి చెందిన సమాజానికి పునాదని, ప్రతి నెలా ₹2500 అందించడం ద్వారా మహిళల దైనందిన అవసరాలను తీర్చడంలో సహాయపడటమే కాకుండా అది వారి ఆర్థిక స్వావలంబనను బలపరుస్తుందని,
కాబట్టి తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఈ పథకం అమలుకు చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలకు భారత్ కూటమి ప్రజలను సిద్ధం చేస్తుందని కూటమి వైస్ చైర్మన్ వర్కర్స్ పార్టీ అధ్యక్షుడు రాయబండి పాండురంగం ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
మహాలక్ష్మి పథకం అమలు చేసే తేదీని వెంటనే ప్రకటించాలని, అర్హులైన మహిళల ఖాతాల్లోకి ప్రతి నెలా ₹2500 నేరుగా జమ చేయాలని, అర్హులైన ప్రతి మహిళకు ఎటువంటి ఆలస్యం చేయకుండా ఈ ప్రయోజనం అందేలా పారదర్శకమైన, సులభమైన విధానాన్ని రూపొందించాలని, అదే విధంగా దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని కూటమి మరో వైస్ చైర్మన్ తెలంగాణ రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు యాదీశ్వర్ నక్కా కోరారు.
తెలంగాణ మహిళలు ఎలాంటి ప్రత్యేకమైన ఉపకారం కోరడం లేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రజాస్వామ్య హామీని కాంగ్రెస్ నిలబెట్టాలని మాత్రమే ఆశిస్తున్నారని, కూటమి కన్వీనర్ ఇంక్విలాబ్ పార్టీ అధ్యక్షుడు జానీ ఒమర్ అన్నారు. మరో కన్వీనర్ పద్మశాలి రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు అశోక్ పోషం మాట్లాడుతూ బడ్జెట్ అంతా అంకెల గారడీని, బీసీలకు బడ్జెట్ పెంచాలని అన్నారు. పీపుల్స్ ప్రొటెక్షన్ పార్టీ అధ్యక్షుడు సదానంద రెడ్డి మాట్లాడుతూ కుల రహిత సమాజ నిర్మాణం కోసం ఉపయోగపడే విధంగా బడ్జెట్ లో కేటాయింపులు ఉండాలని, ఆర్థిక రిజర్వేషన్ కల్పించాలని కోరారు.
తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి అధ్యక్షుడు గోపి మాట్లాడుతూ రజకులను ఎస్సీల్లో చేర్చాలని, పేదలు లేని సమాజం కోసం కృషి చేయాలని కోరారు. జై స్వరాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు ఇంజ గణేష్, సుగూరు శ్రీనివాస్, శ్రీరాం, వర్కర్స్ పార్టీ నాయకులు మల్లాచారి, శ్రీకాంత్, ఇంక్విలాబ్ సేన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి విజయ్ బాబు, ఇండియన్ ప్రజా కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధశరథ్ తదితరులు మాట్లాడారు. రాజేష్ ముదిరాజ్, ఆసియా తస్లీమా, ఎ. జై కృష్ణ, పుల్లెద్దుల ఓంకార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.








