విద్యుత్ అమరుల కుటుంబాలకు ‘కోటి’ భరోసా!
* విద్యుత్ శాఖ ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం.
* ఒక్కో కుటుంబానికి రూ.1 కోటి చొప్పున ప్రమాద బీమా చెక్కుల అందజేత.
* అసెంబ్లీ కమిటీ హాలులో మంత్రుల సమక్షంలో చెక్కులు పంపిణీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.
* రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు..
* సీపెక్ సర్వే ఆధారంగా కుటుంబాలకు రూ.5 లక్షల బీమా కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడి.
* విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క చొరవపై సీఎం ప్రశంసలు.
హైదరాబాద్, మహా.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ శాఖ ఉద్యోగుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలిచింది. ప్రమాదవశాత్తు మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలు వీధిన పడకూడదన్న సదుద్దేశంతో, బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి ఏకంగా కోటి రూపాయల చొప్పున ప్రమాద బీమా చెక్కులను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అందజేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ కమిటీ హాలులో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. విద్యుత్ శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు విడిచిన ఓర్సు సురేష్, ముఖ్తార్ బేగ్ అనే ఇద్దరు ఉద్యోగుల కుటుంబ సభ్యులకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఈ చెక్కులను పంపిణీ చేసి వారిలో మనోధైర్యాన్ని నింపారు. మరణించిన తమ శాఖ ఉద్యోగుల కుటుంబాలను తక్షణమే ఆదుకునేందుకు ముందుకొచ్చిన విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలోని ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లో భరోసా కల్పించేందుకే అసెంబ్లీ సమావేశాల సమయంలో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన స్పష్టం చేశారు.
సామాన్య ప్రజల ఆరోగ్య, ఆర్థిక భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు సభకు వివరించారు. అలాగే సీపెక్ సర్వే ప్రకారం అర్హత తేలిన కుటుంబాలన్నింటికీ రూ.5 లక్షల కుటుంబ బీమా వర్తిస్తుందని ఆయన ప్రకటించారు. ఒక కుటుంబంలో పెద్ద దిక్కు మరణించినప్పుడు, ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయి రోడ్డున పడకూడదన్న ఉత్కృష్టమైన ఆలోచనతోనే ఈ కుటుంబ బీమా పథకాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. అసెంబ్లీ కమిటీ హాలులో అత్యంత భావోద్వేగభరితంగా జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, ధనసరి అనసూయ (సీతక్క), పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి, మహమ్మద్ అజహరుద్దీన్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.








